02 సెప్టెంబర్ 2012

బి.వి.వి.ప్రసాద్ హైకూలు – ఒక పరిచయం: శ్రీనివాస్ వురుపుటూరి


నిన్న పుస్తకం.నెట్ చూస్తున్నపుడు 2011 జనవరిలో బివివి ప్రసాద్ హైకూ పుస్తకాలపై శ్రీనివాస్ వురుపుటూరి రాసిన వ్యాసం కనిపించింది. మనిషికి నిజంగా శాంతినిచ్చేదీ, కాసేపైనా అతన్ని నిజమైన జీవితంతో నింపి, జీవన సంఘర్షణల లోకి మరలా తాజాగా, మరింత వివేకం తో, శక్తితో ప్రవేశించటానికి తనవంతు సహాయం చేసేదీ గుణాత్మక (positive) మైన కవిత్వమని, మనం మాట్లాడే మాట సత్యం, ప్రియం, హితం ల మేలుకలయికగా ఉండటమే అక్షరోపాసన అనీ నమ్మి, రాస్తున్న కవిత్వానికి, ఆ నమ్మకాన్ని రుజువు చేసిన పాఠకుడు ఎవరైనా ఎదురైనపుడల్లా, అతను నాకు, నీ మార్గం మంచిది, నువ్వు నడవాలి, దు:ఖితుల్ని నడిపించాలి నీ కవిత్వం లోకి అని వెన్ను తట్టినట్టు అనిపిస్తుంది. చదివి ఊరుకోకుండా పదిమందికీ పరిచయం చేసిన శ్రీనివాస్ వురుపుటూరిగారి సహృదయానికి నమస్సులు.  పుస్తకం.నెట్ వారి సౌజన్యంతో ఆ వ్యాసం లింక్ నీ, వ్యాసాన్నీ ఇక్కడ పొందుపరుస్తున్నాను. లింక్ ఇక్కడ చూడవచ్చు.

ఓ పది పన్నెండేళ్ళ క్రితం, కవిత్వం చదివి ఇప్పటికన్నా బాగా స్పందించగలిగిన కాలంలో, ఓ రెండు హైకూ సంకలనాలను కొనుక్కున్నాను. కవి పేరు బి.వి.వి.ప్రసాద్. పుస్తకాల పేర్లు: 1) హైకూ 2) పూలు రాలాయి

అంతకు మునుపు, చివరాఖరి ఎనభైలల్లో, హైకూల గురించి చేరా గారు రాయగా చదివినప్పుడూ, అడపాదడపా పెన్నా శివరామకృష్ణ గారివో, గాలి నాసర రెడ్డి గారివో హైకూలను చూసినప్పుడూ, అర్థం కాక – “ఇదేదో కవిత్వంలో పొదుపు ఉద్యమంలా ఉంది” అని అనుకున్నాను చాలాకాలం. ప్రసాద్ గారి హైకూలను చదవటం నాకు కనువిప్పు కలిగించింది.

హైకూ ఒక జపానీయ ఛందో రీతి. పదిహేడు మాత్రలకి పరిమితం. ఆ మాట వినగానే (ఒకోసారి, ఆ మాట వినకపోయినప్పటికీ) హైకూలను మినీ కవితలతోనో, నానీలతోనో పోల్చి కవిత్వపు ఫాషన్‌గా కొట్టిపారేస్తారు కొందరు. కానీ, వీటికీ హైకూలకీ బోలెడంత వ్యత్యాసం! మినీ కవితలూ, నానీలూ చమత్కారికల్లా ఉంటాయి. కోటబిలిటీ కోసం రాసినట్లుంటాయి. హైకూ మాటో? హైకూకి ఓ తాత్త్విక నేపథ్యం ఉంది! కొన్ని వందల ఏళ్ళుగా సాగి వస్తున్న సజీవ సంప్రదాయం, హైకూ. తత్త్వమెరిగిన కవి రాసిన హైకూ పాఠకుడికి ఎంతో విశిష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. అందుకు అందమైన సాక్ష్యాలు ఇప్పుడు మీకు పరిచితమవుతున్న ఈ రెండు పుస్తకాలు.

నాకు అర్థమైనంతలో –
హైకూ కవితకి బాగా నప్పే వస్తువులు ప్రకృతీ, పసిపిల్లలున్నూ. హైకూ కవి మనః ప్రవృత్తిలో అపరిమితమైన సంవేదనాశీలతా, సునిశిత పరిశీలనా శక్తీ, ఏకాంత ప్రియత్వమూ, మామూలు వస్తువుల్లో అనుభవాలలో కొత్తదనాన్ని పట్టుకోగల లోచూపూ, ఓ రకమైన నిర్మోహత్వమూ, తనని తాను మరుగు పరచుకోగల వినమ్రతా భాగమై ఉండాలి. శాంతమూ, కరుణా, సున్నితమైన హాస్యమూ – ఇవీ హైకూ కవితకి ప్రధాన రసాలు.

సూచనాప్రాయంగా చెప్పి పాఠకుడిని ఒక ధ్యానస్థితిలోకి, ఒక సున్నితత్వంలోకి తీసుకెళ్ళటంలో ఉంటుంది కవి నేర్పు. అయిదారు పొడి మాటలతోనే ఓ పదచిత్రం గీయాలి, అంతే! ఆ తరువాత పని పాఠకుడికి వదిలేయాలి. “చంద్రుడిని చూపించే వేలు” అని వర్ణించారు హైకూని ఇస్మాయిల్ గారు, దృశ్యాదృశ్యం పుస్తకానికి సమకూర్చిన భూమికలో.

