31 జనవరి 2017

గేదెలు

పొలంలో కట్టుతాడు విప్పగానే గేదెలు
నిధి ఏదో దొరికినట్టు గంతులేస్తూ పరుగు తీసాయి
వాటి పట్టరాని సంతోషం చూస్తే 
దేవుడు కాసేపు వాటికి రెక్కలిస్తే బావుండుననిపించింది

ఎందుకంత గెంతుతున్నాయి అని మిత్రుడినడిగితే 
అవి స్వేచ్చ దొరికిందని సంబరపడుతున్నాయి 
తీరా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కట్రాళ్ళ దగ్గర నిలబడతాయని చెప్పాడు 

కొంచెం దూరం పోయాక వాటిని చూస్తే గంతులాపి 
వెనక్కి నడుస్తున్నట్టుగా ముందుకి నడుస్తున్నాయి 
మళ్ళీ స్వేచ్చ హరించుకుపోయే సమయం ముందుందని  
ఆపాటికి జ్ఞానోదయం కలిగినట్టుంది 

ఈ మాత్రానికి తొందరెందుకని 
స్వేచ్చాసమయాన్ని ఒక్కొక్క అడుగేస్తూ నెమరేస్తున్నాయి

గేదెలని చూస్తే నవ్వూ, జాలీ పుట్టాయి కాని 
మనల్ని చూసుకొంటే అవి కూడా రావు 

ఇక కానివ్వమని కట్రాళ్ళ దగ్గర నిలబడితే 
ఎవరో ఒకరు వాటిని కట్టాలి 

మనం తెలివైన వాళ్ళం గనుక మనల్నెవరూ కట్టనక్కరలేదు 
మనల్ని మనమే శ్రద్ధగా, జాగ్రత్తగా బంధించుకొంటాం 


23.3.2011
_______
'ఆకాశం' నుండి   

29 జనవరి 2017

చివర చూసినవాడు

ఆనందిస్తే ఆకాశం పట్టనట్లు ఆనందించాలి
రోదిస్తే ప్రతి అణువూ కరిగిపోయేటట్లు రోదించాలి

ఏది చేసినా పూర్తిగా చేయాలి
ఏదో ఒకటే చేయాలి
ఇంక ఏమీ మిగలనట్టు చేయాలి 

సున్నితంగా ఉంటే ఆకాశం తాకినా చలించిపోవాలి
కఠినంగా ఉంటే అణువైనా చొరబడలేనంత కఠినం కావాలి

తానే ఉన్నాననుకొంటే ఆకాశమైనా అవసరం లేనట్లుండాలి
తలవంచితే ప్రతి అణువుకీ ప్రార్ధనగా నమస్కరించాలి

ఏది చేసినా చివరికంటా చేయాలి
తల్లివేరు మొదటికైనా, చిటారుకొమ్మకైనా చేరుకోవాలి

ఊహిస్తే ఆకాశం అంతా ఊహించాలి 
చూస్తే అణువు వరకూ చూడాలి  

తర్కమైనా, నమ్మకమైనా వాటి చివర చూడాలి
ఒక చివర చూసినవాడికి రెండవచివర వద్దన్నా తెలుస్తుంది
సృష్టివలయాన్ని దాటినవాడికి విలయసౌందర్యం స్ఫురిస్తుంది  

చివరచూసినవాడు మాత్రమే ప్రపంచరహస్యాల ముడి విప్పగలడు
చావు పుట్టుకలను బొమ్మలుచేసి ఆడుకోగలడు
అతను రావాలనుకొంటే వస్తాడు, వెళ్ళాలనుకొంటే వెళతాడు

మనకన్నీ కావాలి. సగాలూ, పాతికలూ, విరిగినవీ, పగిలినవీ
మనకైనా అర్థంకాని మన కొలతల మేరకి
మసకచీకటిలో దాగినట్టు వీటన్నిటివెనకా మనల్ని దాచుకొంటాం

మన కొలతలకి అందనిదేదో 
మనల్ని కావాలంటే ఇక్కడికి విసిరేస్తుంది
వద్దనుకొంటే వెనక్కు లాగేస్తుంది


30.12.2010 
____________ 
'ఆకాశం' నుండి