17 జనవరి 2016

నిరపేక్ష సత్యం : రెండు మార్గాలు

"విశ్రాంతిగా 'నేను'ను గమనిస్తూవుండు.
వాస్తవం దాని వెనుకే వుంది.
ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వుండు;
అది వికసిస్తుంది లేదా నిన్ను లోగొంటుంది.

నిన్ను సంస్కరించుకొనే ప్రయత్నం చెయ్యకు,
మార్పు ఎంత నిష్ఫలమో గ్రహించు.
మార్పు చెందేది మారుతూనే వుంటుంది,
మారనిది ఎదురుచూస్తూ వుంటుంది.

మారేది మారనిదాన్నిస్వీకరించాలని ఎదురుచూడకు,
అది ఎప్పటికీ జరగదు.
మారేదంతా భ్రమా జనితమని గ్రహించి విడిచిపెడితే,
మార్పులేనిది తనంత తానే వస్తుంది. (తెలుస్తుంది)" ~ నిసర్గదత్త

నిరపేక్షసత్యాన్ని తెలిసేందుకు 
ఆధునిక జ్ఞానులు బలంగా ప్రతిపాదిస్తున్న మార్గాలు ముఖ్యంగా రెండు కనిపిస్తున్నాయి.
ఒకటి. 'నేను'. రెండు. 'ఇప్పుడు'.

మన చుట్టూ ఉన్న ఇతర దేహాల నుండి మన దేహాన్ని వేరు చేస్తున్నమౌలిక భావమేది అని పరిశీలిస్తే 
అది 'నేను' అన్న భావంగా తెలియవస్తుంది.
ఆ 'నేను' అన్నది ఒక ఆలోచన కాదు, ఒక ఊహకాదు, ఒక ఉద్వేగం కాదు.

ఆ 'నేను' అన్నది మనలోని అతిసున్నితమైన అనుభూతిగానో,
మహా బలమైన అనుభవంగానో,
పుట్టింది మొదలు ఇప్పటివరకూ ఏమార్పూ చెందని స్థిరమైన ఉనికిలానో,
అతి సూక్ష్మమైన స్పురణ గానో మనకి తెలుస్తూ ఉంటుంది.

మానసిక కల్లోలాల పట్ల అనాసక్తంగా ఉండి,
వాటికి ఆధారంగా, స్థిరంగా ఉన్న 'నేను' పట్ల ఆసక్తితో, దానినే గమనిస్తూ ఉంటే
'నేను' కు ఆధారమైన నిరపేక్షసత్యం తెలుస్తుందంటారు.
అది తెలియటమనీ. చూడటమనీ, అనుభవమనీ అనటానికి కూడా లేదు.
కానీ, భాష ఎంతదూరం వెళ్ళినా మానసిక పరిధిలోనిదే గనుక,
మనస్సుకి అతీతంగా, ఆధారంగా ఉన్న'అది'ని గురించి అంతకన్నా దగ్గరగా చెప్పటం వీలుకాదు.

అట్లాగే 'ఇప్పుడు' అన్నపుడు కూడా 
అది మన ఇంద్రియ సంవేదనలకు అంటే శబ్దమూ, స్పర్శా, రూపమూ, రుచీ, వాసనలకు తెలిసే ఇప్పుడు కాదు.
ఆ సంవేదనలను మెలకువగా గమనిస్తే, 
వాటికి ఆధారంగా ఒక అగాధమైన, స్థిరమైన నిశ్శబ్దం లేదా శూన్యం లేదా నిండుదనం (పూర్ణం) తెలుస్తుంది.

అది క్షణక్షణం మారే కాలానికి ఆధారంగా ఉన్న'ఇప్పుడు'.
నాకు దానిని substance (ఆధారం?) అనాలనిపిస్తుంది.
ఉదాహరణగా చెప్పాలంటే,సినిమా తెరమీది దృశ్యం మారుతున్నా, తెర మారనట్లు
కాలం మారుతున్నా, ఆ 'ఇప్పుడు' మారటంలేదు.
గతమూ, భవితా ఎప్పుడూ మన ఊహ లేదా జ్ఞాపకమే కాని 'ఇప్పుడు' కాలేవు కదా.

ఇప్పుడు కి, ఇప్పుడులో, మనం అనుభవిస్తున్నసంవేదనలకి ఆధారమేమిటి అని పరిశీలిస్తే
జ్ఞానులు చెప్పే ఆ అనంతమైన వర్తమానం లేదా ఇప్పుడు కి ఆధారంగా ఉన్న'ఇప్పుడు' స్పురిస్తుంది.

ఇంద్రియ సంవేదనలూ, వాటి వలన, వాటి కోసం పుట్టిన ఉద్వేగాలూ, ఆలోచనలూ విడిచి 
తెరవంటి 'ఇప్పుడు' ని గమనిస్తూ ఉన్నా, ఆ నిరపేక్ష సత్యం మనని లోగొంటుంది అని వారు చెబుతారు.

~ బివివి ప్రసాద్