30 డిసెంబర్ 2017

మరోసారి చలంగారు..

పదిహేడేళ్ళ వయసులో చలం పరిచయం. కవిత్వం ఇంకా బాగా రాయాలనుకొంటూ, మహాప్రస్థానం పుస్తకం తెరిచినపుడు ముందుమాటలో పరిచయమయ్యాడు. ఎవరీయన, ఈ వేగమేమిటి, మాటల్లో తొణికిసలాడుతున్న నిజాయితీ ఏమిటి, ఆలోచనలో నైశిత్యమేమిటి.. ఇలా అనుకోగల స్పష్టత అప్పటికి లేకపోయినా, ఇలా అనిపించే విభ్రాంతి కలిగింది.
తరువాత చాలాకాలం చలం, శ్రీశ్రీలు జోడుగుర్రాల్లా హృదయంలో దౌడుతీసారు. వారి రచనలు దొరికినవల్లా ఆతృతగా చదువుకొనేవాడిని. ఎందుకు చదువుతాం అలా. అక్కడ కనిపించే వాక్యాల్లో మన ఆత్మ ఏదో ప్రతిఫలించినపుడు అలా వెదుక్కొంటాం మాటలకి.
ముప్పై ఏళ్ళు పైగా గడిచింది. ఇపుడు శ్రీశ్రీ పై ఏమీ ఆసక్తిలేదు, చలం కూడా. ఆ మధ్య మ్యూజింగ్స్ తెరిచి చదవబోతే, పేలవంగా తోచింది. ఇలా అంటే చలం మతస్తులకి కోపం రావచ్చు, చలం ఉంటే మాత్రం తప్పక సంతోషిస్తాడు. ఏ భావజాలమైనా రిజిడ్ గా మారటం నుండే మతం లేదా ఫాసిజం పుట్టుకొస్తుంది. జీవితం ప్రవాహ సదృశం. దాని వేగాన్ని, ఇప్పటికైతే, మనిషి అందుకోలేదనే నాకనిపిస్తుంది. చలం వల్ల నాకు కలిగిన ప్రయోజనాలన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం పట్ల నాదైన మెలకువ తెచ్చుకోగల ధైర్యాన్ని పొందానని చెప్పాలి.
వివరంగా చెప్పాలంటే ఒక్క చలం లో అనేక చలాలున్నారు. వాళ్ళు ఇవాల్టి హిపోక్రాట్స్ లో ఉండే బహుముఖాల మనుషులుకాదు. తనలోని బహుముఖాల్తో విశ్రాంతి లేకుండా పోరాడిన చలం, చలంలోని ముఖ్యమైన చలం. తనలోని అసత్యానికీ, సత్యానికీ, సౌందర్యానికీ, వికారానికీ, మంచికీ, చెడుకీ మధ్య జీవితమంతా ఘర్షణ పడ్డాడు. ఎంత బాధ కలగనీ బయటివాళ్ళవల్లా, తనవల్లా తనకి. విలువలనే గెలిపించుకోవాలని తపన పడ్డాడు. విలువలంటే మంచీ, సౌందర్యమూ, సత్యమూ. ఆ ఘర్షణలోంచి దొరిలిన ముత్యాలే చలం మాటలు, చాలా సందర్భాల్లో. చాలా సందర్భాల్లో తానేమి రాయనక్కర్లేదో అవికూడా రాసాడాయన. కీర్తిలో సింహభాగం ఆయనకి వాటివల్లే దక్కింది.
ఇక, నాకు నచ్చిన చలాలు ముగ్గురు. 1. మ్యూజింగ్స్ చలం (తక్కిన వ్యాసాల పుస్తకాలు ప్రేమలేఖలు, స్త్రీ, బిడ్డలశిక్షణ కూడా) ఈయనను ముఖ్యంగా మేథావి చలం అనవచ్చు. 2. గీతాంజలి చలం (టాగోర్ తో పాటు ఉమర్ఖయ్యాం అనువాదాలు కూడా) ఈయన కవి చలం. 3. అరుణాచల చలం (భగవాన్ స్మృతులు, వెలుగురవ్వలు మొదలు అరుణాచలం నుండి రాసిన రచనలు) ఈయన అన్వేషకుడు చలం. ఈ ముగ్గురు చలాలూ ఆయా తరుణాల్లో వరుసగా నాకు పరిచయమై నాకిక వేరే తోచకుండా చేసారు. ఇక వివరంగా రాయాలనిపించట్లేదు.. చాలేమో.
చలమే లేకపోతే.. అనిపిస్తుంది ఒక్కోసారి. అరుణాచలంలో చలం సమాధి ముందు నిలుచున్నపుడు ఆగకుండా ఒకటే కన్నీరు. ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు.