ప్రసాద్ గారి హైకూలని చదివాక కలిగే ఊరటా, ఆహ్లాద భావనా, జాగృతమైనట్లనిపించే సంవేదనాశీలతా అనుభవైకవేద్యాలు. నా ప్రయాణాల్లో, ప్రవాసాల్లో, ఈ హైకూ సంపుటాలను నా దగ్గర ఉంచుకునే వాణ్ణి నేను. ఓ ఒంటరి రాత్రి తటాలున ఏదో ఓ పేజీ తెరిచి, హృదయాన్ని తాకే హైకూలను ఒకటో రెండో చదివి, నిశ్చలత్వాన్నో, సన్నని కదలికనో, ఓ సున్నితమైన స్పందననో అనుభూతిలోకి తెచ్చుకోవటం ఎంత బావుంటుందో!

కవయిత్రి ఓల్గా గారిలా అన్నారట, ప్రసాద్ గారికి రాసిన ఓ ఉత్తరంలో: “వంద భయాలతో, వేయి ఆందోళనలతో సతమతమవుతున్న సందర్భంలో మీ రాలిన పూలు అందుకున్నాను. క్షణంలోనే నా మనస్సు ఒక నిష్కళంకమైన, ప్రసన్నమైన విషాదానుభూతితో నిండిపోయింది” (డేవిడ్ షుల్మన్ గారి  Spring, Heat, Rains: A South Indian Diary నుంచి. ఓల్గా గారి అనుభూతిని వర్ణించేందుకు ఆయన వాడిన పదబంధం: “immaculate, serene sorrow”). తన మిత్రులకి పంచిపెట్టేందుకని ఓ వంద ప్రతులను కొనుక్కున్నారట ఆవిడ.

ఈ రెండు పుస్తకాలకి కవి రాసుకున్న పరిచయ వ్యాసాలు ఎంతో విలువైనవి. హైకూ సంకలనం లోని ‘ప్రకృతీ, జీవితం హైకూల మయమే’ నుంచి కొన్ని వాక్యాలు ఉదహరిస్తాను:
“దృశ్యానికీ, అదృశ్యానికీ; శబ్దానికీ, నిశ్శబ్దానికీ మధ్య సున్నితమైన సరిహద్దు రేఖ హైకూ. హైకూ కవి ఆ సరిహద్దుల్లో సంచరిస్తూ ఉంటాడు. దృశ్యం నుంచి అదృశ్యానికీ, శబ్దం నుంచి నిశ్శబ్దానికీ కవి పాఠకుని తీసుకెళతాడు. ఆ నిశ్శబ్దం శబ్దం కంటే చైతన్యవంతంగానూ, అదృశ్యం దృశ్యం కంటే రసమయంగానూ ఉంటాయి.”
“హైకూ కవికి ప్రపంచమంటే ప్రేమ ఉంటుంది. ఉదాసీనత కూడా ఉంటుంది. వేరువేరు సమయాలలో కాక, రెండూ ఏకకాలంలో ఉంటాయి. ప్రేమ శిఖరాగ్రానికి చేరినపుడు, సాధారణ దృష్టికి అది ఉదాసీనతలా గోచరిస్తుంది. ప్రతి క్షణం, ప్రతి చర్యలో తాను ప్రేమించాల్సింది దేన్నో గుర్తిస్తూనే వుంటాడు. పక్షిని ప్రేమించేవాడు పంజరంలో పెడతాడు. పక్షిని ప్రేమించటం అంటే పక్షి స్వేచ్ఛని ప్రేమించటమే అని తెలిసిన వాడు ఉదాసీనుడిగా కనిపించే మహా ప్రేమికుడవుతాడు.”
“మంచి హైకూ కవి కావటానికి, ఒకరు ముందు కవి కావాలి. తరువాత కవి కాకుండా పోవాలి.”
“హైకూ రాయటం సులువే. మంచి హైకూ రాయటం మరీ సులువు. హైకూ కవి కావటమే కష్టం.”

ముగించే ముందు కొన్ని హైకూలు:

చేయి పట్టుకుంది నిద్రలో,
పాప కలలోకి
ఎలా వెళ్ళను?

నీటి పై

రాలిన పూవుని
ప్రతిబింబం చేరుకుంది

ఎంత అందంగా నవ్విందీ!

పాపాయికి చెప్పాలి
పెద్దయ్యాక

గాలి.

పూలు ఊగాయి
వాటిపై సీతాకోకా

ఆమె వచ్చి అంది.

“చందమామ”
మళ్ళీ నిశ్శబ్దం

చేప దొరికింది

విలవిల్లాడింది
కొలను

రాలిన చినుకు

ఆకాశం వైపు
ఎగిరింది బెంగతో

నక్షత్రాకాశం

మెట్ల దారి
కొండ మీద గుడి వరకూ

ఈ అక్షరాలు చూస్తారు

కానీ ఈ కాగితం చుట్టూ
ఉన్న నిశ్శబ్దాన్నీ, రాత్రినీ…

కలలో ఎవరో అన్నారు

మేలుకో… మేలుకో…
కానీ ఎలాగో చెప్పలేదు!

ఈ రెండు కవితా సంపుటాలూ దొరికితే విశాలాంధ్రలో దొరకవచ్చును. లేదా బి.వి.వి.ప్రసాద్ గారినే నేరుగా సంప్రదించండి. నాకు తెలిసిన చిరునామా:

*     *     *

నా హైకూ సంపుటాలూ, వ్యాసాలూ, నా హైకూలపై ఇస్మాయిల్, సంజీవదేవ్, ఓల్గా గార్ల మాటలూ అన్నీ కలిపి, ఈ బుక్ రూపం లో కినిగే.కాం లో లభిస్తున్నాయి. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2 కామెంట్‌లు: