22 ఏప్రిల్ 2013

మరొక తొలి ఉదయంవేళ


1
జీవితం తననెందుకు కన్నదని అతనాలోచించాడు
మరొకరి శ్వాసమీద బ్రతికేందుకు తానొక నీడనికాదనీ     
ఈ ఉదయం తాజాగా మొలకెత్తిన బంగారుకిరణాన్ననీ అనిపించిందతనికి    

కిరణాలు వాటంతట అవి పుడతాయనీ 
పుట్టించేవేవైనా నీడలై మిగులుతాయనీ 
తన నమ్మకాలు చేరలేని లోలోపలి స్వచ్చతలో మెరిసింది         

2
తనని తనలాగే 
దు:ఖించమనీ, నవ్వమనీ, కోపించమనీ, శపించమనీ, దీవించమనీ   
జీవితం అతన్ని కన్నది

అంతుతెలియని దాహం పుట్టించే, మోహం పుట్టించే జీవితం
అతని అనుభవం కోసమే తన చిత్రవిచిత్ర మెరుపుల మాలికలని  
అతనికన్నా ముందు సృష్టించి అతన్ని ఇక్కడికి విడిచింది  

తనవైన కళ్ళతో తనకై సృష్టించిన ఇంద్రియజాల ప్రపంచాన్ని చూడమనీ 
తనదైన దేహంతో, ఆకలితో, ప్రశ్నలతో ప్రపంచమంతా పరిగెత్తమనీ  
ఎవరూచూడనిచోట తనదైన చిరునవ్వునీ, కన్నీటినీ, ఏకాంతసంగీతాన్నీ పదిలపరచమనీ         
విడిచివెళ్ళేలోగా కాస్తంత వెలుతురునో, చీకటినో, వీలయితే ఖాళీనో లోకానికి కానుక చెయ్యమనీ    
జీవితం అతని చెవిలో జాగ్రత్తచెప్పి మరీ సృష్టించుకొంది

3
జీవితం తననెందుకు కన్నదో తొలిసారి కళ్ళు తెరుచుకున్నాయతనికి  
తన నియమాలు ఇతరుల్నెలా బాధిస్తాయో, వాటిమధ్య తననెట్లా బంధించుకొని      
కమురువాసనలగాలిని శ్వాసిస్తున్నాడో జీవితం అతని చెవిలో చెప్పి, మృదువుగా మొట్టింది  

నిన్నటి స్వేచ్చాసూత్రం ఇవాళొక కొత్తసంకెల అవుతుందనీ   
ప్రవాహాన్ని జీవించడమంటే ప్రవహించటమేననీ 
తెరుచుకొంటున్న కళ్ళముందు వాలుతున్న వానతెరలా, వెలుతురులా తెలిసింది అతనికి     

4
ఇప్పుడతనికి బోధపడింది 
యుగాలుగా భూమిని ఆకాశానికి చేర్చుతున్న పర్వతాలు ఏ రెండూ ఒకలా లేనట్లే  
ఇవాళ భూమిలోంచి స్వేచ్ఛపొందిన లేతచిగుర్లు ఏ రెండూ ఒకలా ఉండవని       

ఇప్పుడతనికి బోధపడింది
ఏ పర్వతం పొగరుకన్నా, ఏ చిగురు పొగరూ  
రవంతైనా తక్కువ పరిమళభరితం కాదని, రవంతైనా సౌందర్యంలో తీసిపోదని 
పర్వతాన్ని స్వప్నించినప్పటికంటే జీవితం మరింత శ్రద్ధగా, అపురూపంగా లేతచిగురుని స్వప్నించుకొందని  

నిజంగా, ఇప్పుడతనికి బోధపడింది
వినమ్రుడై ధరణికి తలవాల్చి చూస్తే 
ఒక లేతచిగురు కూడా పర్వతంకన్నా ఎత్తుగా కనిపిస్తుందని  

5
ప్రతి నశ్వరదృశ్యమూ, పలచనిగాలిలా చలించి వెళ్ళిపోయే ప్రతిక్షణమూ
ఆనందోన్మత్త అగాధభూమికలనుండి అంతుతెలియని దు:ఖంతో
ఇదే తొలికానుక అన్నట్టు, ఇది ఎప్పటికీ శాశ్వతమన్నట్టు తాను సృష్టించుకొందని  
అతనిలో మిగిలిన కాస్తంత స్వచ్ఛతలో ప్రవేశించి జీవితం బోధపరిచింది    

అతని స్వచ్ఛతలో తన ముఖం సరిచూసుకొని దయగా నవ్వుకొంది   

6
గతించిన కోటి తొలి ఉదయాల, రానున్న తొలి ఉదయాల తాత్పర్యమేమిటో,    
తననీ, ఇతర్లనీ, అనేకానేక ద్వంద్వాలనీ జీవితం ఎందుకు కన్నదో   
అమాయకత్వంలా, అద్దంలా, ఆకాశంలా విచ్చుకొన్న ఈ ఉదయం అతనికి నిజంగా బోధపడింది     


_____________________________
ప్రచురణ: ‘సాహితి’  ఆంధ్రభూమి 22.4.2013

20 ఏప్రిల్ 2013

అవతలి తీరం గుసగుసలు


1
ఒక సాయంత్రానికి ముందు
ఇద్దరు వృద్దులతో గడిపాను కాసిని నిముషాలు

మా చుట్టూ జీవనవైభవం ప్రదర్శిస్తున్న దృశ్యమాన ప్రపంచం
కరుగుతున్న క్షణాలతో పాటు
వాళ్ళ వెనుకగా నేనూ వృద్దుడినవుతున్న లీలామాత్రపు స్పృహ

వాళ్ళ మాటలు వింటున్నాను

కనులకి సరిగా కనిపించటం లేదు, చెవులకి వినిపించటం లేదు
ఆకలి లేదు, నిద్ర రావటం లేదు
జీవితాన్ని అనుభవించటం తెలియకుండానే జీవితోత్సాహం అస్తమిస్తోంది
అవతలి తీరం నుండి పిలుపు లీలగా వినవస్తోంది

2
వారితో ఇన్నాళ్ళూ సన్నిహితంగా గడిపి
వారి జీవితం నుండి నేనేమి నేర్చుకొన్నానో తెలియదు కాని
వారి అస్తమయ కిరణాలు ఇప్పుడు ఏవో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి

ఏదో ఒకరోజు వృద్దాప్యం నన్నూ ఆహ్వానిస్తుంది
నా అస్తమయ కిరణాలు కూడా ఏదో ఒకరోజు చీకటిలో కరిగిపోతాయి

ఇంకా శక్తి ఉండగానే
ఇంకా ఉత్సవ సౌరభమేదో నాపై నాట్యం చేస్తుండగానే
విప్పవలసిన ముడులేవో త్వరగా విప్పుకోవాలి

'నీకు మరణం లేద 'ని జ్ఞానులు చెప్పిన రహస్యాన్ని
నా పడవ మునిగిపోయేలోగానే కనుగొని తీరాలి
     
3
మా చుట్టూ కాంతిలో తేలుతున్న చెట్లూ
నిశ్శబ్దంలో తేలుతున్న పక్షుల పాటలూ
శూన్యంలో తేలుతున్న జీవితానుభవమూ
వాటిని విడిచి వెళ్ళే క్షణాల స్పృహలోంచి  కొత్తగా కనిపిస్తున్నాయి

ఆ సాయంత్రం వృద్దులతో గడిపిన నిముషాల్లో
వారెందుకు మాట్లాడుకొన్నారో తెలియదు కాని
వారిలోంచి, ఇంతకు ముందు ఎన్నడూ వినని
నా అవతలి తీరం గుసగుసలు వినిపించి నా యాత్రను వేగిరపరిచాయి


_____________________________

ప్రచురణ:
సారంగ బుక్స్.కాం 11.4.2013


07 ఏప్రిల్ 2013

కల అనుకొందాం

కల అనుకొందాం కాసేపు
ఈ సృష్టిని అద్దంలో కనిపించే నగరం అనుకొందాం
పీడకలనుండి మెలకువలోకి ఉలిక్కిపడినట్టు
జీవితంనుండి చిరంతన శాంతిలోకి ఉలిక్కిపడి మేలుకొందాం

ఏమీ తోచని పిల్లవాడు
చిత్తుకాగితంనిండా పిచ్చిగీతలు చుడుతున్నట్టు
మొదలూ, చివరా లేని  సమస్యలచుట్టూ ఆలోచనలు చుడుతున్నాం

కాగితాన్ని వదిలి ఆడుకోవటంలోకీ
ఆలోచనల్ని వదిలి శాంతిలోకీ వెళ్లివద్దాం
కాసేపలా జీవితాన్ని కలగా ఊహించటంలోకి నడిచిచూద్దాం

సృష్టిని కల అనుకొందాం కాసేపు
సృష్టిలో సుడిగుండమై కూరుకుపోయే 'నేను'ను
కలనుండి బయటకు నడిచే ద్వారమనుకొందాం

కాగితాలెటూ ఎగిరిపోవు
వాటిపై బరువుంచిన రాయిలాంటి నేను ఎక్కడికీ మాయంకాదు

రంగురంగుల పంజరాలతో మిరుమిట్లుగొలిపే ప్రపంచం
ఉన్నచోటనే యుగాలపర్యంతం వేలాడుతుంది కానీ,
కాసేపలా స్వేచ్ఛలోకీ, ఏదీ లేకపోవటంలోకీ, ఏదీ నేను కాకపోవటంలోకీ
నవ్వులాగా సునాయాసంగా పరుగుపెడదాం
హద్దుల్లేని పసిదనం కెరటాల్లో మునిగి కేరింతలుకొడదాం

'జీవితం ఉత్త ఊహ, భయపడ ' కని చెప్పుకొందాం
నిద్రలోకో, ప్రేమలోకో, సంగీతంలోకో వెళ్ళినట్టు
కాసేపలా, 'ఇది కలా, నిజమా' అనే సందేహంలోకైనా వెళ్లివద్దాం

ఇంతాచేసి ఇది కలేకదా అనుకొందాం
చప్పరించి మరిచిపోతున్న పిప్పరమెంటు రుచి అనుకొందాం
ఈ నిమిషాన్ని తాజా జ్ఞాపకమనుకొందాం
ఈ నిమిషాన్ని మరకపడుతున్న ఊహ అనుకొందాం
 
కాగితమ్మీది అక్షరాలను కలలో ఉన్నట్టు చదువుకొందాం
కాసేపైనా కలలేవీ లేకపోవటాన్ని కలగందాం, శాంతిగా ఉందాం

కాస్తంత శక్తినీ, దయనీ, కాంతినీ నింపుకొని
జ్వరగ్రస్త జీవితాలని మంత్రమయ హస్తాలతో తాకుదాం


_____________________________
ప్రచురణ: ఆదివారం ఆంధ్రభూమి 7.4.2013