02 డిసెంబర్ 2017

గాలి కదిలినా

గాలికి గుమ్మంతెర కదిలినా
చెట్ల ఆకులు జలజలా రాలినట్టు
నువ్వు కవిత్వమై రాలవచ్చు

గాలిలో గాలి మాత్రమే ఉన్నట్టు
శబ్దంలో శబ్దం మాత్రమే ఉన్నట్టు
కదలికలో కదలిక మాత్రమే ఉన్నట్టు
నీలో జీవితం మాత్రమే ఉంటే 

గుమ్మంతెర కదిలినా
నువ్వు జీవితమై స్పందించవచ్చు 

మరేమీ కాని జీవితానివి మాత్రమే అయినప్పుడు
మరేమీ కాని స్వేచ్చవి మాత్రమే అయినప్పుడు
వెర్రిబాగుల ఆనందానివై మిగిలినప్పుడు

గుమ్మంతెరలా గాలి కదిలినా
నువ్వు బోలెడు ఆశ్చర్యానివి కావచ్చు
క్షణాన్ని చిట్లించుకొని కాంతిలోకి ఎగిరిపోవచ్చు

19.8.2016
_______________________

బివివి ప్రసాద్ పుస్తకాలు కినిగే.కాం నుండి ఫ్రీ డౌన్లోడ్ కి

బివివి ప్రసాద్ కవిత్వం, హైకూల పుస్తకాలన్నీ 
ఇప్పుడు కినిగే.కాం నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
కవి అన్ని రచనల కోసం ఇదీ లింక్ : 

మొదటి వచన కవితాసంపుటి 'ఆరాధన' (సవరించిన ప్రతి) కోసం : 

రెండవ వచన కవితాసంపుటి 'నేనే ఈ క్షణం' కోసం : 

మూడవ వచన కవితాసంపుటి ' ఆకాశం' కోసం : 

నాలుగవ వచన కవితాసంపుటి 'నీలో కొన్నిసార్లు' కోసం : 

మూడు హైకూ సంపుటాలు
'దృశ్యాదృశ్యం' 'హైకూ' 'పూలురాలాయి' ల సమగ్రసంపుటి కోసం : 

ఈ కవిత్వాన్ని ఆస్వాదించటానికి ఉపకరించే, ప్రసిద్ధకవి 'సౌభాగ్య' రచన 
'తాత్వికభావాల తన్మయత్వం బివివి ప్రసాద్ కవిత్వం' కోసం : 

అంతర్ముఖీనత, తాత్విక చింతన కలిగిన మిత్రులకి 
ఈ కవిత్వం శాంతినీ, కాంతినీ ఇవ్వగలదని ఆశిస్తున్నాను.

13 ఫిబ్రవరి 2017

మనస్సుకీ, హృదయానికీ భేదమేమిటి?

వేర్పాటు భావమే మనస్సు, ఏకత్వ భావమే హృదయం.
మనస్సు భయాన్నీ, కోరికనీ పుట్టిస్తుంది,
హృదయంనుండి ప్రేమా, పంచుకోవటం వికసిస్తాయి.
హృదయం ఆనందాన్ని మిగిల్చే బాధ కలిగిస్తే,
మనస్సు బాధని మిగిల్చే సంతోషాన్నిస్తుంది.
నువ్వు కదిలినపుడు మనస్సువి, నిశ్చలంగా ఉన్నపుడు హృదయానివి.
నేను అది, నేను ఇది అనే భావాలే మనస్సు, 
'నేను' అనే స్వచ్చమైన స్పురణయే హృదయం.

పరిశీలించుకొని చూస్తే 
మనస్సుగా ఉన్నపుడు భారంగా, యాంత్రికంగా, నిద్రాణంగా ఉంటాం.
మనపట్లా, లోకం పట్లా మన చూపు నకారాత్మకంగా, వినిర్మాణంతో ఉంటుంది. 
మనం హృదయంగా ఉన్నపుడు అందంగా, తేలికగా, సృజనాత్మకంగా ఉంటాం.
మన చూపు గుణాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉంటుంది.

మనస్సు నుండి వ్యాఖ్యానిస్తే,
మన జీవితం, మనస్సుకీ, హృదయానికీ నడుమ జరిగే యుద్ధం, 
హృదయం నుండి వ్యాఖ్యానిస్తే,
పోలికేలేని ఒక శ్రావ్య జీవన గీతం.


What is the difference between mind and heart?

A sense of separation is mind, 
Sense of oneness is heart.
Mind generates fear and desire, 
Heart flowers with love and sharing. 
Heart produces joyful pain and mind produces painful joy. 
You are mind, when you move; heart, when you are still.
I am that or this is mind, Pure sense of 'I' is heart.

If we observe ourselves,
When we are mind,
we feel heaviness, boredom, sleepy.
We remain negative and destructive towards ourselves and others.

When we are heart,
we feel lighter, creative and beauty.
We remain positive and constructive.

And all our life is, 
continues battle between our mind and heart,
when we comment from mind.
an unique melodious song of life
when we comment from heart.

సంపాదన

పేరూ, ధనం, విజ్ఞానమూ, అధికారం
బలప్రదర్శన వేదిక ఏదయినా కావచ్చును
సంపాదించి, మరింత బలం సాధించి ఏంచేయాలి
జీవనానందం చుట్టూ సమాధి నిర్మించి ఏంచూడాలి 

చిననాటి చల్లని వెన్నెల చూపులు జారిపోయినపుడు
నిష్కపటంగా, నిస్సంకోచంగా ఇక నవ్వలేనపుడు
ఆనందంలోకి హాయిగా ఎగిరే మంత్రం మరిచినపుడు
అనుకోగానే సులువుగా నిద్రలోకి మాయంకాలేనపుడు 

సాటివారి దైన్యం సదా నిందితుడిని చేస్తున్నపుడు
నిండుగా, హుందాగా, నిశ్చింతగా, నిర్మలంగా
జీవనచిత్రం నుండి నిష్క్రమించటం చాతకానపుడు 

సంపాదన అర్థమేమిటి, సమర్ధత సారాంశమేమిటి  
ఓటి సంతోషాల మోత వలన ఒరిగినదేమిటి
అందంలేని లక్ష్యాల సాధనలో ఆనందం ఒంపుకొన్నాక 
ఖాళీ మనుషుల, ఖాళీ చప్పట్లు మనలో నింపినదేమిటి

దేవుడినెందుకు నిందిస్తాము
తనలాగా మనని సృజించుకొని పంపిన తొలిరోజులు మరుస్తాము
ఏ గర్వం జీవితాన్ని నరకం చేస్తుంది
ఇప్పుడు ఏ వివేకం కోల్పోయిన స్వర్గం తిరిగి తెస్తుంది 


26.3.2011
____________
'ఆకాశం ' నుండి 

10 ఫిబ్రవరి 2017

కవిత్వం

నాకు నచ్చిన భావాలను నీకు నచ్చిన మాటలలో చెప్పటం కవిత్వం
నీకూ, నాకూ మధ్యనున్న ఖాళీలో శతకోటిభావాలను దర్శించటం కవిత్వం
భావాల పంచరంగుల బొమ్మలతో కాసేపు ఆడుకోవటం కవిత్వం

పంచ మహాభూతాలని తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలో
నిన్ను నువ్వూ, నన్ను నేనూ మరిచిపోవటం కవిత్వం

దాక్కోవటం కవిత్వం, దొరికిపోవటం కవిత్వం
దాక్కొంటూ, దొరికిపోతూ అలసిపోయిన నువ్వూ, నేనులు
ఒకటిగా విశ్రాంతి పొందటం కవిత్వం 

బ్రతికిన క్షణం కవిత్వం
క్షణం క్షణం పుడుతూనే వుండటం కవిత్వం
పాతాళంలో నుండి పొరలిపోవు జలంలా
ఎప్పటికీ బ్రతుకుమీద ఉబుకుతున్న ఉత్సాహం కవిత్వం

