31 డిసెంబర్ 2012

అలవాటు : Habit

ఒకరోజు రోజువారీ పనుల్లోంచి బయటపడి చూడాలి
మన వలయం మీద మనమే తిరుగుబాటుచేసి స్వేచ్ఛను ప్రకటించాలి

వాహనం విడిచి కాలినడకన తిరగాలి
రోజూ చూసే తెలియని మనిషిని మొదటిసారి పలకరించాలి
బరువులన్నీ కాసేపు గాలికొదిలి, పగలంతా నిద్రపోవాలి. ఒకరాత్రి మేలుకోవాలి

ఆకాశాన్ని ఈ చివరనుండి ఆ చివరికి కొలిచి చూడాలి
దేవుడేమైనా ఇటీవల ఆకాశం కొలత మార్చాడేమో ఆలోచించాలి
చిననాటి నక్షత్రాలకీ, ఇప్పటికీ లెక్క సరిపోయిందో లేదో సరిచూసుకోవాలి

ఒంటరిగా కూర్చుని ఒకసారి నవ్వి చూసుకొని
మన నవ్వుకేమైనా మరామతు అవసరమేమో పరిశీలించాలి
ఏడవటం మరిచామో, ఏమో కాసేపు కన్నీరు రాల్చాలి

ఏదో ఒకటి అసలు ఎందుకు చేయాలో ఆలోచించాలి
ఆలోచన ఆగిపోతే ఏం జరుగుతుందో ప్రశాంతంగా గమనించాలి

ప్రపంచం మాయో కాదో తెలియదు కాని, అలవాటు మహామాయ
తిమ్మిరిలా అది క్రమ్మిందంటే
బ్రతుకు అందమూ తెలియదు, బాధా తెలియదు
దానిని విదిలించుకొని చూస్తే మరలా పుట్టినట్లుంటుంది

జీవనానందం తెలియాలంటే ఏదీ అలవాటు కాకుండా బ్రతకాలి
ఎప్పుడూ అలవాట్లకి జారబడకుండా నిలబడి ఉండాలి
బ్రతికి ఉండటం మాత్రమే అలవాటు కావాలి

తీరం వదిలిన దేన్నైనా ప్రవాహం తీసుకుపోయినట్లు
అలవాట్లను వదిలితే చాలు జీవితం తనతో మనల్ని తీసుకుపోతుంది


Habit


Must try
To come out of the run-of-the-mill routine someday-
Must revolt on the revolving self and declare freedom


Must leave away the vehicle and tramp on legs for a day-

Must wish the stranger who appears on the way every day-
Leaving all burdens off, must go to bed a whole day
And, stay awake an entire night!

Must measure the sky from east to west-
Must ponder over
Whether the God had changed the measures-
And, audit the accounts of stars of childhood
With the present-day count

Must laugh in solitude
And check whether the chuckle needs any mend-
Verifying whether we forgot to wail,
One must shed a few tears!

Must reflect for a while
Why one should do something at all!
Must watch gently
What happens when thinking ceases

Don’t know whether this world is all a Maaya-
But habit certainly is a Mahaamaaya!

As it spreads over as numbness
None would know the beauty of life- nor, the pinch of it!
When one shackles it off,
It feels like being born all again!

To know the pleasure of life one must not be addicted to anything!
Must stand robust- not leaning to a habit!
Living alone must be the routine

Just like something that leaves the banks
Would be swept away by the flow-
If we free ourselves from habits
Life would take us all along!



____________________________

'ఆకాశం' సంపుటి నుండి    
Translation: Sri Mandalaparthy Kishore

29 డిసెంబర్ 2012

బివివి ప్రసాద్ కి డా.సంజీవదేవ్ ఉత్తరాలు


డాక్టర్ సంజీవదేవ్ గారు 1991 నుండి పరిచయం. తరచూ ఉత్తరాలు రాసేవాడిని. ఉత్తరం వెళ్ళిన వారం లోపు ఆయన నుండి జవాబు వచ్చేది. ఇది నాకు మాత్రమే కాక, వారితో పరిచయం ఉన్న అందరికీ అనుభవమే. సరళం గా కనిపిస్తూనే, ఎంతో ఆలోచనాత్మకంగా ఉండటం వారి వచనం ప్రత్యేకత. తెలుగువాళ్ళు గర్వించ తగిన మేధావి, అంతకు మించి ఉన్నతమైన వ్యక్తి సంజీవదేవ్ గారు. వారి వచనం ప్రభావం నాపైన చాలానే వుంది. ఒకచోట అన్నట్టు, తెలుగు సాహిత్యవేత్తలలో నేను చదివిన వారిలో, గురజాడ తరువాత అటువంటి సంయమనం, సంజీవదేవ్ గారిలోనే చూసాను. తెలుగు సాహిత్యం ఎంతో ఇష్టంగా మనోవికాసం కోసం చదువుకొనే వారెవరున్నా, వారిని తప్పక సంజీవదేవ్ వ్యాసాలు చదవమని చెబుతాను. అవి రెండు సంపుటాలుగా తెలుగు ఆకాడమీ వారి ప్రచురణలలో దొరుకుతున్నాయి.

వారు నాకు రాసిన ఉత్తరాలలో కొన్ని ఇక్కడ మిత్రులతో పంచుకొంటున్నాను.











తలుపులు : Doors

అడగకుండా తలుపులు తోసుకొని లోపలికి వస్తారు పిల్లలు
బయట ఉన్న ఆకాశమే లోపల ఉంటుంది కదా అని వాళ్ళ ఊహ
గదిలోపలి ఆకాశాన్ని ఎవరెత్తుకుపోతారోనని మనకి బెంగ

మనం శ్రమపడి ఊహించుకొన్న బూచాళ్ళు
మన ఆకాశం ఎప్పుడో ఎత్తుకుపోయారని మనకి తెలీదు

పోనీ వచ్చారు కదా అని రానిచ్చినందుకు
మన పెద్దమనసుతనానికి మురిసిపోతూ వుంటే
తలుపులు వెయ్యకుండానే వెళ్ళిపోతారు పిల్లలు

తలుపులు లేకపోతే బ్రతుకేమైపోతుందో ఊహించలేని మనకి
తలుపులు లేనిచోట జీవితం ఉంటుందని అర్థంకాదు


Doors

Without seeking permission,
Children gate-crash into the room
It’ll be the same sky in the room too
-They think
Someone might thieve our private heaven
-We worry

But, we don’t realize a fact-
The ogres of our laborious imagination
Had knocked out our sky, long ago!

As we rejoice at our benevolence
-Of permitting the kids in-
They exit without sealing the doors

We,
Those who don’t know
What would happen in the absence of doors -
Never understand-
Life will be there where there aren't any doors!


_______________________________
'ఆకాశం' సంపుటి నుండి
Translation: Sri Mandalaparthy Kishore

28 డిసెంబర్ 2012

పుట్టగానే పిల్లలు : As soon as they are born

పుట్టగానే పిల్లలు నవ్వరెందుకని
వాళ్ళు ఏ వెలుతురులో ఈదివచ్చారు
ఏ ఆనందాలు దాటివచ్చారు
ఏ హద్దుల్లేని దేశాలు ఎగిరివచ్చారు

పుట్టగానే పిల్లలు నవ్వలేరెందుకని
వాళ్ళు ఏ పవిత్రసీమలు విడిచివచ్చారు
ఏ దయాపూర్ణ హస్తాలు విడిచిపెట్టారు
ఏ కపటంలేని కాలాలు పోగొట్టుకొన్నారు

వాళ్ళంతవరకూ
ఏ జరామరణాల అంచుల్ని దాటి బ్రతికారు
ఏ భయరహిత ఏకాంతంలో సంచరించారు
ఒక్క మాటైనా, ఒక్క చూపైనా, ఒక్క మనిషైనా అక్కర్లేని
ఏ మహాశాంతి లోకాన్నుండి ఇక్కడికి జారిపోయారు

పుట్టగానే పిల్లలు ఎప్పుడూ ఏడుస్తారెందుకని
దు:ఖమయ ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని


As soon as they are born

Why do they not smile when they are born,
The new born?
In which flow of glow did they swim and come?
Which treasures of pleasures did they cross?
From which frontierless countries did they come flying?

Why cant the new born smile?
Which parts of purity have they parted and landed ?
Which kind and compassionate hands have they left?
Which guileless times have they lost?

Through which fearless solitude did they travel
From which world of the loftiest peace of no need of a word,a look,a man
Have they descended?

Why do the children always cry when they take their birth?
Why do they so comment on this world of tears and fears?

____________________________
'ఆకాశం' సంపుటి నుండి
Translation: Dr. Kondalrao Velchala
Former Director, Telugu Academy

27 డిసెంబర్ 2012

హృదయం ప్రవేశించినపుడు : When Heart Takes over...


ఎప్పుడూ విసుక్కొనే కొడుకు తల్లి పాదాలు తాకి దీవించమన్నపుడు
ఆమె కళ్ళలో ఎన్నడూ చూడని కన్నీరెందుకొస్తుంది

గాయపరిచాను, క్షమించమన్నపుడు
అప్పటివరకూ వెలవెలబోతున్న భార్య కన్నులవెంట ఆపలేని ధారలెందుకొస్తాయి

చాలా ఖర్చవుతుందేమో, వద్దులే నాన్నా అని పిల్లలన్నపుడు
వారి లేత దయాపూర్ణ హృదయాలు తలచి అతని కన్నులెందుకు చెమ్మగిల్లుతాయి

ఎన్నడూ తగినంత మాటలాడని కన్నతండ్రి
అర్థరాత్రి దూరాలు దాటి వచ్చిన కొడుకు కోసం నిద్రమానుకొని ఎదురుచూస్తే
వారి మధ్య చల్లని గాలితెరలా ఆర్ద్రత ప్రవహిస్తుందెందుకని

అణగారిన మంచినెవరైనా గుర్తించిన ప్రతిసారీ
లేదనుకున్న మంచితనం ఎదురైన ప్రతిసారీ
ఎవరినెవరైనా మంచితనంతో గెలుస్తూ గెలిపించిన ప్రతిసారీ
మనకళ్ళెందుకు చెమరుస్తాయి. మన కంఠాలెందుకు రుద్ధమౌతాయి

మనుషులిద్దరిమధ్య హృదయం ప్రవేశించిన ప్రతిసారీ
తెలివికాని తెలివీ, బలం కాని బలమూ కన్నీరుగా మారి పొరలిపోతాయెందుకని
సారవంతమైన మౌనం పొదువుకొంటుందెందుకని, జీవితం నెమ్మదిస్తుందెందుకని

బహుశా, అపుడు మన లోపలికి మనం చేరుకొంటామేమో
మాయాలోకాన్ని కడుగుకొని మనని మనం నిజంగా చూసుకొంటామేమో
దేవునివంటి మనం దారితప్పిన పురాస్మృతిలోకి మేలుకొంటామేమో



When Heart Takes over...

Why do we witness those rare drops of tear
in a mother's eyes when her son,
who constantly chafes at her for nothing,
touches her feet for a blessing;

Why do tears stream out from her pale eyes
when you sincerely apologise your wife
pleading guilty for the hurt;

Why do the eyes of a father get bleared
when he recalls the loveful talk of his young kids
who display rare concern by saying:
"Not now, daddy, they might cost more";

Why a wet film of love flutters
like moist wind, between them,
when a taciturn father keeps awake for his son
who travels distances to reach home past midnight;

Why do our eyes get wet,
and we feel a lump in our throat
when we notice those rare acts of humanity;
or, when someone acknowledges

that vanishing creed of good deeds;
or, when we win over,
and help others triumph over,
hearts with graceful gestures;

Why life becomes so serene
and an alluvial silence embraces two people
every time when heart prevails over
their intellectual aberrations and,
apparent physical strengths
melding them into a trail of tears;

Maybe... then, we are
catching up with ourselves delving deep;
or, looking at our revealing spiritual selves
rinsing off all temporal sullies;
or, awakening into our godly path
which we long deserted and digressed from.


______________________
'ఆకాశం' సంపుటి నుండి
Translation: Sri N.S.Murthy

25 డిసెంబర్ 2012

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది - బివివి ప్రసాద్


నా కవిత్వం నేను నా పాఠకుడితో జరిపే ఉదాత్త సంభాషణ. జీవితం ప్రసాదించే దు:ఖాన్ని స్వీకరించి, నేను నా పాఠకుడి సమక్షంలో – జీవితాన్ని ప్రేమించటంలోకీ, జీవితం లోలోతుల్లోని విలువల్లోకీ చేసే ప్రయాణం. కఠినమైన శిలలాంటి నిద్రనుండి, పూవులా కోమలమైన మెలకువలోకి నడుస్తూ, పాఠకుని నడవమని మృదువుగా చేయందివ్వటం. అయితే, ఈ కవిత్వం వెనుక ఉన్న జీవితానుభవం ఏమంత అందమైనదీ, ఆసక్తికరమైనదీ కాదనుకొంటాను. ఈ క్షణానకూడా, నేపధ్యమెందుకు, నా కవిత్వం చదివి చూడండని చెప్పాలని బలంగా అనిపిస్తూ వున్నా, పాఠకుడికి కవి నేపధ్యంపై ఉండే సహజమైన ఆసక్తిని కాదనలేక, నా సంక్షిప్త చిత్రాన్ని పరిచయం చేస్తున్నాను.

సాహిత్యం పట్ల ఒకరికి  ఆసక్తి ఎందుకు కలుగుతుంది. బహుశా వెలుపలి జీవితం తన లోలోపలి జీవనాసక్తికి తృప్తి కలిగించనప్పుడు లేదా వెలుపలి జీవితాన్ని తెలుసుకోవడానికి తన శక్తి చాలనప్పుడు ఆ తృప్తికోసం, శక్తి కోసం సాహిత్యంలోకి తొంగిచూస్తామేమో. ఇప్పుడు వెనుతిరిగి చూసుకొంటే, ఇతర కారణాలెలా వున్నా ఇవి రెండూ నన్ను పుస్తకాలవైపు కదిలించి వుంటాయనుకొంటాను. మా నాన్నగారు తను చదువుకొనే రోజులలో సాహిత్యం పట్ల కొద్దిపాటి అభిరుచి కలిగివుండటం మినహా, నాకు సాహిత్య నేపధ్యం కాని, వాతావరణం కాని లేవు. నన్ను సాహిత్యజీవిని చేసిన మరొక కారణం అసాధారణ సున్నితత్వం. నేను జీవించాలని ఆశించే ఉదాత్తమైన, సున్నితమైన ప్రపంచాన్ని పుస్తకాలలోనే వెదుకుకొనేవాడిని.

