23 మే 2013

'ఆకాశం' కవిత్వ సంపుటి : ఫ్రీ డౌన్ లోడ్



2012 సంవత్సరంలో శ్రీ ఇస్మాయిల్ కవితా పురస్కారం; స్నేహనిధి, హైదరాబాద్ వారి సాహిత్య పురస్కారం; గుంటూరు జిల్లా రచయితల సంఘం వారి పురస్కారం పొందిన ఆకాశం కవితాసంపుటిని ఆవకాయ.కాం నుండి డౌన్ లోడ్ చేసుకొని, చదవచ్చును.

2011 డిసెంబరు లో 'ఆకాశం' పరిచయసభలో ప్రసిద్ధ కవులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, శ్రీ కె.శివారెడ్డి, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ ల ప్రసంగాలను ఈ లింక్ ద్వారా వినండి.

మరికొందరు ప్రసిద్ధ కవుల అభిప్రాయాలు, కవిత్వ ప్రేమికుల అభిప్రాయాలు:
బి.వి.వి. ప్రసాద్ ఆంతరిక ప్రయాణం అంతరిక్షయానం లాంటిదే.  అది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. అతను అందుకున్న ఎత్తులు, ప్రయాణించిన లోతులు మన వూహకందనివి. అతని భాష గొప్ప సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని సాధించింది. అతని భావాలు మహాతాత్వికుల చింతనలు.  ఐతే తాత్త్వికులకు లేని కవిత్వదృష్టి ప్రసాద్‌కు ఉంది. 
~ సౌభాగ్య, ఆంధ్రభూమి దినపత్రికలో 

..ఇలా మనిషి నుంచి మనిషిలోని విశ్వాకాశానికి రూట్ మ్యాప్ ఇచ్చేశాడు.
హృదయం ప్రవేశించినపుడు ఏం జరుగుతుందో చెప్తాడు. ఎలా నిద్రపోవాలో చెప్తాడు. ఎలా మెలకువగా ఉండాలో చెప్తాడు. ఏమీ చెయ్యకుండా గర్భంలో శిశువులా కూచుండాలని చెప్తాడు. 'గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడివై ఆరోగ్యంగా జీవించ ' మని చెప్తాడు.

ఆకాశం కనిపించే ముందు తన కొసగాలుల విసురులతోనే ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలు చూపిస్తుందో, శూన్యంలోకి మరింత మృదువుగా వికసించిన పూలు, తిరిగి రాలాయని చెప్పడానికి మధ్య మంచుతెరల్లో ఏమేమి రహస్యాలున్నాయో, వాటిని వినిపించీ వినిపించనట్లు, కనిపించీ కనిపించనట్లు, యుగాల సారాంశం ఓ క్షణంలో స్ఫురించి, తిరిగి మరుపు కమ్మినట్లు ఇతడితో ఆడుకుంది ఆకాశం. ఆకాశమయినా తాను ఆకాశాన్ని కానని, ఆకాశానికి ముందూ, వెనకా ఉన్నదాన్నని ఓ ఆకాశం ఇతడికి కొన్ని క్షణాల్లో స్ఫురింపచేసి ఆనక మళ్ళీ, మళ్ళీ మాయ చేసింది. అప్పుడు బివివికి ఏమనిపించింది. ఏమిటో ఈ ఆకాశం ఏ లెక్కలకీ అందదు. లెక్కలు మానేస్తే అర్థమౌతానంటుంది. ఇది మన అంతరాత్మలా మాట్లాడుతుంది అనిపించింది. పైకి చూస్తే కనిపించే ఆకాశం, లోపలికి చూస్తే ఇలా ఇక్కడ కూడా ఉంటుందా అనిపించింది. అప్పుడు ఆకాశం వెనక మహా నిశ్శబ్దాన్ని కావాలని కలగన్నాడు.
~ వసీరా, పాలపిట్ట సాహిత్యమాసపత్రికలో

