26 డిసెంబర్ 2014

పూవురాలేను

పగటి కాంతిరేకలు చీకటుల సోలినటు
మధురస్వప్నమొకటి మెలకువన జారినటు
ఆమె వెన్నెలనవ్వు నీలోకి వాలినటు
పూవురాలేను పూవువలె నెమ్మదిని

గాలివాలువెంట ఒంపు తిరిగి
గాలినొక పూవుగా హొయలు దీర్చి
రంగురంగుల గిరికీలు చుట్టి
కాంతినొక పూవుగా చిత్రించి విడచి

నేలపై మృదువుగా మేనువాల్చి
నేల నొకపూవు రేకులా మలచి
పూవొకటి రాలేను ఇచట ఈ స్థలములో
తననీడపై తాను సీతాకోకయ్యి వాలేను

సెలయేటి పరుగులా, పసిపాప నవ్వులా
చిరుగాలి తరగలా, పరిమళపు తెరలా
పూవొకటి రాలేను ఈ క్షణములోన
పూవంటి క్షణమొకటి రాలేను స్వప్నమ్ములోన

_______________________

18 డిసెంబర్ 2014

తోటివారిని

తోటివారిని గాజులానోపూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడలేమా
బహుశాగ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే   
అద్దంలో ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా, తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటోఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూదిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయోఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయస్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటోచూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూకాస్త కన్నీరూఇంకా అర్ధం సంతరించుకోని  ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చేనిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగాలోతుగానమ్మకంగా..

__________________
ప్రచురణ: సారంగ 11.12.14 

11 డిసెంబర్ 2014

'ఆకాశం' సంపుటికి నూతలపాటి కవితా సత్కారం

'ఆకాశం' సంపుటి నూతలపాటి కవితా సత్కారం - 2011 కు ఎంపికైంది. ఈ మేరకు 'ఆకాశం' కవితాసంపుటి కవి బివివి ప్రసాద్ ని నవంబరు 15 న తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో గంగాధరం సాహితీ కుటుంబం వారు ప్రశంసా పత్రం, నగదుతో సత్కరించారు. 

ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గంగాధరం సాహితీ కుటుంబం అధ్యక్షులు విద్వాన్ ఎస్.మునిసుందరం, కార్యదర్శి ఆచార్య డి. కిరణ్ క్రాంత్ చౌదరి, ఆచార్య మేడిపల్లి రవికుమార్, కవులు బివివి ప్రసాద్, పలమనేరు బాలాజీ (నూతలపాటి కవితా సత్కారం - 2012 కు ఎంపికైన 'ఇద్దరిమధ్య' కవితాసంపుటి కవి), నూతలపాటి వెంకటరమణ పాల్గొన్నారు.

సభ విశేషాలు ఇక్కడి ఫొటోలు, ఆడియో, వీడియో లలో గమనించవచ్చును.


'ఆకాశం' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఇద్దరిమధ్య' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బివివి ప్రసాద్ ప్రసంగం వీడియోకు ఇక్కడ క్లిక్ చేయండి.

03 డిసెంబర్ 2014

అక్షరాశ్రమం

సముద్రంపై ఎగిరి ఎగిరి మళ్ళీ నౌకపైనే వాలిన పక్షిలా
లోకమంతా తిరిగి మళ్ళీ అక్షరాలపై వాలతావు
నీ కెంతమేలు చేస్తున్నాయో ఎపుడూ గమనించలేదు కాని
భూమ్మీద అక్షరాలు మినహా నీకు తోడెవరూ ఉన్నట్టులేరు

దు:ఖంలోకీ, వెలితిలోకీ ఘనీభవించినపుడు
ఏ శూన్యం నుండో పుట్టుకొచ్చిన కిరణాల్లా అక్షరాలు
నీ ఉద్విగ్న హృదయాన్ని చేరి మెల్లగా నిన్ను కరిగిస్తాయి

ఇంత దయా, శాంతీ నీ అక్షరాలకెలా సాధ్యమని
మిత్రులు విస్మయపడుతున్నపుడు ఆలోచించలేదు కాని
వాటిని ఆశ్రయించే క్షణాల్లో ఏదో దివ్యత్వం
నీ దు:ఖాన్ని దయగా, వెలితిని శాంతిగా పరిపక్వం చేస్తున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క అద్దంలా కనిపిస్తోంది
అద్దాలని అతికినప్పుడల్లా
నీలోపల ముక్కలైనదేదో అతుక్కొన్న ఊరట కలుగుతోంది

ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క నక్షత్రంలా కనిపిస్తోంది
కాసిని నక్షత్రాలని పోగేసుకొన్న ప్రతిసారీ
పిపీలికంలా మసలే నువ్వు పాలపుంత వవుతున్నట్లుంది

ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఓ కన్నీటి బిందువవుతోంది
కాసిని కన్నీళ్ళని జారవిడిచిన ప్రతిసారీ
గర్వమో, స్వార్ధమో, మరొక  చీకటో కరిగి

మామూలు మనిషి దేవుడవుతున్నట్లుంది
జీవితం ప్రార్ధనా గీతమవుతున్నట్లుంది
ఎన్నటికీ మరణించనిదేదో లోలోపల వెలుగుతున్నట్లుంది

________________________
ప్రచురణ: తెలుగువెలుగు డిసెంబర్ 14 

02 డిసెంబర్ 2014

పునరుత్థానం


ఒక గాయం ఎటూ కదలనివ్వక
నిలబడినచోటనే కూలబడేలా చేస్తుంది
చూస్తున్న దిక్కులోని శూన్యంలోకి
వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటుంది 

గాయం ఏమీ చెయ్యదు 
అప్పటివరకూ అల్లుకొన్న తెలిసీ, తెలియని స్వప్నాలనీ 
స్వప్నాలకి సుతారంగా పూయబోతున్న సంతోషాల పువ్వులనీ
చిందరవందర చేయడం మినహా
పాలుగారే వెన్నెలల్నుండీ, ఉభయసంధ్యల వర్ణాలనుండీ
సేకరించుకొన్న జీవనలాలసని ఒకేసారి చెరిపేయడం మినహా

ఇన్నాళ్ళూ పాడింది పాటే కాదు, మళ్ళీ మొదలుపెట్టు
భూగోళమంత జీవితాన్ని నీపై మోపుతున్నాను,
ఇప్పుడు ఆకాశంలా ఎగిరిచూపించు అంటుంది గాయం

2
జీవితోత్సవాన్నుండి వేరుపడ్డ హృదయం
తడిసి మెరిసే మాటకోసం, చూపుకోసం, స్పర్శకోసం
తప్పిపోయిన పిల్లాడిలా ఎడతెగక ఎదురుచూస్తుంది

దారులన్నీ మూసుకుపోతున్న చీకట్నుంచి చీకట్లోకి
దుఃఖజలంతో బరువెక్కుతున్న కాలంనుంచి కాలంలోకి
ఉన్నచోటనే వేళ్ళూనుకొంటున్న గాయంతో వేచివుంటుంది

3
దైవీశక్తులేవో దీవించిన స్పటికంలాంటి క్షణమొకటి ప్రవేశిస్తుంది
ఉన్నట్లుండి ఒకనిట్టూర్పు గుబురుకొమ్మల్లోంచి పక్షిలా ఎగురుతుంది
కాసిని కన్నీటిమొగ్గలు చెక్కిళ్ళపై పారాడుతాయి

ఎక్కడిదో నీళ్లచప్పుడూ, పక్షిరెక్కల అలికిడీ
చెట్ల ఆకుల్ని గాలి మృదువుగా నిమిరిన మర్మరధ్వనీ
చెవిలో జాగ్రత్తగా గుసగుసలాడుతాయి

జీవితం చాలా పెద్దది, చాలా దయగలది కూడా
ఊరికే నిలబడు, ఒక అడుగువేయి
తక్కినదంతా తను చూసుకొంటుంది

లేతమొక్కలా కూలిపోయిన నీవు
నిలబడతావు, నిలబడతావు
ఒక మహావృక్షపు ఛాయను నీ వెనుక చిత్రించుకొంటూ

మేఘాలు నుదుటిని చుంబించేవరకూ నిలబడుతూనే ఉంటావు

______________________
ప్రచురణ: ఈమాట నవంబర్ 2014