నేను మొదట పాఠకుడిని. బాల్యంలో చందమామ వంటి పుస్తకాలు నా మొదటి స్నేహితులు. తరువాత జీవితంలో ఆయా వయస్సులలో కలిగే ఉద్వేగస్థితులని బట్టి డిటెక్టివ్, పాపులర్ నవలలు పాఠకుడిగా నా మలి దశ. అయితే అవి నాలోపలి పాఠకుడి ఊహా, ఆలోచనా శక్తులకి తృప్తి కలిగించకపొవటం వలన క్రమంగా సీరియస్ సాహిత్యం నా దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో  మా ఊరి లైబ్రరీలో దొరికిన చాలామంది రచయితలని సీరియల్‌గా చదవటం గుర్తుంది. సీరియల్‌గా అంటే ఉదాహరణకు, విశ్వనాధ సత్యనారాయణను మొదలుపెడితే ఆయన పుస్తకాలన్నీ దొరికిన మేరకు వరుసపెట్టి చదివేయటం. ఈ అలవాటు చాలాకాలం అలానే వుండేది. ఆ రోజుల్లో గుర్తున్నంతవరకూ, శరత్, ప్రేంచంద్ మొదలైన చాలామంది రచనలు చదువుకొన్నాను.

నేను ప్రధానంగా నవలాసాహిత్యాన్ని ఇష్టపడేవాడిని. కానీ, ఇంటర్ చదువుతున్నపుడు, కొన్ని భావాలో, ఆలోచనలో తోసుకువస్తుంటే కవిత్వం రాయటం ద్వారా కవిత్వంతో నా అనుబంధం మొదలైంది. స్వభావరీత్యా చొరవ తక్కువ మనిషిని కావటం వలన, మనుషుల్లొకీ, సందర్భాలలోకీ చొచ్చుకుపోయే తత్వం లేకపోవటం వలన కూడా బహుశా నా అనుభూతుల్ని కవిత్వంలోకి అనువదించుకోవటం మొదలుపెట్టివుంటాను.

అప్పటి లెక్చరర్లు నాకవిత్వాన్ని ఇష్టపడి, నువ్వు కవిత్వం చదువు, అప్పుడు మరింత బాగా రాయగలుగుతావు అన్నపుడు మొదటిసారి మహాప్రస్థానం చదివాను. అది చదివాను అనటం కన్నా బట్టీ పట్టాను అనటం సరైనదనుకొంటాను. శ్రీశ్రీ శబ్దశక్తి, ఊహావరణాల్ని కదిలించే భావజాలం చాలాకాలం ఉత్తేజం కలిగించాయి. ఏపని చేసినా దానిలో లీనమైపోయే స్వభావం వలన, శ్రీశ్రీని చదివిన రోజుల్లో అదే వేగంతో చదివిన కమ్యూనిష్టు సాహిత్యమూ, తాపీ ధర్మారావూ, గురజాడా, రాహుల్ సాంకృత్యాయన్ వగైరాల ప్రభావంతో సమసమాజం రావాలనీ, ఒక్కొక్కసారి  ఉద్యమంలో కలిసిపోవాలనీ కూడా అనిపించేది.

శ్రీశ్రీని పరిచయం చేస్తూ, తనని పరిచయం చేసుకొన్న చలం రాసిన వ్యాసాలు సమాజంలోని అనేక చీకట్ల మీద తీవ్ర ధిక్కార స్వభావాన్ని నింపేవి. అయితే లోలోపల ఒక వెలితి సదా వెంటాడుతూ ఉండేది. ఆ వెలితి నాలోని ఉద్వేగాలకన్నా, అభిప్రాయలకన్నా ఇంకా చాలా లోతున ఉన్నది. దానిని అర్థం చేసుకొనే దారి కోసం వెదుకుతూ జిడ్డు కృష్ణమూర్తిని చదివినప్పుడు, ఈయన నాకు కావలసిన ముఖ్యమైన విషయమేదో చెబుతున్నారని అనిపించేది. అయితే నేను కేవలం తెలుగు మీడియం విద్యార్థిని కావటం వలన, నా చుట్టూ నన్ను నడిపించే ఎలాంటి ఆసరా లేకపోవటం వలన, అప్పటికి కృష్ణమూర్తివి తెలుగులో వచ్చిన ఒకటి రెండు పుస్తకాలు మినహా మరేవీ చదివే అవకాశం రాలేదు.
ఈ ఉపరితల ఉద్వేగాల నుండి మరింత లోతుకి వెళుతున్నపుడు, క్రమంగా ఇతర రచయితలకంటే చలం అత్యంత సన్నిహితుడిగా కనిపించేవారు. ముఖ్యం ఆయన నిజాయితీ, సున్నితమైన సంవేదనలు, లోతైన ఆలోచనలు, అంతంలేని సత్యాన్వేషణ ఇవన్నీ నన్ను పూర్తిగా ఆవరించేవి. చిన్నపుడు ఒక కథకుడిగా పరిచయమైన టాగోర్, చలం వలన మళ్ళీ కవిగా పరిచయమయ్యారు. చలం అనువదించిన టాగోర్ కవిత్వం చదువుకోవటం నాలోని ఉపరితల ఉద్వేగాలనుండి శాంతి వైపుగా, సత్యాన్వేషణ వైపుగా నడిచేలా చేసింది.

కొన్ని సందిగ్ధతలు, కొన్ని సమాధానాలు, వెంటాడుతున్న లోలోపలి వెలితి. ఈ దశలో, బలీయమైన హేతుదృక్పధం వలన, సాంప్రదాయిక ఆధ్యాత్మిక విశ్వాసాలూ, పద్ధతులూ అంతగా ఆకర్షించకపోవటం వలన నిజంగా నాకు సమాధానం దొరికేదెక్కడ అనుకొంటూ వుండగా, మళ్ళీ చలమే రాసిన, భగవాన్ స్మృతులు, వెలుగురవ్వలు అనే రెండు పుస్తకాలని సమీపించాను. మొదటిది చలం శ్రీ రమణమహర్షి గురించి ఆయన భక్తుల నుండి సేకరించిన అనుభవాలు. రెండవది, ముఖ్యంగా జెన్, భారతీయ మిస్టిక్స్ జీవితాలలోని సంఘటనలను చెప్పే కథానికలు. ఈ రెండు పుస్తకాలలో అత్యంత సరళమైన, ప్రేమాస్పదమైన జీవితాన్ని చూసినప్పుడు, అవి సత్యాన్ని గొప్ప సిద్ధాంతచర్చలనుండి, మత విశ్వాసాలనుండి విముక్తం చేసి కరతలామలకంగా చూపినపుడు వీటి గురించి కదా ఇన్నాళ్ళూ వెదుకుకొన్నాను అనిపించింది. శ్రీ రమణమహర్షి, జెన్ సాధువులు పరిచయమైన ఆ రోజులు సాహిత్యాన్ని ఆశ్రయించి బ్రతికిన నాకు, సాహిత్యం ఇచ్చిన గొప్ప కానుకలుగా ఈనాటికీ అనిపిస్తూ వుంటుంది.

దారి దొరికింది. ప్రయాణం మొదలైంది. సత్యాన్వేషణ వెలుపలి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. ఆ సత్యమేదో తెలియాలి. అది మినహా, మిగతావన్నీ ఏమంత విలువలేనివి. ఆ క్రమంలో నేనెక్కడున్నానో, సత్యమెక్కడవుందో, మధ్యలో ఈ దు:ఖమేమిటో అర్థం చేసుకొంటూనే ఇంకా నడుస్తూవున్నాను. నిజానికి అక్కడితో నా సాహిత్య ప్రయాణం పాఠకుడిగా చివరికి వచ్చి, కవిగా ప్రారంభమయింది. చలం చెప్పినట్టు నాకూ, ప్రపంచానికీ మధ్య బహిరంతర యుద్ధారావం మొదలైంది. తరువాత కూడా సాహిత్యం చదువుకొన్నా బాగా ఎంపిక చేసిన రచనలు మాత్రమే చదివేవాడిని. క్రమంగా సాహిత్యం వెనుకపడి, సత్యాన్వేషణకు సహాయం చేసే రచనలు చదవటం ప్రధానమయింది. ఇదంతా నా ఇరవైలలోని ప్రయాణం.

అప్పుడు, నాలోపలి ప్రయాణాన్ని రికార్డు చెయ్యాలని శ్రీ భగవాన్ని   ఉద్దేశించి రాసిన కవితలూ, ఇతర భావాల నుండి ఎంపిక చేసిన వాటితో ఆరాధన సంపుటి ప్రచురించాను. తరువాత జీవన స్థితిగతుల వలన, ఆరాధన సాహిత్యలోకాన్ని చేరకపోవటం వలన చాలాకాలం ఏమీ రాయలేదు. ఆ సమయంలో ఇస్మాయిల్ గారు పరిచయం కావటం తో, ఒక సందర్భంలో నేను రాసిన హైకూలని ఆయనకు చూపించటం, ఈ ప్రక్రియ నాకు తగినదిలా అనిపించి, వరుసగా మూడు హైకూ సంపుటులు ముద్రించటం జరిగింది. ఆ రోజుల్లోనే కొప్పర్తిగారు తణుకు బదిలీ అయి రావటం వలన, ఆయన ఆసరా కవిగా నన్ను నేను అంచనా వేసుకోవటానికీ, సరిదిద్దుకోవటానికీ ఉపకరించింది. మొదటి హైకూసంపుటి నాటికి నాకు హైకూ గురించి అంతగా తెలియదు. అప్పటికే ఉన్న తాత్వికనేపధ్యం వలన  హైకూ ఒక నిశ్శబ్దానుభవాన్నివ్వాలని మాత్రం అనిపించింది. తరువాత అలంకారరహితంగా, ఆలోచనారహితంగా నిర్మలమైన హైకూ అనుభూతిని ఇవ్వటం కోసం సాధన చేస్తూ మూడవసంపుటి నాటికి దానిని సంపూర్ణంగా సాధించగలిగానని అనిపించింది.

కానీ, ఎప్పటికప్పుడు నిరుత్సాహం కమ్ముకొంటూనే వుండేది. గొప్పకీర్తి రావాలనీ, పురస్కారాలు రావాలనీ ఏనాడూ ప్రబలంగా కోరుకోలేదు. అవి రానందుకు బాధపడలేదు. కానీ, ఇది గొప్ప కవిత్వం అని గ్రహించినవాళ్ళు కూడా దానిని పదిమందికీ చేర్చేందుకు తమకు చాతనయిన ప్రయత్నం చేయకపోవటం, ఫలితంగా ఇలాంటి సాహిత్యానికి ఎదురుచూసే పాఠకులకి ఇలాంటి కవిత్వం ఒకటి వుందని కూడా తెలియకపోవటం మాత్రం తరచూ బాధ కలిగించేవి. అదే నిరుత్సాహంతోనూ, వెలుపలి జీవితంలో ఉండే సహజమైన వత్తిడులతోనూ మళ్ళీ కవిత్వానికి దూరమయ్యాను. మధ్యలో, హైకూలు రాస్తున్నపుడు రాసిన వచన కవితలతో 2004లో నేనే ఈ క్షణం ముద్రించటం మినహా, పది సంవత్సరాలు కవిత్వరచనను విడిచిపెట్టాను.

మళ్ళీ క్రితం సంవత్సరం, 2011లో, సాహిత్యమిత్రుల పలకరింపులతో పాటు, నేను మాట్లాడితీరవలసిన విషయాలున్నాయని నాకు కూడా గట్టిగా అనిపిస్తూ వుండటంతో, ఒకటిరెండు కవితలతో నెమ్మదిగా మొదలై సుమారు నాలుగు నెలలలో ఒక ఉధృతిలో వందకుపైగా కవితలు రాసాను. వాటిని కొంత ఎడిట్ చేసి, పదేళ్ళలో అప్పుడపుడు రాసిన కొన్ని కవితలు చేర్చి ఆకాశం సంపుటి ముద్రించాను. సాహిత్యప్రపంచం నుండి యధాప్రకారం ఉదాసీన ప్రతిస్పందన. సాహిత్యాన్ని ఉద్దరిస్తున్నామని చెప్పేవారు తెలుగునాట జరుపుతున్న సాహిత్యవిలువల పతనాన్ని ఇరవైయేళ్ళకుపైగా చూస్తున్నవాడిని గనుక, ఇదేమంత ఆశ్చర్యం కలిగించలేదు. కాని, పాఠకులలో మానవవిలువలు వికసించేందుకు ఉపకరించని, వారు తమ  జీవితాన్ని మరింత ప్రేమించేలా చేయని సాహిత్యం వారికి దూరమవుతుందని మన సాహిత్యవేత్తలు చాలామంది గ్రహించకపోవటం మాత్రం విచారాన్ని కలిగిస్తుంది.

ఇన్నాళ్ళకి రెండుమూడు అవార్డులు వచ్చి ప్రసాద్ కవిత్వాన్ని చదవమని పాఠకులకి రెకమెండ్ చేస్తున్నందుకు ఒక విషాదభరితమైన సంతోషంతో ఇప్పుడు ఈ మాటలన్నీ మీతో పంచుకొంటున్నాను. అయితే అవార్డులూ, కీర్తీ రావటంకన్నా నా అక్షరాలు, నేను ఆశించినట్టు, పాఠకుల హృదయాలను నిర్మలమైన కన్నీటితో, గాఢమైన శాంతితో, మెలకువలాంటి మౌనంతో నింపాయని తెలిసినపుడల్లా మాత్రం నా కవిత్వసాధన వృధాకాలేదని సంతోషం కలుగుతూ వుంది. ఆకాశం వలన ఇలాంటి అరుదైన స్పందనలని ఇటీవల చాలామంది పాఠకులనుండి వింటూవున్నాను.


_________________________________________
'వాకిలి '  ఈ - పత్రిక కోసం రాసిన వ్యాసం. ప్రచురణ: 25.12.12
http://vaakili.com/patrika/?p=142

21 డిసెంబర్ 2012

అలా ఆకాశం వరకూ..

1.
ఒక నిద్రలేవవలసిన ఉదయం నీ దేహం చల్లబడి ఉంటుంది
ఎలా బ్రతికావో బ్రతికావు, ఇక అంతా అయిపోయింది

నీ దేహం చుట్టూ మేఘంలా ముసురుకొన్న దు:ఖానికీ, ఆర్తి నిండిన శబ్దాలకీ  
నువు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటావు

అవును, అసలు ఉంటావో, ఉండవో ఎప్పటికీ రహస్యమే
తీరా వెళ్ళిపోయాక ఈ పంచరంగుల ఆట కొనసాగుతుందో, ముగుస్తుందో ఎప్పటికీ సందేహమే  

నువు ఉంటావనుకోవటమూ, జీవితం కొనసాగుతుంది అనుకోవటమూ
కలలాంటి జీవితానికి అందమైన సరిహద్దులు మాత్రమే  

మిగిలేదేమిటో తెలిసిందెవరికి, తెలుసుననేవారిలో తెలుసుకొంటున్నదెవరు  

2.  
జీవితం భయ, విషాదాలతో పొర్లిపోయే పాత్రను తలపై ఉంచుకొని నర్తించే ఒక కళ
గెలిచేందుకు ఏ నియమాలూ లేని, గెలిచే హామీ ఏ మేరకూ లేని  
నీడలు తొణికిసలాడే ఒక నవ్వులక్రీడ 

ఎన్నాళ్ళని భూమి మీద ఈ ఎగుడుదిగుడు నడక 
ఆడటం అనివార్యమైనపుడు నక్షత్రాలతో ఆడిచూడాలి 
నాట్యం తప్పనిసరి అయినపుడు గెలాక్సీలు వేదిక కావాలి

వెళ్ళటమెటూ నిర్ధారణ అయినపుడు  
ఉన్నన్నాళ్ళు సమస్త సృష్టినీ పొదువుకొన్న ఆకాశం లా ఉండాలి  

ఏమో ఎవరికి తెలుసు
భూమీ, నక్షత్రాలూ, గెలక్సీలూ 
అద్దంలో ప్రతిబింబం లా హఠాత్తుగా మాయం కావచ్చును 
అద్దంలాంటి ఆకాశం మాత్రం అదృశ్యం కాకుండా మిగలవచ్చును  

3.  
ఏమయినా కానీ 
రా నడుద్దాము అలా ఆకాశం వరకూ
ఈ దారి కొసన నేలకి ఒంగి రమ్మని పిలుస్తోంది
తీరా చేరేసరికి అది పక్షిలా రెక్కలువిప్పి ఎగిరిపోతుందనవద్దు   

ఏమో ఎవరికి తెలుసు
మనలో మిగిలే కాస్తంత అమాయకత్వాన్ని ముద్దుపెట్టుకొనేందుకు 
అది అక్కడ ఎదురుచూస్తూ ఉండవచ్చును   
బహుశా మన పసిమనసుల నిండా ఆకాశం నిండిపోనూవచ్చును  

ఒకసారి నాతోరా అలా ఆకాశంగా మారి చూద్దాము  
చనిపోతే ఆకాశం లా మిగిలేదీ, లేనిదీ చూసి వద్దాము  

4.
ఇంతకూ, పుట్టక ముందు ఎక్కడ ఉండేవాళ్ళమో  
ఈ సారి ఆకాశాన్ని కలిసినపుడు తప్పక అడగాలి



రచనాకాలం: 19.8.2012
ప్రచురణ: పాలపిట్ట డిసెంబరు 2012 

16 డిసెంబర్ 2012

కవిసంగమం సభలో కవిత్వం చదివిన వీడియో

కవిసంగమం సభలో కవిత్వం చదివినప్పుడు.... 



సభ లోని ప్రసంగాలూ, మిత్రుల కవితలూ కవిసంగమం బ్లాగులో చూడవచ్చు.
http://www.kavisangamam.com/

14 డిసెంబర్ 2012

మాతృభాష

మాతృభాష మాట్లాడుతున్నపుడు ఎలావుంటుంది
పసిదనంలో అమ్మ ఊయలలోవేసి జోల పాడుతున్నట్లుంటుంది
ఆమె గారాబు చేస్తున్నట్టూ, ఆటళవేళల ఆతృతగా హెచ్చరిస్తున్నట్టూ వుంటుంది

బాల్యంలో స్నేహితులతో కాలవగట్ల వెంటా, పొలాల నడుమా పరుగెడుతున్నట్టూ,
చెట్టూ, పుట్టల్నీ, పిట్టల్నీవాటివాటి భాషల్లో పలకరిస్తున్నట్టూ వుంటుంది
నేస్తాలతో నవ్వుకొన్నట్టూ, తిట్టుకొన్నట్టూ, చిరుతిళ్ళు వాళ్ళతో పంచుకొన్నట్టూ వుంటుంది

మాతృభాష మాట్లాడుతున్నపుడు
మనలో ఎక్కడో పైరగాలులు హోరున సరదాగా సాగిపోతున్నట్టూ
స్వచ్చప్రవాహాలు రాళ్ళగలగలల్తో మనతో, మనభాషలో మాట్లాడినట్టూ వుంటుంది

తెల్లని పగళ్ళూ, నల్లని రాత్రులూ
రుతువులతో రూపం మార్చే ఆకాశాలూ
మనని నిండుగా కప్పుకొన్నట్టూ వుంటుంది

మాతృభాష ఒక సంపద
ఒక పురాతన వారసత్వం
ఒక జీవన సమూహపు కథలూ, కలల నిరంతర ప్రవాహం
మాతృభాష మనని మనల్నిగా నిలిపిచూపే ఒక శబ్దాల వన్నెల జెండా

మన లోలోపలి
కోరికల, భయాల, స్మృతుల, స్వప్నాల జాడల్ని
తల్లిలా మృదువుగా తాకే, పలకరించే, పరిమళింపచేసే
సంగీత పరికరం, మంత్రదండం

మాతృభాషని ప్రేమించటం మాతృమూర్తిని ప్రేమించటం
మాతృమూర్తి ప్రసాదించిన జీవితాన్ని ప్రేమించటం
జీవితం ప్రసాదించిన ఆనందాన్నీ, దు:ఖాన్నీ ప్రేమించటం
మాతృభాషని ప్రేమించటమంటే ప్రేమించటం ఎలాగో నేర్చుకోవటం

మాతృభాష నేర్చుకోవటమే భాషని నేర్చుకోవటం
అది దేనినైనా గౌరవించటమెలాగో నేర్చుకోవటం
దేనినైనా శ్రద్ధగా నేర్చుకోవటమెలాగో నేర్చుకోవటం

మాతృభాష గుండెనిండా నింపుకోవటం తెలిసినవాడికి
మరొకభాషనైనా తనలోనికి ఆహ్వానించటం ఎలానో తెలుస్తుంది

అది నోరారా పలకలేని మనిషిని చూస్తే జాలేస్తుంది
నేలమీద నిలవలేక, గాలిలో ఎగరలేక గంతులు వేస్తున్నట్లుంటుంది
పాలు ఒలకబోసుకొని నీటికోసం పరుగెడుతున్నట్లుంటుంది  

మనం పుట్టిన నేల
మనకేమైనా ఇస్తుందో, లేదో కానీ
మనం నోరారా ప్రశ్నించేందుకు, జవాబు చెప్పేందుకు
మనకంటూ ఒక  భాషనిస్తుంది

మన చుట్టూవున్న జీవితాన్ని చదివేందుకు, మన కథ లోకంతో పంచుకొనేందుకు
గుండెనిండా భావాలనీ, నోటినిండా అక్షరాలనీ నింపేందుకు కావలసినంత సంభాషణనిస్తుంది
 
మాతృభాష కళ తప్పని బంగారు స్వప్నాలనిస్తుంది
కలతపడ్డ వేళల కన్నీరు నిండిన మాటలనిస్తుంది
మన హృదయం భాషలోకి వికసించి మన జీవితం పక్వమయేలా చేస్తుంది  



(మా ఊరిలో జరిగిన తెలుగు భాషా ఉత్సవాల సందర్భంగా రాసింది.)

13.12.12

21 నవంబర్ 2012

కవిని చూద్దామని

కవి ఎలావుంటాడో చూద్దామని అతని ఇంటికి వస్తారు
అక్షరాలకి జీవంపోసి దయ నింపేవాడూ
పదాలని శుభ్రం చేసి సౌందర్యం అద్దేవాడూ
వాక్యాలని నిద్రలేపి స్వప్న సంచారం చేయించేవాడూ
దయగా, అందంగా, చురుకుగా ఉండివుంటాడని 
తమ లోపలి కవిని వెలుపల ధ్రువపరచుకోడానికి అతన్ని చూడబోతారు

రోజూ చూసే ఇంటిలోని, వీధిలోని మనుషుల్లో ఒకడుగానే 
కవి వాళ్ళకి ఎదురౌతాడు
కాస్త నమ్రతా, గర్వం, మరికాస్త జాలీ, కోపం  
కొంచెం లౌక్యం, కొంచెం భోళా 
ఎపుడూ చూసే నమూనాల్లో ఒకడుగానే కవి వాళ్ళతో మాట్లాడతాడు

ఇతనూ మనలాంటివాడే కదా అనుకొంటూ 
భ్రమలు చిట్లిన నవ్వొకటి నవ్వుకొంటారు 
బహుశా, రాస్తున్నది ఇతను కాదు, 
ఏ దివ్యభావాలో ఇతన్ని వశపరచుకొని, వాహిక చేసుకొన్నాయని 
తాజా సమాధానంలోకి నిదానంగా తేటపడతారు 

కవిని నిజంగా ఎవరు కనిపెట్టగలరు 
పైపై నడతల నివురువెనుక తేజోరాశిని ఎవరు తాకగలరు 
తన అగ్ని ఎవరినీ దహించరాదనే దయచేత నటిస్తున్నాడని తెలుసుకోగలరు
తనలో నిదానంగా ఫలదీకృతమౌతున్న రేపటి కవితల్ని 
అతను మొరటుగా మట్టిలా దాస్తున్నాడని ఊహించగలరు 
అతనిలాంటి మరొక కవి మినహా, కవిత్వప్రేమికుడు మినహా  
అతని అంతరంగంలోకి సునాయాసంగా ఎవరు చొరబడగలరు

అందుకే చూడవచ్చిన వాళ్లకి వీడ్కోలు చెబుతూ 
'మీరు రావటం సంతోషం, మళ్ళీ కలుద్దాం ' అని కవి అంటున్నపుడు
అతని కళ్ళవంక ఎపుడూ చూడకండి 
తనని వాళ్ళు చూడలేకపోయారన్న బెంగ వాటిలో ముసురుకొని వుంటుంది

14 నవంబర్ 2012

పసిదనపు స్వర్గం


దైవంలాంటి మరొక ఉదయం  
పసిదనపు స్వర్గంలోని పిల్లలు
కవిచుట్టూ చేరి, 'మా గురించి కవిత్వం రాయ ' మని ఆజ్ఞాపించారు 
ఆనందసముద్రంలో ఆల్చిప్పల్లా విచ్చుకొన్న కళ్ళల్లో
ఆశ్చర్యాల ముత్యాలు ఊగుతున్నాయి 

కవి వాళ్ళ గురించి ఏమి రాస్తాడు
వాళ్ళపైన కవిత్వం రాయటానికి వాళ్ళలాగా కావాలి
ఇంతకాలం రహస్యంగా పోగేసుకొన్న భయాలనీ
జ్ఞానమని భ్రమిస్తున్న ఉత్త జ్ఞాపకాలనీ 
కాసేపైనా విప్పుకొని సూర్యకిరణాల తీగలమీద ఆరేసుకోవాలి    

పొందటమే కాని, పోగొట్టుకొనే విద్య తెలియని
తీసుకోవటమే కాని, ఇవ్వటం ఎలాగో మరిచిన
చీకటి దారులవెంట ఇరుకిరుకు గుహల్లో పడి 
కవి చాలా దూరం నడిచివచ్చాడు

'మన్నించండి, నేను రాయలేను
నాలోని అమాయకత్వం చాలాకాలాల క్రితమే అదృశ్యమయింది

నేను జీవితాన్ని జీవించడం ఏనాడో మానేసాను
ఆనందాన్ని ఆనందించడం కోల్పోయాను

దేనినీ పట్టించుకోని
నాలోని సాహసపు విద్యుల్లతను ఏనాడో ఉండచుట్టి మూలకు విసిరేసాను
అందంలోకో, ఆర్ద్రతలోకో అలవోకగా కరిగిపోయే ద్రవమేదో నాలో ఆవిరైపోయింది

నేనిపుడు అలవాట్లనీ, ఆలోచనలనీ జీవిస్తున్నాను
నేనిపుడు ఉద్వేగాలనీ, గాయాలనీ పూజిస్తున్నాను
నన్ను శకలాలు చేసి చూసుకొని మురిసిపోయే
తెలివితేటల బాటల వెంట
అందరికన్నా ముందుకు దూసుకుపోయే పనిలో ఉన్నాను

పిల్లల్లారా, నన్ను మన్నించండి
నాలో మరక వలే మిగిలిన పురాతన స్మృతి ఏదో  
నేను మీలోంచి మొరటుదనంలోకి తరలిపోయానని చెబుతోంది
నా జీవనానందం ఏనాడో బెరడు కట్టిందని విసుక్కొంటోంది
మీపైన కవిత్వం రాయలేను
నేనిక పసిదనపు స్వర్గంలో అడుగు పెట్టలేను '

కవిచుట్టూ ఆవరించిన స్వప్నగోళంలోని పిల్లలు
దేవతల్లా, పక్షుల్లా, చెట్లలా కాంతులీనుతున్న పిల్లలు
సూర్యకాంతిలా, శుభ్రశ్వాసలా, రంగుల్లా, పరిమళాల్లా, రుచుల్లా
జీవితోత్సవం నిండిన పిల్లలు
రుతువుల్లా, ఆకాశంలా, మబ్బుల్లా
నదీజలాల్లా, వాటి పరుగులా, సముద్రాల్లా, నురగల్లా 
జీవితంలోకి జీవించటం నింపుతోన్న పిల్లలు
నవ్వుల్లా, కేరింతల్లా, కపటం తాకలేని కన్నీటి జడుల్లా
ఇది జీవితం మినహా మరేమీ కాదని ప్రకటిస్తున్న పిల్లలు  

దయగా, మరికాస్త దయగా, మరింత దయగా
అతన్ని కౌగలించుకొన్నారు
ముద్దుపెట్టుకొన్నారు
అతని తలపై నిమిరారు
అరక్షణం వారి అమాయకత్వాన్ని విడిచి
అర్ధవంతమైన చూపుల వెన్నెల కురిపించి ఆపాదమస్తకం అభిషేకించారు   

కవి ఇపుడు కన్నీటి శిఖరమయ్యాడు
తల వాల్చి, కనురెప్పలు వాల్చి, లోలోపలి ఉద్రేకాలు రాల్చి
తనలో ఎగిరెగిరి పడుతున్న వేల గర్వాల సముద్రపక్షుల్ని  
దు:ఖకెరటాలూపి దూరతీరాలకు పంపిస్తున్నాడు

కవిలో ఇపుడు
దేశాలూ, మతాలూ, జాతులూ కరిగి నీరై పోతున్నాయి 
చరిత్రలూ, వ్యవస్థలూ, తనపరభేదాలూ - అర్ధాలు కోల్పోయి చెదిరిపోతున్నాయి  
కవిలో ఇపుడు నల్లని శిలలేవో, శిలాజాలేవో
మంచై, నీరై, ఆవిరుల స్వరాలై 
కాంతికిరణాల కౌగిలి వెంట కనిపించని లోకాలకి తరలిపోతున్నాయి

పిల్లల కాంతిగోళం, కవి యుగాల జీవితాన్ని రద్దుచేసి
మెలకువలోకీ, మెలకువలాంటి తాజాదనంలోకీ   
క్షణమంత తేలికా, శాశ్వతమంత స్థిరమూ అయిన జీవితంలోకీ తీసుకువచ్చింది    

పసిదనపు స్వర్గం
అతన్ని పచ్చని ఆకునీ, పచ్చదనాన్నీ చేసింది
పూవునీ, పూలరంగుల్నీ, పరిమళాన్నీ, వికాసాన్నీ చేసింది   
పక్షినీ, పక్షుల పాటనీ, పక్షిరెక్కల చుట్టూ పరుచుకొన్న వినీలగగనాన్నీ చేసింది      

అతనికి ఎడతెగని ఆశ్చర్యాన్నీ, జవాబు అవసరం లేని ప్రశ్నలనీ
ఏమీ లేని మౌనాన్నీ, ఏమీ కాని శాంతినీ,   
ఏ దిగులు రంగులూ కనరాని కాంతినీ ప్రసాదించింది     

అతను నమ్రతగా, కృతజ్ఞతగా
ఆ దేవతల ముందు చేతులు జోడించి నిలుచున్నాడు చివరిసారి  

అప్పుడు వాళ్ళలో ఒకరు
'కవీ ఇప్పుడు కవిత్వం చెప్పు ' అనగా విని
కొత్తగా చేరిన పిల్లవాడొకడు
అటూ, ఇటూ చూసి 'కవి అంటే ఎవరు ' అని అడిగాడు

పసిదనపు స్వర్గం ఫకాలున నవ్వుల్లో మునిగి
అక్షరాలను విడిచి ఎటో ఎగిరిపోయింది



_____________________________
ప్రసారం: ఆకాశవాణి, విజయవాడ  14.11.12 

03 నవంబర్ 2012

ఇస్మాయిల్‌గారి స్మృతి: ఒక పక్వఫలం!


 జీవన సౌందర్యమూ, సౌకుమార్యమూ తెలిసిన మిత్రుడొకరు ఒక సాయంత్రం ఫోన్ చేసి ‘నేనొక చిట్టడవిలో ఉన్నాను. పక్షుల కూతలు వింటున్నాను. ఉన్నట్టుండి నా చుట్టూ ఉన్నదంతా ప్రవహించిపోతున్నట్టూ, నా శరీరం మాత్రమే జడంగా ఉన్నట్టూ అనిపించింది’ అన్నారు. ‘అవును, మనసు లోపలికంటా ఉన్న ఆందోళననీ, వెలితినీ మరచి, కేవలం ప్రకృతిలో మమేకమైనపుడు అది పూర్తి ప్రశాంతంగా ఉంటుంది. అలా ఎక్కువ సమయం ఉంటే శరీరం కూడా లేనట్టుంటుంది.’ అన్నాను. కవీ, చిత్రకారుడూ అయిన ఆ మిత్రునితో ‘మన కవిత్వం, బొమ్మలూ, అన్నీ కూడా భయం నుంచే జనిస్తాయి. భయానికీ, స్వేచ్ఛకీ మధ్య ఘర్షణలోంచి అవి అన్నీ సృష్టిస్తాం. భయాన్ని దాటిన క్షణాల్లో మనకు తెలిసిందీ ఏమీ లేదు. తెలియాల్సిందీ ఏమీ లేదు అనిపి స్తుంది’ అన్నాను. మిత్రుడు ఆ మాటలకు సంతోషించాడు. అతని ప్రశాంతతలోకి అంతకన్నా ఎక్కువగా చొరబడడం ఇష్టం లేక త్వరగా సంభాషణ ముగించాను.

స్పష్టమైన ఎరుక

బహుశా మా సంభాషణని లీలగా ఎక్కడి నుంచో ఇస్మా యిల్‌గారు విని తల పంకించి ఉంటారనుకుంటాను. కవి త్వం, ఆర్టు, సేవ-మాధ్యమం ఏదైనా-వాటి ద్వారా ప్రకటిం చే వ్యక్తులు రెండువిధాలుగా ఉంటారు. ఒకరు-ఆయా విష యాలలో ఎంతో పరిజ్ఞానమూ, అనుభవమూ సంపాదిం చిన తరువాత కూడా వాటి వలన పేరూ, ఇతర ప్రయోజనా లూ లక్ష్యంగా పనిచేస్తారు. వారికి మాధ్యమం కన్నా దాని ద్వారా సిద్ధించే ప్రయోజనాలే ముఖ్యం. మరొకరు ఆయా మాధ్యమాల లోతుల్లోకి ప్రయాణించి వాటి అంతస్సారాన్ని కనుగొని వాటిలోకి తమని కోల్పోయి - నిజమైన జీవితోత్సవంలోకి మేలుకొంటారు. అటువంటి వారి ద్వారా ఉదాత్త విలువలు తమని ప్రకటించుకుంటాయి. వీరిలో ఇస్మాయిల్ గారు రెండవ తరహా వ్యక్తి. మానవ సంస్కృ తిలో, సాహిత్యంలో ఇప్పటివరకు మొదటి తరహా వ్యక్తులు అధికం. కళ పరమావధి పట్ల స్పష్టమైన ఎరుక కలిగిన అరుదైన వ్యక్తులలో ఇస్మాయిల్‌గారు ఒకరు.

చేతనా నైశిత్యం

కళ కళకోసమే అని పూర్వు లు చెప్పినపుడు కళ వినో దం కోసం అని అర్థం కాదు. సామాన్యులలో నిద్రాణంగా ఉండే మానసిక చైతన్యాన్ని మరింత మేలుకొలపడానికే కళలని అర్థం చేసుకోవాలి. కేవల వినోద ప్రధానమైన కళలు మనిషిలోని సృజనా త్మ కతనీ, చైతన్యాన్నీ సుప్తావస్థలోకి తీసుకెళ తాయి. అయితే మనిషి చైతన్యవంతుడు కావడం అంటే మరింతగా మానవ సామాజిక జీవనంలో కల్పించుకోవడం అని అర్థం కాదు. మరింత ఎక్కువగా గాఢంగా మొత్తం జీవితం పట్ల ఎరుక కలిగి ఉండడం అని గ్రహించాలి. దీనినే ఇస్మాయిల్ గారి వంటి వారు చేతనా నైశిత్యం (సెన్సిబిలిటీ) అంటారు. ఈ చేతనా నైశిత్యాన్ని పెంచడమే కళకు తనంత తానుగా స్వతహాగా ఉన్న లక్ష్యం. కవిత్వం ఈ ఉదాత్త లక్ష్యాన్ననుసరించాలని ఇస్మాయిల్‌గారు జీవితమంతా చెబుతూ వచ్చారు.

విలువైన బహుమతులు

మనకు, ముఖ్యంగా తెలు గు వాళ్లకి ఓపిక తక్కువ. ఒక ఉద్వేగాన్ని ఎక్కువ సేపు నిలబెట్టుకోవడానికీ, ఒక ఆలోచనని అనుస రించి చివరికంటా ప్రయా ణించడానికీ, ఒక దృష్టి లోతుకంటా ప్రవేశపెట్టడా నికీ చాలా ఓపిక కావాలి. శ్రద్ధ కావాలి. చాలా సంయ మనం కావాలి. ప్రశాంతత కావాలి. మనం కొంచెం కంగారు మనుషులం. త్వరగా నిర్ణయాలు జర గాలి. త్వరగా పని చేయా లి. అంతకన్నా త్వరగా ఫలితం అనుభవించాలి. మనకు సాఫీగా దారి వెంట నడవడం కంటె ఒక ట్రెడ్‌మిల్ ఊహించుకుని దాని మీద పరుగులు తీయడం పట్ల అభిరుచి. ఒక్క అడుగూ ముందుకు పడకపోయినా, మనం చాలా చైతన్యంగా ఉన్నామనుకొని సంతోషిస్తాం. ఇలాంటి వాతావరణంలో ఇస్మాయిల్‌గారు నిశ్శబ్దంగా, నింపాదిగా మనకు విలువైన బహుమతులు అందచేసి వెళ్లిపోయారు. ఆయన రాసిన అనేక కవితలని మనం మృదువుగా, గాఢంగా హృదయానికి హత్తుకొంటే ఆయన ఎంత లోతైన ప్రశాంతతని మనలో నాటే ప్రయత్నం చేశారో అర్థమవుతుంది.

విశుద్ధ అనుభవం

చిట్టడవిలోని నిశ్శబ్దంలో, ఒక పక్షి కూత విన్న మిత్రునితో ‘ పక్షికి సంబంధించిన, కూతకు సంబంధించిన సమాచారం మనకు అనవసరం. ఒక శబ్దం వింటాం. కేవలం ఒక శబ్దం. కేవలం ఆ శబ్దం వినడానికే ఈ లోకంలోకి వచ్చినంత శ్రద్ధగా. అలా విన్నపుడు అది మనని శుభ్రం చేస్తుంది’ అన్నాను. అలాంటి శుభ్రమైన స్థితిలోనే సృజనాత్మకతా, హృదయమూ, బుద్ధీ వికసిస్తాయి. మనం మరింత నాణ్యత గల జీవితం గడుపుతూ, సాటి వారికి నిజమైన సహాయం చేయగలుగుతాం. ఇస్మాయిల్ గారి కవిత్వం ఎప్పుడూ చెబుతున్నదిదే. సమాచారాలన్నిటినీ పూర్తిగా తుడిచేసి కేవలం విశుద్ధ అనుభవాన్నివ్వడానికే ఆయన ఎప్పుడూ ప్రయత్నించారు. తెల్ల కాగితం మీద ‘ ఒక అడ్డగీతా ఒక నిలువు గీతా’ గీసి ఒక గోదావరి లంక గ్రామాన్నీ, అక్కడి మొత్తం వాతావరణంలోని ప్రశాంతతనీ, సమగ్రతనీ మనలో మృదువుగా ప్రవేశపెడతారాయన.

గీసింది - చెరిపింది

జీవితం కాని, కళ కాని మరింత, మరిన్ని అనే సంఖ్యా వ్యామోహం నుంచి బయటపడి స్వచ్ఛమైన జీవనసారం లోకీ, రహస్యంలోకీ ప్రవేశించడం మొదలుపెట్టినపుడు - పోగు చెయ్యడంలో కన్నా, పోగొట్టుకోవడంలో సుఖం స్వేచ్ఛ ఉన్నాయని, మనం ‘గీసింది కన్నా , చెరుపుకోగలి గింది’ మనని బాగా వ్యక్తం చేస్తుందని, దానికి ఎంతో ప్రజ్ఞా ఓర్పూ అవసరమని మనకు అర్థమవుతుంది.

అనేక కసరుకాయలతో నిండిన మన కాలం తెలుగు కవిత్వ వృక్షంలో ఇస్మాయిల్ గారి కవిత్వం సహజంగా పక్వమైన ఒక మధుర ఫలం. మనం ఇస్మాయిల్ గారితో కలిసి నడవడానికి ఇంకా చాలా దూరం నడవవలసి ఉంటుంది.



ఇస్మాయిల్ గారి కవిత్వం ఈ బ్లాగులో చదవవచ్చు: http://ismailmitramandali.blogspot.in/


వ్యాసం ప్రచురణ: సాక్షి దినపత్రిక
http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=21917&Categoryid=1&subcatid=3

01 నవంబర్ 2012

కంప్యూటరు పూలు


కంప్యూటరు తెర మీద రంగురంగుల పూలు పలకరించి వెళుతున్నాయి
నిజమైన చాలా వాటిని చూడటంకన్నా, ఈ పూలని చూడటం బాగుంటుంది
ఇంత స్పష్టంగా, కాంతిగా, ఇంత పరిణామంలో పూలని ఎప్పుడూ చూడలేదు

బయట పూల అనుభవం ఇంత సుఖంగా, తేటగా ఉండదు
అక్కడ పూలతోపాటు అనేకం పలకరిస్తాయి

మట్టీ, గాలితెరలూ, వెచ్చని, చల్లని వాతావరణాలూ,
వికాసంలోకో, వడిలిపోవటంలోకో పూల ప్రయాణాలూ, పరిమళాలూ
వాటి వివరాలేమిటనో, సొంతమెలా చేసుకోవాలనో ఆలోచనల రొదలూ
దేహభారమూ, పనుల, పథకాల, పక్క మనుషుల చిక్కుముడులూ
అన్నీ కలిపి చూపునీ, అనుభవాన్నీ కప్పేస్తాయి

ఈ తెర మీది పూలతో ఏ గొడవా లేదు
చూడటం మినహా మరే పనీ లేనపుడు అవి నాలోకి ప్రవహిస్తాయి

ఇవి పూలు కాదు, పూల జ్ఞాపకాలే, రంగులు కాదు, రంగుల పరిచయాలే
అయినా ఈ కాస్తంత పూల అనుభూతి చాలు
వెలుపలి జీవితం చీకటిలోకి ప్రయాణిస్తున్నపుడు
వెలుతురు సూదిమొనల్లాంటి పూల జ్ఞాపకాలు చాలు

వీటి రంగులు ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను
పూవులిలా ఉంటాయని, రంగులిలా ఉంటాయని
రంగులతో, పూవులతో, వెలుతురుతో నిండిన ప్రపంచం ఇలా ఉంటుందని
ఇప్పుడు కంప్యూటరు నాకు నేర్పుతోంది

బాగా తెలుసుకోవాలి జీవితాన్ని జీవించటాన్ని
తెలుసుకొని, తెలుసుకొని
ఎప్పుడో కంప్యూటరు నుండి జీవితం లోకి అమాంతం ప్రవేశించాలి

___________________________________
ప్రచురణ: తెలుగు.వన్ఇండియా.ఇన్ 31.10.2012
http://telugu.oneindia.in/sahiti/kavitha/2012/bvv-prasad-poem-computer-poolu-107764.html

30 అక్టోబర్ 2012

వర్తమానంలోకి


రాలిపోయిన రాత్రిలాంటిది గతం
ఇంకా రేకులు విప్పని  రాత్రి భవిత
వర్తమానపు కాంతిపుష్పం ఊగుతోంది గాలిరేకులతో

రాత్రులకైనా నల్లని రంగుంటుంది
మృదువిషాద పరిమళముంటుంది, విరామంలోకి వికసిస్తూవుంటుంది
రంగూ, రుచీ, వాసనా లేని గతమూ, భవితా
ఊహల్లో మాత్రమే ఉనికిని పాతుకునుంటాయి
జీవితమంతా వెంటాడినా
వేలికొసకు క్షణకాలపు దూరంలో నిలిచి వెక్కిరిస్తాయి  

గతం జీవన శిధిలాలయం, భవిత గాలిలో తేలుతున్న నగరం
కూలిన గోడల్నో, పునాదిలేని భవనాల్నో ప్రేమించేవాళ్లని ప్రేమించనీ
మిత్రుడా, రా
హద్దుల్లేని ఆకాశాన్ని కప్పుకొన్న వర్తమాన భవంతిలో
మనం కాలం మీటుతున్న సంగీతాన్ని విందాము


దాహాగ్ని కోల్పోయి ఎండిపోయిన చెట్లనీ
మట్టిని తవ్వి మొలకెత్తని విత్తనాల్నీ చూస్తూవుండేవాళ్ళని చూడనీ
రా, మనం పోదాము
ఆకుపచ్చని జీవితంలో, అది రాల్చే నీడల్లో తడుద్దాము    

గతంలో వెలిగి ఆరిపోయిన దీపాల్నీ
భవిత కోసం ఇవాళ చమురు పోగేసేవాళ్ళనీ పోగుపడనీ
రెండిటినీ దగ్ధంచేసే అగ్నిలా లెక్కలేనితనంలోకి వెలుగుదాము

గతంలోకో, భవితలోకో ఇవాళ్టి సంపద ఒంపుకొంటూ
నిరంతరం పేదలుగా మిగిలేవాళ్లని మిగలనీ

కాంతి పగిలి కిరణాలు వెదజల్లినట్లు
ఆనందం పగిలి జీవితం అన్నివేపులకీ విచ్చుకొంటోంది

రా మనం పోదాము త్వరగా
వర్తమానంలోకి, జీవితంలోకి, పసిదనంలోకి
ఎప్పటికీ మరణించని బహిరంగ రహస్యంలోకి
చిరంతన శాంతిలోకి, చిరునవ్వులోకి, ఏమీ మిగలకపోవటంలోకి..



ప్రచురణ: ఆంధ్రజ్యోతి 'వివిధ' 29.10.12

20 అక్టోబర్ 2012

బివివి ప్రసాద్ కి ఇస్మాయిల్ గారి ఉత్తరాలు


ఇస్మాయిల్ గారితో సుమారు పదేళ్ళ అనుబంధం వుంది. కలిసింది చాలా తక్కువ సార్లు అయినా, తరచూ ఉత్తరాలు రాసుకొనేవాళ్ళం. ఎక్కువగా కార్డుమీద రాసేవారు ఆయన. శ్రద్ధగా రంగుల ఇంకులు వాడేవారు. చాలా ఉత్తరాలు కవిత్వంలాగానే ఉండేవి.

కవి కవిసమయంలో, లోకాన్ని ఎలా రసప్లావితంగా దర్శిస్తాడో, అట్లా, జీవితాన్ని ఎప్పుడూ రసాత్మకంగా అనుభవించే కవులు అరుదుగా వుంటారు. ఇస్మాయిల్‌గారి వర్తనా, కవిత్వమూ వేరుగా ఉండేవికావు. ఆయన కవిత్వంలో కనిపించే సరళతా, స్వచ్చతా, పరిశుభ్ర సౌందర్య స్పర్శా ఆయన స్నేహంలో కూడా స్పష్టంగా కనిపించేవి. అప్పుడే అక్షరాలు దిద్దుకొంటున్న వారిని కూడా తనతో సమానులన్నట్లు ఆదరించే అటువంటి సంస్కారం అరుదుగా వుంటుంది.

అటువంటి ప్రేమాస్పదమయిన కవిని తలుచుకొంటూ, వారు రాసిన ఉత్తరాలు కొన్ని ఇక్కడ మిత్రులతో పంచుకొంటున్నాను.















చివరి ఉత్తరం ఒక చిన్న తమాషా సందర్భం. నా మూడవ హైకూ సంపుటి 'పూలు రాలాయి' ఇస్మాయిల్ గారికి అంకితమిచ్చాను, ఆయనకు ఒక మాటన్నా చెప్పకుండా. పుస్తకం ప్రింట్ అయి వచ్చాక, పోస్ట్ లో పంపాను. దానికి ఆయన ప్రతిస్పందన ఇది.

సుమారు పుష్కరం తరువాత గత ఏడాది, డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు 'పిట్టల కాలనీ' హైకూ సంపుటి ముద్రించి పోస్ట్ లో పంపారు. తెరిచి చూస్తే 'బివివి ప్రసాద్ కి' అని వుంది ఇంకు అక్షరాలు కాదు, అచ్చు అక్షరాల్లో!   


“ఆకాశం కవిత్వం” : నా అంతః చేతన - మనల్ని మరలా పుట్టించే ఆకాశం: సతీష్

మిత్రులు సతీష్ 'ఆకాశం' కవిత్వాన్ని అనుభవించి తన బ్లాగు లో ఇలా పలవరించారు.
కవిత్వం గురించి కవితాత్మకమైన ఈ మృదుభాషణను చూడండి.


మానవాళికీ, జీవితానికీ నేను రాసుకొన్న ప్రేమలేఖ ఈ ‘ఆకాశం’: బివివి ప్రసాద్ (పుస్తకం.నెట్)

మనిషి తనను నడిపించే ప్రకృతి ధర్మాల్ని పెనవేసుకునే నిరంతర ప్రక్రియలో నిమగ్నమై ఉంటాడు.
అందుకేనేమో ఇంద్రియానుభూతిని ఊహకందని దార్శనికతకు అన్వయించుకుంటాడు.
తారల ఇసుక మైదానంలాంటి చీకటి ఆకాశాన్ని వెన్నెల రాత్రి కంటే ఎక్కువగా ఆస్వాదింపజేయడం మిణుకు వెలుగుల్ని చినుకుల్లాకాక మన జీవితం పట్టలేనంత పెద్ద కాంతిలోకాలుగా దర్శింపజేయడం ఓ మర్మవిద్య.
చందమామ వామనుడై తన వెన్నెల పాదాన్ని ఈ కవి హృదయం పై మోపి నిజంగానే రహస్యాంతర లోకాలకి అణచి కవిత్వమై ప్రకాశించమని శాసించి ఉంటాడు. లేకపోతే కన్నీటితో ఈ ప్రపంచాన్ని కడిగేసే శక్తి బి.వి.వి.ప్రసాద్ అనే కలానికి ఎలా వస్తుంది! జీవనోత్సాహానికి మారుపేరై ఎలా నిలుస్తుంది!!
ఈ ప్రపంచమనే చిన్నిబంతిపై ఎప్పటికీ జీవించి ఉండాలనే తలంపుతో ఆకాశం నుంచి విరిసే కవితా కిరణాలతో లాలనగా తాకే ఇనబింబం కన్నా ఆకాశాన్ని ఎవరు గొప్పగా అందివ్వగలరు! మబ్బుల్లేని నిర్మలాకాశంలో దైవత్వం దర్శించినవాడు.. తనలో తనకే తెలియని అనంతాకాశాన్ని ప్రదర్శించి పరవశింప చేస్తాడు.
ఈ మిశ్రమ ప్రపంచంలో బలహీనతలను , ఎడారుల్ని చీకటిని ఓపిగ్గా బుజ్జగిస్తూ…. వెలుతురు బలాన్ని పూలతావితో కలిపి అందించడంలో ఆకాశం కవితా-సంచిక సర్వత్రా చర్చనీయాంశం అయింది. మనిషి తన ఇంటినీ, కలల్నీ సరిచేసుకోవడానికి వెలుగు రేఖల్ని పంచింది.

ఇటీవల కాలంలో వచ్చిన సారవంతమైన సృజనగా పలువురు మెచ్చి ఆదరించిన ఆకాశం సంపుటి ఈ సంవత్సరం ఇస్మాయిల్ అవార్డుకి ఎంపికైంది. నవంబరు 4న కవి BVV ప్రసాద్ కాకినాడలో పురస్కారం అందుకునే నేపథ్యంలో ఆత్మీయ భావనలతో కలగలిపిన తియ్యదనాన్ని నా మితృలందరికీ పంచే ప్రయత్నమే ఈ పరిచయం.

పుట్టగానే పిల్లలు ఏడుస్తూ దుఖమయ ప్రపమంచాన్ని వ్యాఖ్యానిస్తారెందుకని ప్రశ్నిస్తూ కపటంలేని కాలాల్లోనూ, భయరహిత ఏకాంతంలోనూ సంచరించాల్సిన అవసరం ఎదిగిన పెద్దలకూ గుర్తు చేస్తూ ఈ పుస్తకం మన ఆలోచనలకు కు ఆహ్వానం పలుకుతుంది. అర్థంకాని సంరంభాలలో పడి ఉన్న మనకు పిల్లల ద్వారా ఒంటరితనాన్ని దర్శింపజేస్తారు. ఆ ఒంటరితనమే అక్షరాలను మనలో తడిమి స్నేహం చేయిస్తుంది.

కొలనులాంటి జీవితంలో కలతపడే సందర్బాలు మట్టిపెళ్లల్లా జారినపుడు అలల తలపుల్ని తెరచి స్వాగతించడం జీవితానికి సహజమని, అవి జారి కరిగిపోవడం సహజాతమని అలల్లా ఒక దానినొకటి ఓదార్చుకుని నీటినీ, కన్నీటినీ తీర్చడం, తద్వారా మనో ప్రతిబింబంలో ప్రశాంత ఆవేశాన్ని సాక్షాత్కరించు కోవడం ధ్యానమని ధన్యమని ఆధ్యాత్మిక చింతనను అన్వయిస్తారు. చేయాల్సిన పనులకు వ్యతిరేకంగా ప్రయాణించే మనుషులకు ముక్తి కాంక్షను కలిగిస్తుంది ఆకాశం.

తనకు తెలియని ప్రశ్నలు హృదయంలో ప్రవేశించినపుడు మెదలిన ప్రతిప్రశ్న ఇందులో సమాధానమై నిలుస్తుంది. కళ్లు చెమరుస్తాయి. ప్రతి మనిషీ తన మాయాలోకాన్ని దాటి దైవత్వం చేరే అవకాశం కల్పిస్తుంది. గాయాల్ని మాన్పలేని జీవితాన్ని కౌగలించుకోవడం మనమూ నేర్చుకుంటాం. ఈ పుస్తకం నిండా స్నేహితలా పలుకరించి చల్లబరిచే చరణాలే .. మనలో మనకు నచ్చిన మనిషిని చూపించే కారణాలే.

ప్రతి అక్షరం దయకురిపిస్తూ జీవనభయానికి దూరంగా మనల్ని జరుపుతున్నట్లు.. మనలో మేలుకొన్నట్లు కలగంటాం. నవ్వులాంటి అందాలనూ, భయాల్లాంటి అరణ్యాలను సమానంగా మోసినా.. మనల్ని మనం వెక్కిరించుకుని తేలికైపోయే వరాన్ని ప్రసాదిస్తుంది ఆకాశం . ఈ పుస్తకం చదివిన పాఠకునికి ఏ మనిషైనా అపురూపంగా కనిపిస్తాడు . ప్రతి నవ్వులోనూ దర్శించేది అందాన్నే . గాఢమైన నిద్రతరువాత పొదవుకున్న మెలకువనూ పొందుతాం.


అందరినీ ఒకే ఆకాశం, ఒకే భూమి తయారు చేసుకున్నాయి. ఈ విషయాన్ని భిన్న ప్రవృత్తులను ప్రదర్శించే మనుషులను చూస్తే నిజం అనిపించదు కానీ.. మనల్ని విడిచివెళ్లిన మంచి మనుషుల్ని తలచుకోకుండా ఉండలేం కదా! అలా తలుచుకుంటున్నట్టే (కవి తన కోసం సృష్టించుకున్నదో, మన కోసమో తెలియకపోయినా) ఈ కవితా సంపుటిలో మాటలు మనలో ఉన్న తాత్త్విక చింతనను మన ఆకాశంగా మలుస్తాయి.

మనలో మనం మేలుకోనే మాటలు చదువుతున్నప్పుడు ఈ ఒక్క పుస్తకమే జీవిత సారమనిపిస్తుంది. రాతిలోని కప్పలాంటి జీవితాలకి రాయి చిట్లి ఆకాశం కనిపించినట్లు ప్రశాంతతను ముప్పొరిగొనే భావాలు ఈ పుస్తకం నిండా దర్శనమిస్తాయి.

నిస్పృహ, దుఖమో పీడించే కారకాలై లోకాన్ని విదిలించుకుని వెళ్ళే మనసులకు వెళ్ళిపోవాలనుందా తప్పక చదివి వినిపించాల్సిన కవిత. ఈ ఒక్క కవితే చాలు ఆకాశాన్ని నేలదించి మనకు అందించడానికి. ఒక్కసారి ఈ కవితోపదేశం విన్నాక, మంత్రశక్తిని మించిన చైతన్యం నరనరాల్లో ప్రవహిస్తుంది. ముందుతరాలను కాపాడుకోవడానికి ఈ కవితనే కవి నగారాగా మోగించాడనిపిస్తుంది.

గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడివై ఆరోగ్యంగా జీవించు
మర్యాదల ప్రాకారాల ఊపిరాడని మనషుల్ని దయతో పరిహసించు
సమర్ధుల్ని ఈతల్లో కొట్టుకుపొనిచ్చి జీవితంగట్టున ప్రశాంతంగా నిలబడిచూపించు
బతికేందుకు వచ్చావు కనుక బలంగా ఒక బతుకుబతికి చూపించు

నిజంగా బతుకు బతికి చూపించాలనిపిస్తుంది్. జీవితం ఆగినా మనిషి వెళ్లిపోయాక బాధించని ఙ్ఞాపకాల కిటుకుల గుట్టూ విప్పుతారు. ఉద్వేగాలనే కాదు వాటిని పొదలి పట్టుకుని ఓర్చుకోవడమే కాదు; అలవాట్లను మార్చుకుని నిశ్శబ్ధంగా బతికే విద్యను ప్రసాదించి సార్ధక నామధేయుడైనాడు కవి.

అడవిలో వికసించిన అనామక పుష్పంలా..
అక్షరాలు గుర్తించేలోపు అదృశ్యమైన ఊహలా….
నిశ్శబ్ధంగా బతికితే ఏమిటి ! నిరాడంబరంగా వెళ్లిపోతే ఏమిటి ?
అన్న ప్రశ్నల్లో దొరికే సమాధానాలు, ఎవ్వనిచే జనించు అన్నట్లు స్వయంపూరకాలు.

అలవాటు మహామాయై తిమ్మిరిలా కమ్మిందంటే బతుకు అందమూ, బాధ తెలియదు అంటూనే బతికి ఉండటం మాత్రమే అలవాటు కావాలంటారు. శాంతిని ప్రసాదించే నిండైన క్షణాలను మనపరం చేస్తారు.

ప్రసాద్ గారి కవిత్వంలోని మరో కొత్తకోణం సౌకుమార్యం. కన్నీళ్లతో కరిగించి గెలవడం తప్ప గట్టిగా అరచి చెప్పినమాట ఒక్కటీ లేదు . మృదువైన సమయాల్లో ధ్యాన సముపార్జనను , తపశ్శక్తినీ పరంపరగా అందించే తపన అక్షరాక్షరం పలుకుతుంది.

ప్రేమించే జీవితంలోకి కవితలో జీవనస్పృహ మేలుకొన్నా, మృదువిషాదం తో సారవంతం చేసినా.. తొంగి చూసే ఎడబాటు క్షణాల్లో సత్యాలు దర్శితమవుతాయి.
కలలా కరిగిన కళ్లకి జీవితం నిండునదిలా దర్శింపజేయడంలో ప్రసాద్‍ది విభిన్న కోణం.
ఉదాత్తభావాలతో అనుబంధాన్ని ఉన్నతీకరించుకునే తత్త్వం అహరహం ప్రవహించింది ఆకాశవీధిలో…

దృశ్యం నుంచి రహస్యంలోకి
ఉద్వేగాల నుంచి స్వచ్ఛతలోకి
భయం నుంచి స్వేచ్ఛలోకి..
శ్రమ తెలియక నడిపించే స్నేహం నా కవిత్వం

నా కవిత్వం పోరాడదు. బ్రతిమాలదు
తవ్వినకొద్దీ పుట్టుకువచ్చే చీకటిగని కళ్లముందు గుట్టపోసి భయపెట్టదు
నచ్చినట్లు ఎగిరేందుకు క్రొత్త ఆకాశాలని చూపిస్తుంది.
మనం ఎన్నుకొన్న రెక్కల కోసం కొంచెం పొట్లం కట్టిస్తుంది
మన లోలోపలి జీవితేచ్ఛలా మన ఉనికి చాలు ఉత్సవమని భరోసానిస్తుంది


మనకు నిజమేకదా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే.

పిల్లల్ని ప్రేమిస్తే చాలు అంటూ వారినుంచి ప్రేమించడం నేర్చుకుంటూ వారు ప్రేమించడం మర్చిపోకుండా కాపాడుకుంటే చాలని నిజాయితీగా మనసులా స్పందిస్తారు. అసలు జీవితాన్ని అర్ధం చేసుకోవడానికే ఈ ఫుస్తకం చదవాలనిపిస్తుంది . ప్రపంచ రహస్యాలముడి ఏదో విప్పి చెప్పారనిపిస్తుంది.

చివర చూసినవాడు కవితలో పరిపూర్ణ జీవితాస్వాదనకు నిర్దేశం చేస్తూ సృష్టివలయాన్ని దాటించే ప్రయత్నంలో మన చేయి పట్టుకు నడిచే ఈ మాటలు మంత్రాలవుతాయి.

ఆనందిస్తే ఆకాశం పట్టనట్టు ఆనందించాలి
రోదిస్తే ప్రతి అణువూ కరిగిపోయేటట్టు రోదించాలి
సున్నితంగా ఉంటే ఆకాశం తాకినా చలించిపొవాలి
కఠినంగా ఉంటే అణువైనా చొరబడలేనంత కఠినం కావాలి


ఈ వాక్యాలు చదివినిప్పుడు భర్తృహరి చెప్పిన ‘వజ్రాదపి కఠోరానీ .. మృదూని కుసుమాదపి’ అన్న వాక్యానికి సరికొత్త వ్యాఖ్యానం అనిపించకమానదు.

కవి నిరలంకారితలో సౌందర్య కారకం సత్యమే. వికసించే పుష్పం మీద వేయి కవితలు రాయవచ్చు . వేయి భావాలు పువ్వు చుట్టూ సీతాకోకలై ఎగురవచ్చు.. అయినా పువ్వుపువ్వులా ఉండిపోతుందన్న సత్యమే.. ఏది ఉందో అది ఉంటుందన్న నిత్యమే.జీవితాన్ని దైవంలా భావించే కవి నుంచి ఆకాశం కన్నా తక్కువెలా ఆశించగలం !

As Above,
So Below.
As Within,
So Without. – The Emerald Tablet (about 3000 BC)

నా ఎమెరాల్డ్ టాబ్లెట్ నాకు దొరికింది ఆకాశం రూపం లో.. అంతఃచేతన ప్రతీకగా. 
కవి ర్మనీషీ పరిభూః స్వయంభూ:

*   *   * 
 
'ఆకాశం' సంపుటి దొరికేచోట్లు:
1. పాలపిట్ట ప్రచురణలు, హైదరాబాద్. ఫోన్: 040-27678430.
2. కినిగే.కాం లో ఈ బుక్ లేదా ముద్రిత ప్రతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

13 అక్టోబర్ 2012

ఆనందం

పూలూ, పక్షులూ, ఎడారులూ, సముద్రాలూ,
మబ్బులూ, సూర్యుళ్ళూ, నక్షత్ర సముదాయాలూ
ఎవరూ ఎరుగని ఏ శూన్యం నుండో
ఆనందాన్ని నీలోకి ఒంపుతున్నాయి
నీ జీవితం స్వయంగా ఆనందపు అభివ్యక్తి

దు:ఖం అనే నల్లటి ముసుగును మనపైన కప్పుకొని
కాలాన్ని గాఢాంధకారంగా చూస్తున్నపుడు కూడా
మనం ఆనందపు రూపంగానే వున్నాం

జీవనానందం అనే కాంతి మన కళ్ళని వెలిగించకపోతే
అంధకారాన్ని అయినా ఎలా చూడగలం

ఆనందించటం నీ హక్కు మాత్రమే కాదు. నీ బాధ్యత.
కళ్ళులేకుండా మరొకరికి దారి ఎలా చూపటం
నీకు తెలీని ఆనందాన్ని మరొకరికి ఎలా ఇవ్వటం
ఆనందంగా ఉండే పనిలో ఆనందంగా ఉండటమే విశ్రాంతి

ఆనందం దేనికీ ప్రతిచర్య కాదు
ఆనందానికి ఏదీ ప్రతిఫలమూ కాలేదు
మనం మాత్రమే ఆనందం పొందటంలేదు
ఆనందమూ మనని నిరంతరం పొందుతోంది

ఆనందమే ప్రేమ. ఆనందమే త్యాగం. సాహసం. స్వేచ్చ
ఆనందమే నిరంతర ముక్తబంధం

కారణాల సంకెళ్ళని ఆనందం తెంచుతోంది
మిత్రమా! అకారణంగా ఆనందించు
నువ్వు ఎవరూ ఎరుగని ఏకాంతపు ఆనందానివి



____________________
'నేనే ఈ క్షణం' సంపుటినుండి
 

01 అక్టోబర్ 2012

ఒక విడిపోని స్మృతిలోకి

సరే, మన హృదయాలు ఒకరిలోకొకరివి వెళ్ళిపోయావా, లేదా
నీలోకి చూసుకో ఓసారి, తడికన్నులతో నేను కనిపిస్తున్నానో, లేదో
నా స్మృతి గులాబీలా వికసిస్తూ ఉందో, వాడిపోయిందో  

ఇక చెప్పేదేమీ లేదు
బహుశా, మన స్పర్శలలో అదనంగా మేలుకొనే కొత్త లోకాలూ లేవు
మనకి ప్రేమంటే ఒక శుభ్రమైన అవగాహన

మళ్ళీ ఎక్కడైనా ఎదురైనపుడు
మనమధ్య ఇంద్రధనువుని తట్టిలేపే చిరునవ్వే మన ఏకైక సంభాషణ
ఒకరికొకరం గుర్తొచ్చినపుడు పాపాయిలా కళ్ళుతెరిచే దిగులే సాంత్వన  

మృదువుగా విను నా చివరి మాటలు
వివరణలేవైనా మన ప్రేమపై వాలే నీడలని తెలిసినా
జాగ్రత్త నా బలహీనత గనుక
మనకీ కాస్త జీవించటం నేర్పిన మౌనాన్నుండి  
నీ దగ్గర మాత్రమే బహిరంగపరచే నా పసిదనం నుండి
దాని బేలతనపు పొరలే ఉత్సాహం నుండి వస్తున్న మాటలు        

నువు వినవని తెలుసు
నా అర్థాలకన్నా, నా పదాల చప్పుడే నీకు ఇష్టమని తెలుసు
వాటిని పరుగుపెట్టించే ఉత్సాహమే ఇష్టమని తెలుసు  
ఉత్సాహం కన్నా, నేనుంటే చాలు ఊరికే నిండిపోవటమే ఇష్టమని తెలుసు          

అయినా నాతో నడువు, ఈ చివరిమాటల చివరి అర్థాలలోకి

మన తొలి ఆశ్చర్యాలకు ముందే మనం తెలుసు  
మన జీవన మూలాల్లో ఎక్కడో యుగాలపర్యంతం కలిసే జీవిస్తున్నాము
మన పైపై బెంగల అలల లోతుల్లో ఎపుడో ఒకరితో ఒకరు నిండిపోయాము

నువు తొలిసారి ఎదురైనపుడు నాలోపలి వెలితి ఒకటి తెరలా తొలిగింది
నీ అద్దంలో నా రూపం చూసినపుడు నేనెపుడూ నిండుగా ఉన్నానని కనుగొన్నాను  

'ఇక ఎవరిదారిన వాళ్ళం, ఎపుడూ కొత్తగా జన్మించటంలోకి వెళిపోదాము '    

నిన్ను చూసిన క్షణం చాలదా జీవితమంతా విసుగులేకుండా బ్రతికేందుకు
నా దారిలో ఎదురైన పిట్టలకి కొత్త సంగీతపు పాఠాలు బోధిస్తూ తిరిగేందుకు
నా పగళ్ళని పూవులుగా, రాత్రుళ్లని నక్షత్రాలుగా జీవితమంతా వెదజల్లుకొనేందుకు

విడిపోయేవేళ మేఘావృతమైన ముఖాలూ, వర్షనేత్రాలూ చాలవా
ఇక్కడ జీవించి వెళ్ళిన గుర్తులేవో మిగిలేందుకు    

ఇక మాటలు లేవు ఎక్కడా

ఒక నక్షత్రమేదో మెరిసి మాయమయింది

ఇప్పుడిక దేనినీ గుర్తుపట్టాలని లేదు



30.8.2012

ప్రచురణ: తెలుగువెలుగు అక్టోబరు 2012

20 సెప్టెంబర్ 2012

శ్రీ నిసర్గదత్త మహరాజ్ బోధన: సత్యానికి అత్యంత సూటిదారి


శ్రీ నిసర్గదత్త మహరాజ్ (1897-1981) ని, అనేకమంది సత్యాన్వేషులు దర్శించి, సత్యం గురించీ, సాధన గురించీ ప్రశ్నించినపుడు, చాలా తార్కికంగా, వారందరి ప్రశ్నలకూ, చాలా లోతైన జవాబులు ఇచ్చారు. అత్యంత గహనమైన సత్యం గురించి ఇంత ఓర్పుగా, ఇంత సూక్ష్మంగా వివరించిన వారిని మరొకరిని చూడలేదు.

వారి బోధన ఏ మతానికీ, విశ్వాసాలకీ, ఆచారాలకీ సంబంధించినది కాదు. సత్యానికి అత్యంత సూటి మార్గం.

వారి సంభాషణలన్నీ కలిపి 'అయాం దట్ ' పేరిట ఇంగ్లీషులోకి అనువదించారు. సత్యం తెలుసుకోవాలనే శ్రద్ధ అంతగా లేకుండా కేవలం సమాచారం కోసం చదివేవారికి, ఇది ఏమంత ఉపయోగం కాదు. కాని, ఎవరిలోనైతే ఏ మాత్రమైనా జ్వాలామయమైన అన్వేషణ ఉంటుందో, వారికి దీనిలోని మహరాజ్ జవాబులు జీవన జ్వరాన్ని సంపూర్ణంగా నివృత్తిచేసే అమృతవాక్కులలా పనిచేస్తాయి.
 
నాకు అత్యంత ప్రేమాస్పదమైన పుస్తకాలలో ఇది ఒకటి.
ఇది నెట్లో ఉచితంగా లభిస్తోంది. వారి మిగతా పుస్తకాలు కూడా ఇదే సైట్ లో దొరుకుతాయి.

క్రింది లింక్ అనుసరించండి.
http://www.holybooks.com/wp-content/uploads/I-Am-That-by-Sri-Nisargadatta-Maharaj.pdf

19 సెప్టెంబర్ 2012

ఒక్కొక్క కొత్తమనిషి

ఒక్కొక్క కొత్తమనిషి నా జీవితాన్ని దర్శించినప్పుడల్లా
నేను మరికొంత సంపన్నుడినయినట్లూ,
మరికొంత వెలుతురు నాలో పసిపాపలా పారాడుతున్నట్లూ ఉంటుంది
నా స్వప్న ప్రపంచంలో కొత్త రంగులు ప్రవేశిస్తాయి
ఇంతకు ముందు విని ఎరుగని పిట్టలూ, చూడని పూలూ
తెర ఏదో తొలిగినట్లయి దర్శనమిస్తాయి

ఒక్కొక్క కొత్తమనిషి నా కాంతిలోకి ప్రవేశించినపుడల్లా
అపుడే జీవించటాన్ని మొదలుపెట్టినట్లుంటుంది
నా పదాలు కొత్త అర్థాలలోకి మేలుకొంటాయి
ఒక చిరునవ్వు గాలిలో గిరికీలు కొట్టి వచ్చి నా భుజం మీద వాలుతుంది

జీవితమంటే ఇదీ అని ఇప్పటికింకా నిర్వచించుకోలేకపోయాను కానీ
నాముందు మసలే ప్రతి కొత్తమనిషీ దాని రహస్యమేదో చెప్పబోతున్నట్లనిపిస్తుంది

అయినా ఒక విషాదం సాయంత్రపు నీడలాగా నన్ను వెంటాడుతూ ఉంటుంది
ఒక్కొక్క కొత్తమనిషీ చూస్తూ ఉండగానే ఒక ప్రాచీన జ్ఞాపకంలా మారిపోతాడు
అతనిపై నాకై నేను పరిచిన సంతోషపు వెలుతురు పరదా జారిపోయాక
అతనొక చీకటిలో తడుస్తున్న దేవాలయం లా కనిపిస్తాడు

ఊరి నుండి ఊరికి తిరుగుతున్న విశ్రాంతిలేని బాటసారిలా
మనిషి నుండి మనిషికి ప్రయాణిస్తూనే ఉంటాను

బహుశా నేను కూడా ప్రతి మనిషిలోనూ
కొంత వెలుతురునీ, కొంత చీకటినీ ప్రవేశపెట్టి వెళతాననుకొంటా
నేను వెళుతున్నపుడు నా వెనుక ఏవో ప్రపంచాలని మోసుకొంటూ
కొన్ని చూపులు సీతాకోకల్లా అనుసరిస్తున్న చప్పుడేదో వినిపిస్తూ ఉంటుంది

బహుశా, చరమాంకంలో ఒకమనిషి వస్తాడు
జీవితమంటే ఏమిటి అని నేను అడిగినప్పుడు
అతను ఒక అద్దం తెచ్చి నాముందు ఉంచుతాడు
దానిలో నేను జీవితమంతా దర్శించిన వేలమంది మానవులు
దయగా నన్నుచూసి నవ్వుతారు

అప్పుడు
వారినవ్వులతో చెమ్మగిలిన శబ్దమొకటి
తాను వచ్చిన దారిని కనుకొని నిశ్శబ్దంలోకి మరలిపోతుంది


____________________________
నవ్య వీక్లీ ప్రచురణ: 26 సెప్టెంబరు 12

12 సెప్టెంబర్ 2012

'ఆకాశం' అందిన క్షణాలు: మానస చామర్తి


మంచి కవిత్వాన్ని ప్రేమించే ఒక పాఠకురాలు మానస చామర్తి.
ఆమె ఆకాశం కవిత్వాన్ని తన బ్లాగు లో ఇలా పలవరించారు.
ఇటువంటి సున్నితమూ, సునిశితమూ అయిన పరామర్శలే కవుల్ని మరింత సృజన చేసేలా కవిత్వోన్ముఖుల్ని చేస్తాయి.
ఒక మంచి అవార్డుతో సమానంగా కవి భావిస్తున్న వారి మాటల్ని చదవండి.