కదలకుండా కదిలిచూపే నైపుణ్యం కవిత్వం
అక్షరాలతీగెల్లో విద్యుత్తై విభ్రాంతి నివ్వటం కవిత్వం 
మాట వెళ్ళిపోయాక మన మధ్యన కాంతులీను మౌనం అది కవిత్వం


18.1.2011
____________ 
'ఆకాశం ' నుండి 

07 ఫిబ్రవరి 2017

పంజరాలు

'కొన్ని సమయాలు' పత్రికలో చదివి
ఎవరో మాట్లాడుతూ ఏ సందర్భం ఉద్దేశించారన్నారు

ఏ ఉద్యమం మీద అక్షరాల నీళ్ళు చల్లుతున్నారని వారి ఉద్దేశ్యం
అది ఏ ఉద్యమం గురించీ కాదు
మన అందరి జీవితోద్యమం గురించని కవి చెప్పాడు
బాగానే ఉంది కాని, సమాజస్పృహ కావాలి కదా అన్నారు 

ఆకాశంలో ఎగిరే పక్షిని
పంజరంలోని పక్షి ఊచలచాటు నుండి చూస్తూ
పాపం అది ఆకాశంలో బంధించబడింది 
ఏంచేయాలో తెలియక ఎగురుతోందనుకొంటుంది
పక్షీ ఆకాశంలో ఎందుకు ఎగురుతావు 
పంజరం చేరుకొని ఊచల్ని తిట్టవచ్చు కదా అంటుంది 

జీవితం కాన్వాసుమీద సమాజం ఒక బొమ్మ మాత్రమే
జీవితం లేకుండా సమాజంలేదు 
జీవించే ఏర్పాట్లు మాత్రమే జీవితం కాదు
జీవితం అర్థమైతే సమాజం అర్థమౌతుంది, అర్థవంతమౌతుందని
కవి ఎప్పటిలాగే తనకు తానే జవాబు చెప్పుకొన్నాడు 

ఇది ఆకాశం, ఇది స్వేచ్ఛ, ఇది జీవితలక్ష్యమని స్పష్టంగా తెలుసుకొని
జీవితం దారితప్పిన మూలాలు వెదికిపట్టుకొని
మన బహిరంతర పోరాటాలూ, త్యాగాలూ చేయాలని,
పోరాటం ఏదైనా దు:ఖంతోనే, జీవనక్షేత్రంలోనే అంటే
పరనింద మినహా జీవితమంటే ఏ ఆసక్తీ లేనివారికి అర్థంకాదు 

చాలామందికి నచ్చిన మాటలు చాలు, చిత్తశుద్ధి అక్కరలేదు
విలువలు మాట్లాడితే చాలు, వాటికి దూరంగా బ్రతికినా ఫరవాలేదు

ఎవరి కనురెప్పలు ఎవరు విప్పగలరు
పంజరాలు నిండిన ఆకాశంలో 
మిగిలిన ఆకాశంకూడా పంజరంలాగానే కనబడుతుంది


23.3.2011
____________
'ఆకాశం' నుండి 

03 ఫిబ్రవరి 2017

ముక్తికాంక్ష

బాగా చిన్నపుడు, ఆలోచించటం నేర్చుకొంటున్నపుడు
ముక్తికోసం మునులు తపస్సు చేస్తారని చదివి

జీవితం ఇంత అందమైంది కదా, ఆనందనిధి కదా
జన్మ ఒక శాపమైనట్టు, పాపమైనట్టు వాళ్ళెందుకు స్వేచ్ఛకోసం తపించారని
జనం మధ్య వెచ్చగా బ్రతకటం మాని అరణ్యాలకి వలసవెళ్ళారని
అమాయకంగా, వాళ్ళంటే దయగా తలుచుకొనేవాడిని

నిద్రపోతున్నపుడు ఊరిలో సడిలేకుండా ప్రవేశించిన వరదలా
కబుర్లలో మునిగి గమనించనపుడు పగటిలోకి చేరుకున్న రాత్రిలా
ఒక్కొక్కరోజూ గడిచి, కాలం నా దేహాన్నీ, మనస్సునీ, సందర్భాలనీ
మాయాజాలం చేసినట్టు మార్చుకొంటూ పోయాక