దీన్ని చదువుతున్నంతసేపూ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కవిత్వంలోని పదాలంత మృదువుగా, పోలికలంత లలితంగా, భావనలంత నిర్మలంగా ఉంటుంది. 'ఎడతెగని ప్రార్ధన లాంటి ఆర్ద్రతలోకి సమస్తాన్నీ అనువదిస్తున్నట్లుంటుంది '  
   ఈ కవిత్వపు అవసరం ఉన్నట్టు తడుతుంది. ద్వితీయ ప్రపంచంలో, అంటే తన సృష్టిలోనే ఇరుక్కుపోయి ఊపిరాడక అవస్థ పడుతున్న మనిషికి విముక్తి చూపాల్సిన అవసరం కనబడుతుంది.
   ధ్యానం గుర్తుకొస్తుంది. మనిషికి బాహ్య ప్రపంచాన్ని మాత్రమే తెలుసుకొని సుఖశాంతులతో ఉండలేడు కనక ధ్యానావసరం కలిగింది. అంత:ప్రపంచం ఒకటి ఉందని తెలియాలి, అది ఎలాంటిదో తెలియాలి. అప్పుడు బాహ్య ప్రపంచాన్ని ఎలా సమీపించాలో, ఏంచేసినా ఎలా చెయ్యాలో తెలుస్తుంది.

ఈ ఆకాశపు కవితా వాక్యం, దాని తర్వాత వాక్యం. మొత్తంగా ఈ కవితాసంపుటి ప్రాఫెట్ తర్వాత పుస్తకం.

   తిలక్ గురించి రాసిన ఒక కవితలో నేను మీ తర్వాత తరం వాడిని అన్నారు ప్రసాద్. అక్కడ అనాల్సిన మాట 'నేను జీబ్రాన్ తర్వాత తరం వాడిని ' అని నాకనిపిస్తుంది.
   ఈ ఆకాశం ఆంగ్లంలోకి అనువాదం కావాలని నా ఆకాంక్ష. భారతదేశపు జీబ్రాన్ ఇలా ఉంటాడని ప్రపంచానికి తెలియాలి కనుక ఈ అనువాదానికి తగిన launching కూడా ఉండాలని కోరిక.
~ డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు, చినుకు సాహిత్యమాసపత్రికలో

ఆకాశమంటే అంతు దొరకని రహస్యం, ఏదీ దాచిపెట్టలేని బహిరంగం కూడా. ఒక్క బివివి ప్రసాద్‌కే కాదు, మనక్కూడా. కానీ మనకంత తీరికేది. చూపేది. ప్రసాద్‌కున్న పరిశీలనేది. మనమంతా ప్రవాహం. ప్రసాద్ గట్టుమీదున్న చెట్టు. గట్టు మీద నిలబడి ఎలాంటి గర్వం లేకుండా జీవితాకాశాన్ని అక్షరాల తీగలు పేర్చుకొని కవిత్వం రాగాలు తీస్తాడు. ఒక్క పాలూ శృతి తప్పదు. ఏ దరువూ అక్షరాన్ని అదనంగా జోడించుకోదు. కుదించుకోదు. నూరు కవితలున్న ఆకాశం చదివాక నూటొక్కటో కవిత ఎందుకులేదన్న బాధ. ప్రసాద్ ఆరవ పుస్తకం ఎప్పుడొస్తుందన్న డిమాండ్, ఆశ.

అడుగడుగునా కవి గురించీ, ఆకాశం గురించీ చెప్పినట్లు నడిచే ప్రసాద్ కవిత్వంలో అబ్బురపరచని వాక్యమేదైనా దొరుకుతుందేమోనని చూసాను. సరల వాక్యం సరమెక్కడైనా తెగిపోకపోతుందా అని చూసాను. ఓడిపోవడం పాఠకుడిగా మొదటిసారి గర్వించాను.
~ ఏనుగు నరసింహారెడ్డి, వార్త దినపత్రికలో

కవి ఎవ్వరినీ ద్వేషించమనడు, ఎవ్వరినీ నిందించమనడు. కోపమో బాధో కాదు, కన్నీళ్ళు - కుంటి సాకులూ కాదు, బ్రతకడం నీ కర్తవ్యమంటాడు. నీ కోసం నువ్వు కాలపు కౌగిళ్ళలో నుండి మరొక్క రోజును దొంగిలించుకు దొరలా బ్రతికి చూడమంటాడు. శక్తికి మించిన లక్ష్యాలు, పరు
గుపందాలుగా మారిన ఎడారి జీవితాల్లో గుర్రప్పందాలు కాసేపైనా మర్చిపోయి, ఇలా సేదతీరమని చెప్పే కవిత్వం ఈ రోజు మనకు చాలా అవసరం. లోలోపలి సామర్థ్యాన్ని మరొక్కసారి తరచి చూసుకోవటానికి, కనీసం వెళ్తున్న దారి మనమెంచుకున్న గమ్యాలకు చేరవేస్తుందో లేదో చూసుకోవడానికైనా మనిషికి విశ్రాంతి అవసరం. మనసుకు సాంత్వన అవసరం. బ్రతకాలన్న కాంక్ష అన్నింటికన్నా బలంగా అవసరం. ఇవేమీ లేని నాడు రేకులుగా విడివడుతున్న స్వాంతసరోజాన్ని ఒక్కటి చేయలేని అసమర్థతతో జీవితాన్ని ఛిద్రం చేసుకునే మనుష్యులను ఆపడమెవ్వరి తరమూ కాబోదు.

సంఘంలోని ఆలోచనాపరులను ఆత్మావలోకనం చేసుకునే దిశగా అడుగులు వేయించగలిగితే, అంతకు మించి కవిత్వం సాధించగల పరమార్థం వేరొకటి ఉంటుందనుకోను. మానవ జీవితాలు వికాసోన్ముఖంగా సాగాలన్న అవగాహనతోనూ, తాత్విక వివేచనతోనూ కవితాత్మను పట్టుకునే ప్రయత్నంలో, బి.వి.వి గారు నూటికి నూరుపాళ్ళూ సఫలీకృతులైనారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

"నిరవధికమైన సమాజంలో నివాతదీపమై కాపడవలసింది మానవత్వమనీ దానికి ఏ రూపంలో కేతనాలెత్తినా అని మంచి కవిత్వమ"నీ ప్రతిపాదించిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి మాటల సాక్షిగా, "ఆకాశం" ఈ తరం తప్పక చదవాల్సిన కవిత్వం. పది మంది చేత చదివించబడవలసిన సున్నితమైన, సమున్నతమైన కవిత్వం.
~ మానస చామర్తి, తన బ్లాగ్ మధుమానసం లో

కవి అయినా, కళాకారుడైనా తన టార్గెట్ ఆడియన్స్ ని నిరంతరం అబ్బురపరుస్తూనే ఉండాలి. పాఠకుడి స్థాయి పెరిగేకొద్దీ తాను ఒక మెట్టు పైనే ఉన్నానని నిరూపించుకుంటూ ఉండాలి. అది జరగని రోజున పఠితల మనోఫలకం నుంచి చెదరిపోవడానికి ఎంతోకాలం పట్టదు. This is a rule of thumb for success in any existing business on the planet.

నేను కవిత్వాన్ని ఆస్వాదించగలననీ, కేవలం చదవడానికే చదివి అనుభూతిని అరువు తెచ్చుకునే రకం కాదనీ నాకు చాలాసార్లు నిరూపణ అయింది. అయినా కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, చలం, శ్రీశ్రీ, తిలక్‌లతో ఆగిపోవడానికి ప్రధాన కారణం పైన చెప్పినదే. నేను చదివిన ఒకటీఅరా ఆధునిక కవితలు నా పాండిత్యాన్ని పరీక్షించకపోగా, సదరు ‘కవుల’ మానసిక పరిణతి మీద ప్రశ్నలు రేకెత్తించాయి. This so-called ‘Modern Poetry’ is not so ‘modern’ in thoughts and definitely not my cup of coffee అనుకుని వదిలేశాను. అయితే ఒకటీఅరా సర్వం కాదనీ, కవిత్వపు గుబాళింపులు ‘గతజన్మలోని జాజిపూల సువాసన’ కాదని ‘ఆకాశం’ గుర్తుచేసింది. ఆధునిక కవిత్వ ధోరణి పట్ల నా అభిప్రాయం మార్చుకోవాలేమో అని ఆలోచింపజేసింది.
~ చాణక్య, పుస్తకం.నెట్ లో