"పంచమహాభూతాలను తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలో
నిన్ను నువ్వూ నన్ను నేనూ మరిచిపోవడం కవిత్వం " 

- అని కవిత్వాన్ని నిర్వచించిన వ్యక్తి, అక్షరాలలో మహత్తును నింపి మునుపెరుగని మనోజ్ఞ ప్రపంచాన్ని మనకు పరిచయం చేయని మామూలు కవి ఎందుకవుతాడు? సున్నితమైన భావ పరంపరతో, ఆర్ద్రతతో, ఆశావహ దృక్పథంతో సృజింపబడి, "అపారమైన జీవితానుభవం లేనిదే, జీవించే కవిత్వం వ్రాయలేరు" అన్న ఒక సాహితీవేత్త సత్య ప్రవచనాన్ని పదే పదే గుర్తు చేసిన కవిత్వం, బి.వి.వి ప్రసాద్ గారి "ఆకాశం".

"ఆకాశం" చదివాక, అలతి పదాలతో, లోతైన భావాలను పలికించడం ఇంత తేలికా అని అనిపిస్తే, ఆ తప్పు మీది కాదు. కానీ, జీవితపు లోతులు తెలియకుండా, ఈ కవిలా ప్రగాఢమైన తాత్వికతను నరనరాల్లో నింపుకునే ఆలోచనేదీ లేకుండా, అవే పదాలను ఇటుకలు పేర్చినట్లు పక్కపక్కన పేరిస్తే అదీ కవిత్వమే అవుతుందనుకోవడం మాత్రం అపరాథమే అవుతుంది. అందుకే, ఈ సంపుటిని చదివే ముందు, ప్రసాద్ గారి సాహితీ నేపథ్యం కొంత తెలిసి ఉండటం లాభించే విషయమవుతుంది.

(జనవరి - మార్చి 2012 జయంతి త్రైమాసిక సాహిత్య పత్రికలో బి.వి.వి గారి నుండి సాహిథ్య నేపథ్యాన్ని, "ఆకాశం" రచన వెనుకనున్న ఆలోచనలను రాబట్టిన చర్చలో భాగం - )

"వచన కవిత్వం రాస్తున్నపుడు, హైకూల ద్వారా ఏ ధ్యానానుభవాన్ని, ప్రగాఢమైన నిశ్శబ్దాన్ని, నిర్మల హృదయ స్పందననీ ఇవ్వటానికి ప్రయత్నించానో, దానినే వచన కవిత్వంలో కూడా వ్యక్తీకరించాలనుకొన్నాను. హైకూలకు భిన్నంగా, కొంత భూమికనీ, కొంత వాతావరణాన్నీ సృష్టించటం వచనకవిత్వంలో సాధ్యమౌతుంది గనుక, అలాంటి వాతావరణాన్ని ఆవిష్కరించటానికి ప్రయత్నించాను. కవిత్వం రాస్తున్నపుడు, నాకు నేను కొన్ని నియమాలు లేదా గైడ్‌లైన్స్ పెట్టుకొన్నాను. పాఠకుడికి మరింత తేలికగా కమ్యూనికేట్ కావాలి. పాఠకుడు మొదలుపెడితే చాలు, చివరివరకూ చదివించటానికి తగిన వేగం ఉండాలి. ఏ భావాలు చెప్పినా, ఎప్పుడూ ఉండే సున్నితత్వంతో పాటు, ప్రగాఢమైన దయ అంతర్లీనంగా ఉండాలి. తాత్వికానుభవాన్ని మరింత స్పష్టంగా అందించాలి.  కవిత్వం పూర్తిగా గొంతువిప్పి మాట్లాడుతున్నట్లుండాలి.. ఇలాగ. నేను పెట్టుకొన్న నియమాలన్నిటినీ చాలా వరకూ పాటించగలిగాననే సంతృప్తి కలిగింది.

నా కవిత్వంద్వారా నేను వ్యక్తీకరించిన భావాలపై ఎవరి ప్రభావమూ లేదు. కొంతవరకూ టాగోర్, ఖలీల్‌జిబ్రాన్‌ల ప్రభావం ఉందనుకొంటాను. అయితే ఈ సాంద్రమైన భావాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే, నేను చదువుకొన్న తత్వచింతనలో ఉన్నాయనుకొంటాను.  - - బి.వి.వి.ప్రసాద్"

"అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా
ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టలా
నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి"             

-అని ఈ తాత్వికుడు ప్రశ్నిస్తాడొక సందర్భంలో. ఆయన ఈ పంక్తులు రాసినంత అలవోకగా, మనము ఆ ప్రశ్నలకు జవాబులు సాధించడం సాధ్యపడుతుందని నేననుకోను. పునఃపరిశీలిస్తే, కవి చెప్పదలచింది కేవలం బ్రతుకులోని నిర్మలత్వం, నిరాడంబరతలోని సౌందర్యం మాత్రమే కాదనీ, వీటికి భిన్నంగా జీవించదలచినవారికి, కనీసం వారి వారి లక్ష్యాల పట్ల, చేరాల్సిన గమ్యాల పట్ల ఉండవలసిన స్పష్టతను గుర్తు చేయడం కూడానేమో అనిపించింది. ప్రశ్నలు తెలిశాయి. జవాబులు జీవితంలో నుండి వెదుక్కోవాలిక, ఏకాంతాన్ని ఆలింగనం చేసుకున్న క్షణాల్లో!

ఈ రోజు ఎక్కడో ఏ పత్రికలోనో లేవయసు పిల్లవాడొకడు జీవితాంతం పోరాటం సాగించలేక మృత్యువు ఒడిని వెదుక్కుంటూ వెళ్ళాడని తెలిసి వగచి ఆ ఆవేశంలో, మనకే అర్థం కాని ఆరాటంతో కవితను రాయడం, మన దుఃఖానికి ఒక వారధిని నిర్మించుకుని ప్రపంచం మీదకు నెట్టడం. అలా కాక, అటువంటి వారెందరి జీవితాలనో పఠించి, ఆలోచనలను మధించి, నిరాశనో నిస్పృహనో కాక ఆశనూ, బ్రతకలాన్న బలీయమైన కాంక్షను కవితలో చూపెట్టదలిస్తే, అది ఈ సంపుటిలోని "వెళ్ళిపోవాలనుందా" కవితలా కదిలించే కవిత్వానికి నిర్వచనమవుతుంది.

"గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడవై ఆరోగ్యంగా జీవించు
మర్యాదల ప్రాకారాల ఊపిరాడని మనుషుల్ని దయతో పరిహసించు
సమర్థుల్ని ఈతల్లో కొట్టుకుపోనిచ్చి జీవితం గట్టున ప్రశాంతంగా నిలబడి చూపించు
బ్రతికేందుకు వచ్చావు కనుక బలంగా ఒక బ్రతుకు బ్రతికి చూపించు

కనీసం ఈ గంట బ్రతుకు, కనీసం ఈ రోజు బ్రతుకు
మళ్ళీరాని ఈ లోకంలో, ఇక మనకేమీ కాని లోకంలో
మరణిస్తే మరి ఉంటుందో లేదో తెలీని లోకంలో
చావు ధైర్యంతో ఎప్పటికీ బ్రతికి చూపించు, నిజమైన బ్రతుకు బ్రతికి చూపించు"

పైన ఉదహరించిన పాదాలు మాత్రమే కాక, మొత్తం కవితలో నన్ను ఆకర్షించినదేమిటంటే, కవి ఎవ్వరినీ ద్వేషించమనడు, ఎవ్వరినీ నిందించమనడు. కోపమో బాధో కాదు, కన్నీళ్ళు - కుంటి సాకులూ కాదు, బ్రతకడం నీ కర్తవ్యమంటాడు. నీ కోసం నువ్వు కాలపు కౌగిళ్ళలో నుండి మరొక్క రోజును దొంగిలించుకు దొరలా బ్రతికి చూడమంటాడు. శక్తికి మించిన లక్ష్యాలు, పరుగుపందాలుగా మారిన ఎడారి జీవితాల్లో గుర్రప్పందాలు కాసేపైనా మర్చిపోయి, ఇలా సేదతీరమని చెప్పే కవిత్వం ఈ రోజు మనకు చాలా అవసరం. లోలోపలి సామర్థ్యాన్ని మరొక్కసారి తరచి చూసుకోవటానికి, కనీసం వెళ్తున్న దారి మనమెంచుకున్న గమ్యాలకు చేరవేస్తుందో లేదో చూసుకోవడానికైనా మనిషికి విశ్రాంతి అవసరం. మనసుకు సాంత్వన అవసరం. బ్రతకాలన్న కాంక్ష అన్నింటికన్నా బలంగా అవసరం. ఇవేమీ లేని నాడు రేకులుగా విడివడుతున్న స్వాంతసరోజాన్ని ఒక్కటి చేయలేని అసమర్థతతో జీవితాన్ని ఛిద్రం చేసుకునే మనుష్యులను ఆపడమెవ్వరి తరమూ కాబోదు.

ప్రసాద్ గారు వచన కవిత్వంలోనే కాక, హైకూ రచనల్లోనూ నిష్ణాతులు. హైకూల మీద సాధికారంగా అనేకానేక వ్యాసాలు రాసి, దృశ్యాదృశ్యం, పూలు రాలాయి మొదలైన సంపుటాలు కూడా ప్రచురించారు. హైకూ తత్వమంతా మనిషిని ఈ క్షణంలో నిలబెట్టడంలోనే ఉంటుంది. మౌనాన్నీ, ధ్యాన స్థితినీ, దైవత్వం నిండిన అనుభూతులనీ అవి పరిచయం చేస్తాయి. ఆ ప్రక్రియలో ఆరితేరిన వారవడం వల్లా, ఆ సిద్ధాంతాలను మనస్ఫూర్తిగా నమ్మి నిజజీవితంలోనూ ఆచరించదలచిన పట్టుదల వల్లా, "ఆకాశం"లోనూ ఆ ధోరణిని కొనసాగిస్తారు..

"నీటి నడుముపై నీరెండ మునివ్రేళ్ళు చక్కిలిగిలి పెడుతున్న నవ్వులు" 
"చిత్రకారుని రేఖల వెంట తెల్లకాగితంపై తేలుతున్న బొమ్మలా / సర్దుకునే అలల వెంట కొలనులో తేరుకుంటున్న ప్రతిబింబంలా.."  
"ఉదయాస్తమయాల ఒడ్డుల్ని ఒరుసుకుని / ఒక వెలుతురు నది ప్రవహిస్తుంది"

వంటి బలమైన పదచిత్రాలు కవిత్వంలో కనపడ్డప్పుడల్లా ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి, ఆ చిత్రాల్లో మమేకమైన అనుభూతికి లోనయ్యాను. ఆ హైకూ క్షణాల్లోని దివ్యత్వాన్ని అనుభవించి కళ్ళు తెరిచాను. "అక్షరాల తీగెల్లో విద్యుత్తై విభ్రాంతినిస్తూ, మాట వెళ్ళిపోయాక మన మధ్య కాంతులీనే మౌనమై మిగులుతూ" పరవశింపజేసిన ఈ కవిత్వం నుండి త్వరగా బయటపడడం అసాధ్యం.

రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఖలీల్ జీబ్రాల్ తదితరుల ప్రభావం తన కవిత్వం పైనా, జీవితం పైనా ఉందని సగర్వంగా చెప్పుకునే ఈ కవి, "ఆకాశం"లోనూ ఆ తాత్వికతను నింపే ప్రయత్నాలు చేశారు. కవితాత్మక ధోరణిలో సాగిపోయే ఈ చింతన, ఆలోచనలు రేకెత్తించడంలో ఎక్కడా విఫలమవలేదు.

"అర్థరాత్రి చంద్రుని చుట్టూ అనేక ధ్యానాలు సృజించవచ్చు
అనేక ప్రార్థనల వెన్నెలలు చంద్రునికి అర్పించవచ్చు
అయినా చంద్రుడు చంద్రుడిలాగే ఉండిపోతాడు"

ఏది ఉందో అదే ఉంటుందనీ, ఈ క్షణాన్ని దొరకబుచ్చుకోవడంలోనే మనిషి మనుగడను రసరమ్యంగా మార్చగల రహస్యమేదో ఇమిడి ఉందనీ చాటే ఈ కవిత్వం మలి పఠనల్లో మరింతగా మనసుల్లో ముద్ర వేసుకుంటుంది.

"ఆకాశం"లోని ప్రతి కవితా, కొన్ని మౌలిక సిద్ధాంతాల చుట్టూ పరిభ్రమిస్తుంది. క్షమ, దయ, ఆర్ద్రత, స్నేహ భావం, మూర్తీభవించిన శాంతం ప్రతి కవితనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. కవి తత్వాన్నీ, సాహిత్య నేపథ్యాన్ని, ముందు మాటనూ చదవకుండా, కవిత్వాన్ని కవిత్వంలా కాక పుస్తకంలా చదివే అలవాటున్న పాఠకులకు ఈ సంపుటి పునరుక్తి దోషాలతో నిండి ఉందనే భ్రమ కలుగవచ్చు. కవిత్వమంటే అక్షరమక్షరానా మార్మికత ఉండాలనీ, సంక్లిష్ట పదాడంబరం ప్రతి పుటలోనూ తాండవమాడాలనీ, అలా కానిది కవిత్వం కాదనీ అపోహల్లో బ్రతికే వారికి ఈ పుస్తకం పట్ల చిన్న చూపు కలుగుతుందేమో, - ఆ అభిప్రాయం తప్పనీ, ఒక్కో కవితా చదవగానే నీ హృదిలో నెలకొనే ప్రశాంతతా, కొన్ని సందర్భాల్లో పొడజూపే పశ్చాత్తాపమూ, లోలోపల కరిగిన అహానికి ప్రతీకగా జారే కన్నీరు, ఈ కవిత్వపు విలువని నిశ్చయంగా బలపరుస్తాయనీ చెప్పాలని ఉంది.

సరళతే ఆకాశానికి పట్టుకొమ్మ. ఈ ప్రాథమిక సత్యాన్ని అవగతం చేసుకోవడం, అనిర్వచనీయమైన అనుభూతులను అందుకోవాలనుకునే పాఠకులకు అవసరం. మొత్తం వంద కవితలు ఉన్న ఈ సంపుటిలో ఐదారింటిని మినహాయిస్తే, మిగిలినవన్నీ అగాధమంత లోతైనవీ, ఆకాశమంత విశాలమైన భావ పరిథిని కలవి. 86 మొదలుకుని ఒక పది కవితలు జీవితంలో వివిథ రకాలుగా తనను ప్రభావితం చేసిన పూజ్యులకో, మిత్రులకో కవి ప్రేమతో, సభక్తితో సమర్పించిన నివాళులున్నాయి. అవన్నీ వ్యక్తిగతాలే అయినా కూడా ఎంత బాగున్నాయంటే, వారందరి సత్సంగత్వంతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్న తీరు చూసి అసూయపడేంతలా..!

సంఘంలోని ఆలోచనాపరులను ఆత్మావలోకనం చేసుకునే దిశగా అడుగులు వేయించగలిగితే, అంతకు మించి కవిత్వం సాధించగల పరమార్థం వేరొకటి ఉంటుందనుకోను. మానవ జీవితాలు వికాసోన్ముఖంగా సాగాలన్న అవగాహనతోనూ, తాత్విక వివేచనతోనూ కవితాత్మను పట్టుకునే ప్రయత్నంలో, బి.వి.వి గారు నూటికి నూరుపాళ్ళూ సఫలీకృతులైనారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

"నిరవధికమైన సమాజంలో నివాతదీపమై కాపడవలసింది మానవత్వమనీ దానికి ఏ రూపంలో కేతనాలెత్తినా అని మంచి కవిత్వమ"నీ ప్రతిపాదించిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి మాటల సాక్షిగా, "ఆకాశం" ఈ తరం తప్పక చదవాల్సిన కవిత్వం. పది మంది చేత చదివించబడవలసిన సున్నితమైన, సమున్నతమైన కవిత్వం.

శతవిధాల ప్రయత్నించినా, అచ్చుతప్పులు కనపడని మంచి ముద్రణతో వెలువడ్డ "ఆకాశం" వెల - 70/- ;
ప్రతులకు - పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్, ఫోన్- 040-27678430.
Kinige Link :  http://kinige.com/kbrowse.php?via=author&name=BVV+Prasad&id=125

02 సెప్టెంబర్ 2012

బి.వి.వి.ప్రసాద్ హైకూలు – ఒక పరిచయం: శ్రీనివాస్ వురుపుటూరి


నిన్న పుస్తకం.నెట్ చూస్తున్నపుడు 2011 జనవరిలో బివివి ప్రసాద్ హైకూ పుస్తకాలపై శ్రీనివాస్ వురుపుటూరి రాసిన వ్యాసం కనిపించింది. మనిషికి నిజంగా శాంతినిచ్చేదీ, కాసేపైనా అతన్ని నిజమైన జీవితంతో నింపి, జీవన సంఘర్షణల లోకి మరలా తాజాగా, మరింత వివేకం తో, శక్తితో ప్రవేశించటానికి తనవంతు సహాయం చేసేదీ గుణాత్మక (positive) మైన కవిత్వమని, మనం మాట్లాడే మాట సత్యం, ప్రియం, హితం ల మేలుకలయికగా ఉండటమే అక్షరోపాసన అనీ నమ్మి, రాస్తున్న కవిత్వానికి, ఆ నమ్మకాన్ని రుజువు చేసిన పాఠకుడు ఎవరైనా ఎదురైనపుడల్లా, అతను నాకు, నీ మార్గం మంచిది, నువ్వు నడవాలి, దు:ఖితుల్ని నడిపించాలి నీ కవిత్వం లోకి అని వెన్ను తట్టినట్టు అనిపిస్తుంది. చదివి ఊరుకోకుండా పదిమందికీ పరిచయం చేసిన శ్రీనివాస్ వురుపుటూరిగారి సహృదయానికి నమస్సులు.  పుస్తకం.నెట్ వారి సౌజన్యంతో ఆ వ్యాసం లింక్ నీ, వ్యాసాన్నీ ఇక్కడ పొందుపరుస్తున్నాను. లింక్ ఇక్కడ చూడవచ్చు.

ఓ పది పన్నెండేళ్ళ క్రితం, కవిత్వం చదివి ఇప్పటికన్నా బాగా స్పందించగలిగిన కాలంలో, ఓ రెండు హైకూ సంకలనాలను కొనుక్కున్నాను. కవి పేరు బి.వి.వి.ప్రసాద్. పుస్తకాల పేర్లు: 1) హైకూ 2) పూలు రాలాయి

అంతకు మునుపు, చివరాఖరి ఎనభైలల్లో, హైకూల గురించి చేరా గారు రాయగా చదివినప్పుడూ, అడపాదడపా పెన్నా శివరామకృష్ణ గారివో, గాలి నాసర రెడ్డి గారివో హైకూలను చూసినప్పుడూ, అర్థం కాక – “ఇదేదో కవిత్వంలో పొదుపు ఉద్యమంలా ఉంది” అని అనుకున్నాను చాలాకాలం. ప్రసాద్ గారి హైకూలను చదవటం నాకు కనువిప్పు కలిగించింది.

హైకూ ఒక జపానీయ ఛందో రీతి. పదిహేడు మాత్రలకి పరిమితం. ఆ మాట వినగానే (ఒకోసారి, ఆ మాట వినకపోయినప్పటికీ) హైకూలను మినీ కవితలతోనో, నానీలతోనో పోల్చి కవిత్వపు ఫాషన్‌గా కొట్టిపారేస్తారు కొందరు. కానీ, వీటికీ హైకూలకీ బోలెడంత వ్యత్యాసం! మినీ కవితలూ, నానీలూ చమత్కారికల్లా ఉంటాయి. కోటబిలిటీ కోసం రాసినట్లుంటాయి. హైకూ మాటో? హైకూకి ఓ తాత్త్విక నేపథ్యం ఉంది! కొన్ని వందల ఏళ్ళుగా సాగి వస్తున్న సజీవ సంప్రదాయం, హైకూ. తత్త్వమెరిగిన కవి రాసిన హైకూ పాఠకుడికి ఎంతో విశిష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. అందుకు అందమైన సాక్ష్యాలు ఇప్పుడు మీకు పరిచితమవుతున్న ఈ రెండు పుస్తకాలు.

నాకు అర్థమైనంతలో –
హైకూ కవితకి బాగా నప్పే వస్తువులు ప్రకృతీ, పసిపిల్లలున్నూ. హైకూ కవి మనః ప్రవృత్తిలో అపరిమితమైన సంవేదనాశీలతా, సునిశిత పరిశీలనా శక్తీ, ఏకాంత ప్రియత్వమూ, మామూలు వస్తువుల్లో అనుభవాలలో కొత్తదనాన్ని పట్టుకోగల లోచూపూ, ఓ రకమైన నిర్మోహత్వమూ, తనని తాను మరుగు పరచుకోగల వినమ్రతా భాగమై ఉండాలి. శాంతమూ, కరుణా, సున్నితమైన హాస్యమూ – ఇవీ హైకూ కవితకి ప్రధాన రసాలు.

సూచనాప్రాయంగా చెప్పి పాఠకుడిని ఒక ధ్యానస్థితిలోకి, ఒక సున్నితత్వంలోకి తీసుకెళ్ళటంలో ఉంటుంది కవి నేర్పు. అయిదారు పొడి మాటలతోనే ఓ పదచిత్రం గీయాలి, అంతే! ఆ తరువాత పని పాఠకుడికి వదిలేయాలి. “చంద్రుడిని చూపించే వేలు” అని వర్ణించారు హైకూని ఇస్మాయిల్ గారు, దృశ్యాదృశ్యం పుస్తకానికి సమకూర్చిన భూమికలో.

ప్రసాద్ గారి హైకూలని చదివాక కలిగే ఊరటా, ఆహ్లాద భావనా, జాగృతమైనట్లనిపించే సంవేదనాశీలతా అనుభవైకవేద్యాలు. నా ప్రయాణాల్లో, ప్రవాసాల్లో, ఈ హైకూ సంపుటాలను నా దగ్గర ఉంచుకునే వాణ్ణి నేను. ఓ ఒంటరి రాత్రి తటాలున ఏదో ఓ పేజీ తెరిచి, హృదయాన్ని తాకే హైకూలను ఒకటో రెండో చదివి, నిశ్చలత్వాన్నో, సన్నని కదలికనో, ఓ సున్నితమైన స్పందననో అనుభూతిలోకి తెచ్చుకోవటం ఎంత బావుంటుందో!

కవయిత్రి ఓల్గా గారిలా అన్నారట, ప్రసాద్ గారికి రాసిన ఓ ఉత్తరంలో: “వంద భయాలతో, వేయి ఆందోళనలతో సతమతమవుతున్న సందర్భంలో మీ రాలిన పూలు అందుకున్నాను. క్షణంలోనే నా మనస్సు ఒక నిష్కళంకమైన, ప్రసన్నమైన విషాదానుభూతితో నిండిపోయింది” (డేవిడ్ షుల్మన్ గారి  Spring, Heat, Rains: A South Indian Diary నుంచి. ఓల్గా గారి అనుభూతిని వర్ణించేందుకు ఆయన వాడిన పదబంధం: “immaculate, serene sorrow”). తన మిత్రులకి పంచిపెట్టేందుకని ఓ వంద ప్రతులను కొనుక్కున్నారట ఆవిడ.

ఈ రెండు పుస్తకాలకి కవి రాసుకున్న పరిచయ వ్యాసాలు ఎంతో విలువైనవి. హైకూ సంకలనం లోని ‘ప్రకృతీ, జీవితం హైకూల మయమే’ నుంచి కొన్ని వాక్యాలు ఉదహరిస్తాను:
“దృశ్యానికీ, అదృశ్యానికీ; శబ్దానికీ, నిశ్శబ్దానికీ మధ్య సున్నితమైన సరిహద్దు రేఖ హైకూ. హైకూ కవి ఆ సరిహద్దుల్లో సంచరిస్తూ ఉంటాడు. దృశ్యం నుంచి అదృశ్యానికీ, శబ్దం నుంచి నిశ్శబ్దానికీ కవి పాఠకుని తీసుకెళతాడు. ఆ నిశ్శబ్దం శబ్దం కంటే చైతన్యవంతంగానూ, అదృశ్యం దృశ్యం కంటే రసమయంగానూ ఉంటాయి.”
“హైకూ కవికి ప్రపంచమంటే ప్రేమ ఉంటుంది. ఉదాసీనత కూడా ఉంటుంది. వేరువేరు సమయాలలో కాక, రెండూ ఏకకాలంలో ఉంటాయి. ప్రేమ శిఖరాగ్రానికి చేరినపుడు, సాధారణ దృష్టికి అది ఉదాసీనతలా గోచరిస్తుంది. ప్రతి క్షణం, ప్రతి చర్యలో తాను ప్రేమించాల్సింది దేన్నో గుర్తిస్తూనే వుంటాడు. పక్షిని ప్రేమించేవాడు పంజరంలో పెడతాడు. పక్షిని ప్రేమించటం అంటే పక్షి స్వేచ్ఛని ప్రేమించటమే అని తెలిసిన వాడు ఉదాసీనుడిగా కనిపించే మహా ప్రేమికుడవుతాడు.”
“మంచి హైకూ కవి కావటానికి, ఒకరు ముందు కవి కావాలి. తరువాత కవి కాకుండా పోవాలి.”
“హైకూ రాయటం సులువే. మంచి హైకూ రాయటం మరీ సులువు. హైకూ కవి కావటమే కష్టం.”

ముగించే ముందు కొన్ని హైకూలు:

చేయి పట్టుకుంది నిద్రలో,
పాప కలలోకి
ఎలా వెళ్ళను?

నీటి పై

రాలిన పూవుని
ప్రతిబింబం చేరుకుంది

ఎంత అందంగా నవ్విందీ!

పాపాయికి చెప్పాలి
పెద్దయ్యాక

గాలి.

పూలు ఊగాయి
వాటిపై సీతాకోకా

ఆమె వచ్చి అంది.

“చందమామ”
మళ్ళీ నిశ్శబ్దం

చేప దొరికింది

విలవిల్లాడింది
కొలను

రాలిన చినుకు

ఆకాశం వైపు
ఎగిరింది బెంగతో

నక్షత్రాకాశం

మెట్ల దారి
కొండ మీద గుడి వరకూ

ఈ అక్షరాలు చూస్తారు

కానీ ఈ కాగితం చుట్టూ
ఉన్న నిశ్శబ్దాన్నీ, రాత్రినీ…

కలలో ఎవరో అన్నారు

మేలుకో… మేలుకో…
కానీ ఎలాగో చెప్పలేదు!

ఈ రెండు కవితా సంపుటాలూ దొరికితే విశాలాంధ్రలో దొరకవచ్చును. లేదా బి.వి.వి.ప్రసాద్ గారినే నేరుగా సంప్రదించండి. నాకు తెలిసిన చిరునామా:

*     *     *

నా హైకూ సంపుటాలూ, వ్యాసాలూ, నా హైకూలపై ఇస్మాయిల్, సంజీవదేవ్, ఓల్గా గార్ల మాటలూ అన్నీ కలిపి, ఈ బుక్ రూపం లో కినిగే.కాం లో లభిస్తున్నాయి. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.