ఒకనాడు అకస్మాత్తుగా బాల్యం వెళ్ళిపోవటం తెలుసుకొని
నలుపు ప్రక్కన నిలబెట్టిన తెలుపులా
ఇవాళ్టి నా ప్రక్కన, బాల్యాన్ని నిలబెట్టి చూసుకొన్నపుడు

జీవితం ఆకాశంలా సుకుమారం కాదని, విశాలం, నిత్య నిర్మలం కాదని
నా ఆకాశం నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందని
నేను బంధించబడ్డానని, నా ప్రతి కదలికా, నవ్వూ, ఏడుపూ బంధించబడ్డాయని
నేను ఉండటమూ, వెళ్ళటమూ కూడా నా చేతుల్లో లేవని తెలిసింది

అప్పుడు బాల్యంపై బెంగ పెట్టుకొని
వెళ్ళిపోయిన పెద్దల వస్తువుల్ని వారికోసం తాకినట్టు
చిననాటి ఆలోచనలని తడుముకొని చూసినపుడు
మునుల ముక్తికాంక్ష జ్ఞాపకం వచ్చింది

మునులెందుకు స్వేచ్ఛకోసం తపస్సు చేస్తారో అర్థమైంది
సాటి మనుషులకన్నా, చివరికి అన్నంకన్నా, గాలికన్నా
స్వేచ్ఛ ఎంత ప్రియమైనదో, అవసరమైనదో తెలిసివచ్చింది

మనిషి చేయవలసిన పనికి
వ్యతిరేకంగా, ఎంత వేగంగా వెళుతున్నాడో అర్థమైంది
నాపైనా, వెచ్చని మానవుల గుంపులపైనా దయ కలిగింది
అప్పుడు నా ప్రయాణం మొదలైంది


3.3.2011
___________
'ఆకాశం' నుండి

అలవాటు

ఒకరోజు రోజువారీ పనుల్లోంచి బయటపడిచూడాలి
మన వలయం మీద మనమే తిరుగుబాటు చేసి స్వేచ్ఛను ప్రకటించాలి

వాహనం విడిచి కాలినడకన తిరగాలి
రోజూ చూసే తెలియని మనిషిని మొదటిసారి పలకరించాలి
బరువులన్నీ కాసేపు గాలికొదిలి, పగలంతా నిద్రపోవాలి. ఒక రాత్రి మేలుకోవాలి

ఆకాశాన్ని ఈ చివరనుండి ఆ చివరికి కొలిచి చూడాలి
దేవుడేమైనా ఇటీవల ఆకాశం కొలత మార్చాడేమో ఆలోచించాలి
చిననాటి నక్షత్రాలకీ, ఇప్పటికీ లెక్క సరిపోయిందో, లేదో సరిచూసుకోవాలి

ఒంటరిగా కూర్చుని ఒకసారి నవ్వి చూసుకొని
మన నవ్వుకేమైనా మరామతు అవసరమేమో పరిశీలించాలి
ఏడవటం మరిచామో, ఏమో కాసేపు కన్నీరు రాల్చాలి

ఏదో ఒకటి అసలు ఎందుకు చేయాలో ఆలోచించాలి
ఆలోచన ఆగిపోతే ఏం జరుగుతుందో ప్రశాంతంగా గమనించాలి

ప్రపంచం మాయో, కాదో తెలియదు కాని అలవాటు మహామాయ
తిమ్మిరిలా అది క్రమ్మిందంటే
బ్రతుకు అందమూ తెలియదు, బాధా తెలియదు
దానిని విదిలించుకొని చూస్తే మరలా పుట్టినట్లుంటుంది

జీవనానందం తెలియాలంటే ఏదీ అలవాటు కాకుండా బ్రతకాలి
ఎప్పుడూ అలవాట్లకి జారబడకుండా నిలబడి ఉండాలి
బ్రతికివుండటం మాత్రమే అలవాటు కావాలి

తీరం వదిలిన దేన్నైనా ప్రవాహం తీసుకుపోయినట్లు
అలవాట్లను వదిలితే చాలు
జీవితం తనతో మనల్ని తీసుకుపోతుంది


10.3.2011
____________
'ఆకాశం' నుండి

31 జనవరి 2017

గేదెలు

పొలంలో కట్టుతాడు విప్పగానే గేదెలు
నిధి ఏదో దొరికినట్టు గంతులేస్తూ పరుగు తీసాయి
వాటి పట్టరాని సంతోషం చూస్తే 
దేవుడు కాసేపు వాటికి రెక్కలిస్తే బావుండుననిపించింది

ఎందుకంత గెంతుతున్నాయి అని మిత్రుడినడిగితే 
అవి స్వేచ్చ దొరికిందని సంబరపడుతున్నాయి 
తీరా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కట్రాళ్ళ దగ్గర నిలబడతాయని చెప్పాడు 

కొంచెం దూరం పోయాక వాటిని చూస్తే గంతులాపి 
వెనక్కి నడుస్తున్నట్టుగా ముందుకి నడుస్తున్నాయి 
మళ్ళీ స్వేచ్చ హరించుకుపోయే సమయం ముందుందని  
ఆపాటికి జ్ఞానోదయం కలిగినట్టుంది 

ఈ మాత్రానికి తొందరెందుకని 
స్వేచ్చాసమయాన్ని ఒక్కొక్క అడుగేస్తూ నెమరేస్తున్నాయి

గేదెలని చూస్తే నవ్వూ, జాలీ పుట్టాయి కాని 
మనల్ని చూసుకొంటే అవి కూడా రావు 

ఇక కానివ్వమని కట్రాళ్ళ దగ్గర నిలబడితే 
ఎవరో ఒకరు వాటిని కట్టాలి 

మనం తెలివైన వాళ్ళం గనుక మనల్నెవరూ కట్టనక్కరలేదు 
మనల్ని మనమే శ్రద్ధగా, జాగ్రత్తగా బంధించుకొంటాం 


23.3.2011
_______
'ఆకాశం' నుండి   

29 జనవరి 2017

చివర చూసినవాడు

ఆనందిస్తే ఆకాశం పట్టనట్లు ఆనందించాలి
రోదిస్తే ప్రతి అణువూ కరిగిపోయేటట్లు రోదించాలి

ఏది చేసినా పూర్తిగా చేయాలి
ఏదో ఒకటే చేయాలి
ఇంక ఏమీ మిగలనట్టు చేయాలి 

సున్నితంగా ఉంటే ఆకాశం తాకినా చలించిపోవాలి
కఠినంగా ఉంటే అణువైనా చొరబడలేనంత కఠినం కావాలి

తానే ఉన్నాననుకొంటే ఆకాశమైనా అవసరం లేనట్లుండాలి
తలవంచితే ప్రతి అణువుకీ ప్రార్ధనగా నమస్కరించాలి

ఏది చేసినా చివరికంటా చేయాలి
తల్లివేరు మొదటికైనా, చిటారుకొమ్మకైనా చేరుకోవాలి

ఊహిస్తే ఆకాశం అంతా ఊహించాలి 
చూస్తే అణువు వరకూ చూడాలి  

తర్కమైనా, నమ్మకమైనా వాటి చివర చూడాలి
ఒక చివర చూసినవాడికి రెండవచివర వద్దన్నా తెలుస్తుంది
సృష్టివలయాన్ని దాటినవాడికి విలయసౌందర్యం స్ఫురిస్తుంది  

చివరచూసినవాడు మాత్రమే ప్రపంచరహస్యాల ముడి విప్పగలడు
చావు పుట్టుకలను బొమ్మలుచేసి ఆడుకోగలడు
అతను రావాలనుకొంటే వస్తాడు, వెళ్ళాలనుకొంటే వెళతాడు

మనకన్నీ కావాలి. సగాలూ, పాతికలూ, విరిగినవీ, పగిలినవీ
మనకైనా అర్థంకాని మన కొలతల మేరకి
మసకచీకటిలో దాగినట్టు వీటన్నిటివెనకా మనల్ని దాచుకొంటాం

మన కొలతలకి అందనిదేదో 
మనల్ని కావాలంటే ఇక్కడికి విసిరేస్తుంది
వద్దనుకొంటే వెనక్కు లాగేస్తుంది


30.12.2010 
____________ 
'ఆకాశం' నుండి