తనకు తెలియని ప్రశ్నలు హృదయంలో ప్రవేశించినపుడు మెదలిన ప్రతిప్రశ్న ఇందులో సమాధానమై నిలుస్తుంది. కళ్లు చెమరుస్తాయి. ప్రతి మనిషీ తన మాయాలోకాన్ని దాటి దైవత్వం చేరే అవకాశం కల్పిస్తుంది. గాయాల్ని మాన్పలేని జీవితాన్ని కౌగలించుకోవడం మనమూ నేర్చుకుంటాం. ఈ పుస్తకం నిండా స్నేహితలా పలుకరించి చల్లబరిచే చరణాలే .. మనలో మనకు నచ్చిన మనిషిని చూపించే కారణాలే.

ప్రతి అక్షరం దయకురిపిస్తూ జీవనభయానికి దూరంగా మనల్ని జరుపుతున్నట్లు.. మనలో మేలుకొన్నట్లు కలగంటాం. నవ్వులాంటి అందాలనూ, భయాల్లాంటి అరణ్యాలను సమానంగా మోసినా.. మనల్ని మనం వెక్కిరించుకుని తేలికైపోయే వరాన్ని ప్రసాదిస్తుంది ఆకాశం . ఈ పుస్తకం చదివిన పాఠకునికి ఏ మనిషైనా అపురూపంగా కనిపిస్తాడు . ప్రతి నవ్వులోనూ దర్శించేది అందాన్నే . గాఢమైన నిద్రతరువాత పొదవుకున్న మెలకువనూ పొందుతాం.

మనలో మనం మేలుకోనే మాటలు చదువుతున్నప్పుడు ఈ ఒక్క పుస్తకమే జీవిత సారమనిపిస్తుంది. రాతిలోని కప్పలాంటి జీవితాలకి రాయి చిట్లి ఆకాశం కనిపించినట్లు ప్రశాంతతను ముప్పొరిగొనే భావాలు ఈ పుస్తకం నిండా దర్శనమిస్తాయి.
~ యశస్వి సతీష్, తన బ్లాగ్ మనసుబాట లో

..ఒక్కోసారి పిల్లలకి తాయిలాలివ్వకుండానే, బతిమాలకుండానే, అసలు వాళ్లని పట్టించుకోకుండా బల్లమీద కాగితాలు పెట్టుకుని మనమేదో రాసుకుంటున్నప్పుడు, ఎందుకో తెలీకుండా, విడి సందర్భాల్లో ఎంత బుజ్జగించినా ఇవ్వని ముద్దొకటి ఊహించకుండా పెట్టేసి తమ దారిన తాము ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు- పదాల పటాటోపం లేకుండా, తెలుసుకోవడం తప్ప మరే ఉద్దేశమూ లేకుండా వాళ్లడిగే ప్రశ్నల్లోని నిజాయితీలాంటి స్వఛ్ఛమైన ప్రేమొకటి మనమీద మనకి వెల్లువెత్తుతుంది.

ఇవ్వాళ నా గీటురాయికి గంధపు చెక్కా, నా కత్తి మొనకి పూలగుత్తీ, గీతకి అటువైపు విసిరెయ్యడానికి తొక్కుడుబిళ్ళా, నా రాతల మధ్యలో ఊహించని విరామంలాంటి లేతముద్దూ ఒకేసారి దొరికాయి.
~ స్వాతి కుమారి బండ్లమూడి, పుస్తకం.నెట్ లో

బివివి ప్రసాద్ ఇతర సంపుటులు కూడా ఆవకాయ.కాం నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

బివివి ప్రసాద్ హైకూలు : (దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి సంపుటులు, హైకూ వ్యాసాలు)

19 మే 2013

రోజుల బొమ్మలు


పగలంతా కాలం నదిలో
దృశ్యాలు, ముఖాలు, ఉద్వేగవలయాలు ప్రవహించిపోతాయి 
నది ఒడ్డున చెట్టులా నిలిచి
నదిమీద వల విసిరినట్టు నా చూపుల్ని విసిరి జీవనసారాన్ని సేకరించుకొంటాను.
సాయంత్రమవుతుంది 
నా రోజులపత్రాలు సాయంత్రంలాగే  రంగులుమారి చీకటిలో రాలిపోతాయి 

మరొకరోజుని రాల్చుకొన్న చెట్టునయి
చీకటితో నల్లబడిన కాలం నదిలో నా ప్రతిబింబం జాడ వెదకబోతాను
చెట్టూ, నదీ, ప్రతిబింబమూ, చీకటీ ఒకటే దిగుల్లోకి తమని కోల్పోతాయి

తమ స్వభావాల్ని మరిచి
తన ప్రతిబింబాలలోకి నది తానే ప్రవహిస్తుంది
చెట్టు ప్రతిబింబం చెట్టులోకి ప్రవహిస్తుంది
సమస్తాన్నీ దాచవలసిన చీకటి సమస్తంలో దాగొంటుంది

జీవితం పసిపాప ఇవాళ్టి పగటిబొమ్మని పట్టుకొని
'ఇది కూడా నే కలగన్న బొమ్మకా'దని శూన్యంలోకి విసిరేసి
చిరంతన శాంతిలో కొత్తబొమ్మని కలగంటుంది  

_____________________
ప్రచురణ: వాకిలి.కాం 17.5.2013 

12 మే 2013

మధ్యాహ్నపు నీడ


1
ఈ మధ్యాహ్నం 
తొందరేంలేనట్టు నిదానంగా విస్తరిస్తున్న నీడల్నిచూస్తున్నపుడు   
దయాగుణమేదో కవిత్వంలా మెలమెల్లగా కనులు విప్పుతోంది     

నిద్రచాలని రాత్రిలోంచి ఈదుకొంటూ వచ్చి
ఇవాళ్టి దృశ్యరాశిలో తొలిభాగమంతా ఆలోచనలలో పొగొట్టుకొన్న నన్ను   
ఈ మధ్యాహ్నపు నీడ స్నేహితుడిలా పరిశీలించింది  

2
పగలొకటే చాలనీ, రాత్రికి లోకంతో పనేముందనీ 
పోరాటం జీవితమనీ, శాంతికి చోటులేదనీ వాదించిన మిత్రులతో

రెండూ సమానమనీ, ఒకదాన్నొకటి నింపుకొంటూ ఉంటాయనీ 
ఒకటి కోల్పోతే, రెండవదీ కోల్పోతామనీ  
ఒప్పించలేకపోయిన నా అశక్తతకి దయగా నవ్వుకొంటున్నపుడు  

పగటి వెలుతురుమహల్లోకి రాత్రి పంపిన అతిథిలా ప్రవేశిస్తున్న
ఈ మధ్యాహ్నపు నీడ 
నువ్వూ నాలాంటివాడివే అంటూ మృదువుగా పలకరించింది  

3
నల్లని రాత్రిలానో, తెల్లని పగటిలానో  
తనకంటూ ఒక రంగునేమీ మిగుల్చుకోని నీడ

గర్వం నుండి ప్రేమకీ, ఉద్వేగాల నుండి స్పష్టతకీ ప్రయాణించే  
నా అక్షరాల్లాగే, వాటిలోంచి లీలగా కనిపించే నాలాగే 
బహుపలుచని ఉనికిని మిగుల్చుకొంటూ సమీపించింది

4
నను కన్న జీవితం
నేను ఒంటరినయ్యానని భావించేవేళల్లో తోడుంటుందని సృష్టించినట్లు   
ఈ మధ్యాహ్నపు నీడ దయలాగా నెమ్మదిగా తాకింది నన్ను  

  
ప్రచురణ: ఆవకాయ.కాం 5.5.2013

07 మే 2013

నేనూ - స్త్రీలూ


1
వాళ్ళని చూస్తూనే ఉన్నాను నా బాల్యంనుండీ
వాళ్ళ సమీపంలో నేను పసివాడినవుతాను
కలలుమేల్కొన్న యువకుడినవుతాను
నిండైన నదిలాంటి పూర్ణమానవుడి నవుతాను 

నా అంతట నేనే అవుతున్నానా
వాళ్ళు నన్నేమైనా చేస్తున్నారా అని ఆశ్చర్యం 

వాళ్ళని చూడటమెపుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది 

నేనీ మట్టి మనిషినైనట్టూ
వాళ్ళు ఏ కాంతినుండో ఇలా వచ్చినట్టూ 
లేదూ, ఇది వాళ్ళ కాంతిలోకమైనట్టూ
నేను ఏ చీకటినుండో వాళ్ళకోసం వచ్చినట్టూ ఉంటుంది 

2
వాళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు నా బాల్యంనుండీ
నా సమీపంలో వాళ్ళు తెల్లనికాంతి అవుతారు 
కలలరంగుల్తో రెపరెపలాడే కిరణాలవుతారు 
నిండైన జీవితమవుతారు
 
నా సామీప్యం వాళ్ళనలా చేస్తుందా
నేనేం కావాలో బోధిస్తున్నారా అని ఆశ్చర్యం

వాళ్ళు నన్ను చూడటమెపుడూ ఆశ్చర్యంగానే వుంటుంది 

అందమైన కల ఏదో అకస్మాత్తుగా జీవితంలో వాలినట్టూ 
బరువైన జీవితమేదో కలలాగా తేలిపోయినట్టూ వుంటుంది 


______________________
ప్రచురణ: తెలుగువన్.కాం 6.5.2013 

05 మే 2013

దు:ఖం లోపలికి


ఒక్కొక్క తలుపూ మూస్తూ తెరలుతెరలుగా చీకటిని ఆహ్వానించాను
ఇపుడు పదేపదే రాబందులా నామీద వాలుతున్న దు:ఖాన్ని చూస్తున్నాను
చీకటిలాంటి దు:ఖాన్ని మృదువుగా, ప్రశాంతంగా తాకుతున్నాను

దు:ఖమంటే ఏమిటో తెలీదు, లోకంలో దు:ఖం ఎందుకుందో తెలీదు
మూసిన గదిలోకి చీకటీ,
మూసుకొన్న హృదయంలోకి దు:ఖమూ ఎలా చేరుతాయో తెలీదు

పాలపుంతల మధ్య పరుచుకొన్న చీకటిలా
వెలుతురుకిరణాలని పీల్చుకొనే కృష్ణబిలాల్లా
సమస్త సుఖశాంతుల్నీ పీల్చివేసే దు:ఖం వుంది

సుఖం, దు:ఖం దేహంలోపలి రసాయన చర్యలా
మనస్సుపై క్రీడించే మహాశక్తులా
కాదేమో, తెలీదు. అవునేమో, తెలీదు.

ఇపుడు నేను దు:ఖంలో వున్నాను
దు:ఖం, నేనూ ఒకటై వున్నాము
నేనిపుడు దు:ఖాన్ని, నేనిపుడు చీకటిని

సమస్తం నుండీ ముడుచుకొంటున్నవాడిని
సమస్తం నుండీ నన్ను నేను దాచుకొంటున్నవాడిని
మరింత ఘనీభవిస్తున్న శిలాజాన్ని, సాంద్రమవుతున్న జీవితాన్ని

జీవితం లోలోపలికి దు:ఖపు వేర్లు దింపి
రేపటి ఆకాశపుటంచుల్లో
ఆకుపచ్చని కాంతుల్ని ఎగరేసే అవధిలేని ఆనందాన్ని
ఘనీభవించిన చీకటిని కరిగి ఆవిరిలా విహరించే వెలుతురుని

ఇపుడు నేను
పగటినీ, రాత్రినీ నిశ్శబ్దంగా మోస్తున్న ఆకాశంలా 
ఆనందాన్నీ, దు:ఖాన్నీనిశ్శబ్దంగా స్పృశిస్తున్నఒక రహస్యస్పృహని

03 మే 2013

కానుకగా బివివి ప్రసాద్ హైకూ సంపుటాలు




'ప్రసాద్ గారి హైకూలని చదివాక కలిగే ఊరటా, ఆహ్లాద భావనా, జాగృతమైనట్లనిపించే సంవేదనాశీలతా అనుభవైకవేద్యాలు. నా ప్రయాణాల్లో, ప్రవాసాల్లో, ఈ హైకూ సంపుటాలను నా దగ్గర ఉంచుకునే వాణ్ణి నేను. ఓ ఒంటరి రాత్రి తటాలున ఏదో ఓ పేజీ తెరిచి, హృదయాన్ని తాకే హైకూలను ఒకటో రెండో చదివి, నిశ్చలత్వాన్నో, సన్నని కదలికనో, ఓ సున్నితమైన స్పందననో అనుభూతిలోకి తెచ్చుకోవటం ఎంత బావుంటుందో!' 
~ పుస్తకం.నెట్‌లో శ్రీనివాస్ వురుపుటూరి   


'ఇక్కడ Dr.K.S Rao గారని Retd. IAS officer గా రొకాయన ఉన్నారు.ఆయన జపాన్‌లో కొంతకాలమున్నారు. హైకూలంటే ఆయనకు ఇష్టం. కొన్నివేల హైకూలు చదివుంటారు. మీ హైకూలు చదివి, 'ఇవి నిజంగా హైకూలు. ఈ మధ్య కొంతమంది రాస్తున్నవి హైకూలు కావు. ఇతను నిజంగా మంచి హైకూలు రాసాడు ' అన్నారు. 
~ ప్రసిద్ధకవి ఇస్మాయిల్‌గారు కవికి రాసిన ఉత్తరం నుండి. 

'ఇవాళ వుదయం లక్ష హడావుడి పనులు ముగించుకుని, ఆఫీసుకు వెళ్ళటానికి తయారై - నాతోపాటు వస్తానన్న స్నేహితురాలికోసం యెదురుచూస్తూ, పెరిగిన బి.పి. తో, పనులు సకాలంలో సక్రమంగా పూర్తికావేమొనన్న ఆందోళనతో వేయి దిగుళ్ళతో, వందభయాలతో సతమతమవుతూ అనుకోకుండా మీ రాలిన పూలను చేతిలోకి తీసుకున్నాను.
ఇపుడు ఈ క్షణాన యెంత నిర్లిప్త ప్రశాంత దు:ఖమో మనసునిండా. దు:ఖం బాధతో కాదు. ఆనందంతోనూ కాదు. యెందుకో నాకు నిజంగా తెలియదు. తెలియాల్సిన అవసరమూ లేదు. ఈ హృదయానుభూతి బాగుంది. ఈ పుస్తకం ప్రతులు ఒక వందకొని నా కోసం పది వుంచుకుని మిగిలినవి నా ప్రియమిత్రులందరికీ కానుకగా యిస్తాను.
ఒక చక్కని చల్లని స్నేహమయమైన పరిసరాలను యెక్కడైనా యెప్పుడైనా మనుషులచుట్టూ సృష్టించగల శక్తి రాలిన మీ కవితా కుసుమాలకు వుంది. మానవులకు సేదదీర్చటానికి పకృతి సమకూర్చిన అపురూపవరాలన్నిటినీ ఒక చిన్ని పుస్తకంలో పేర్చి ప్రకృతిని అనాలోచితంగా, నిర్దయగా, నిర్లజ్జగా ధ్వంస చేసిన మానవజాతికి యెంతో ప్రేమతో యిచ్చారు మీరు.
మీ మనసులో మానవులమీది ప్రేమను అలాగే నిలుపుకోండి. నిలుపుకుంటారు. '
~ ప్రసిద్ధరచయిత్రి ఓల్గాగారు కవికి రాసిన ఉత్తరం.



నా మూడు హైకూ సంపుటుల, హైకూ వ్యాసాల ఈ - పుస్తకం ఆవకాయ.కాం నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.  ఇక్కడ క్లిక్ చేయండి.